పెద్దపులి విజయం!

అనగనగా ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. అదే అడవిలో ఒక పెద్దపులి చాలా కాలంగా రాజు కావాలనుకునేది. కానీ దానికి సింహానికి ఉన్న కండ బలం కానీ, తెలివితేటలు కానీ ఉండేవి కావు.

Published : 04 Feb 2023 00:00 IST

నగనగా ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. అదే అడవిలో ఒక పెద్దపులి చాలా కాలంగా రాజు కావాలనుకునేది. కానీ దానికి సింహానికి ఉన్న కండ బలం కానీ, తెలివితేటలు కానీ ఉండేవి కావు. ఇతర జంతువులతో ఆ పులి చాలా స్నేహంగా ఉండేది. ఎంత ఆకలైనా కానీ చిన్నచిన్న జీవులను చంపి తినేది కాదు. అడవిని పాలించే సింహం మాత్రం మృగరాజు అనే పేరుకు కళంకం తెచ్చేలా రోజుకో జంతువును వేటాడి చంపి తినేది. చిన్న, పెద్ద జీవులు అనే భేదం లేకుండా కనిపించిన ప్రతి జంతువునూ అది వేటాడేది.
‘ప్రభూ! ఇలా చిన్నచిన్న జీవుల్ని చంపి తినటం న్యాయం కాదు. వాటిని అడవిలో స్వేచ్ఛగా తిరగనీయండి’ అని సింహాన్ని కోరింది పులి. సింహం పెద్దగా గర్జించి, పులి మాటలు పెడచెవిన పెట్టింది. ఆ అడవిలో అనేక జంతువులు పులి.. రాజుగా వస్తే బాగుంటుంది అనుకున్నాయి. ఒకరోజు ఏనుగు, ఎలుగుబంటి, నక్క మొదలైన జంతువులు పులిని చేరుకొని... ‘మిత్రమా! నువ్వు ఆ సింహంపై యుద్ధాన్ని ప్రకటించు. రణంలో దాన్ని ఓడించి, ఈ అడవికి రాజుగా మారి జంతువులనుË కష్టాల నుంచి గట్టెక్కించు’ అని కోరుకున్నాయి.

‘మిత్రులారా! నన్ను రాజుగా చూడాలనుకోవటం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నా వెంట ఉంటే తప్పక సింహంపై యుద్ధం ప్రకటించి దానిపై గెలుస్తాను’ అంది పులి. ఒకరోజు కాకితో సింహానికి కబురు పంపింది పులి. ‘మృగరాజా! ఎంతోకాలంగా మీరు రాజుగా ఉన్నారు. సమస్యలు పెరిగాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నేను రాజుగా ఉండటానికి మీపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. వచ్చే పౌర్ణమి నాడు యుద్ధానికి సిద్ధంగా ఉండండి’  అంటూ కబురు పంపింది.
పౌర్ణమి రానే వచ్చింది పులి తన సమూహంతో సింహం మీదకు యుద్ధానికి వెళ్లింది. కానీ ఆ యుద్ధంలో పులి ఓడిపోయింది. ‘నా శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు తెలియక నాపై యుద్ధానికి వచ్చావు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. మరెప్పుడు రాజుగా ఉండాలన్న ఆలోచన కూడా నీలో కలుగకూడదు’ అంటూ పులిని వదిలేసింది సింహం.
దాంతో పులి తలవంచుకొని పక్క అడవిలో ఉండే తన మిత్రుడు కోతి దగ్గరికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కోతి.. ‘మిత్రమా! నువ్వు నిజానికి సింహానికన్నా బలహీనుడివే... అంతమాత్రాన నిరాశ చెందవద్దు. మనం ఎవరిలా ఉండాలనుకుంటామో వారి బలాలను గుర్తించి వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తే... వారిని మించిన వారమవుతాం’ అంది కోతి. ఆ మాటలకు పులికి ధైర్యం వచ్చింది.
‘మిత్రమా! నీ మాటలు వింటుంటే నాలో ఎక్కడాలేని ధైర్యం వస్తోంది. ఆ సింహంపై తప్పక విజయం సాధిస్తాననే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి’ అంది పులి. తనలో లేని విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకొని ఆ విద్యలను కష్టపడి, ఇష్టపడి నేర్చుకొని కొంతకాలం తర్వాత, తిరిగి తన అడవికి వెళ్లింది. పులి రాకను గమనించిన తోటి మిత్రులు ఎంతో సంతోషించాయి. ‘మిత్రమా! నువ్వు వెళ్లాక, ఆ సింహం ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. నువ్వే మమ్మల్ని కాపాడాలి’ అన్నాయి.
పులి తిరిగి యుద్ధాన్ని ప్రకటించింది. ‘నువ్వు గతంలో నా మీదకు యుద్ధానికి వచ్చి, ఓడిపోయావు. కానీ జాలితో నిన్ను ప్రాణాలతో వదిలేశా. నీకు ఏమాత్రం ప్రాణాల మీద ఆశ ఉన్నా ఈ యుద్ధాన్ని విరమించుకో’ అని గర్జించింది సింహం. ఒక మంచి పని కోసం ప్రాణాలు పోయినా ఫర్లేదు అని నిర్ణయించుకుంది పులి. మరుసటి రోజే యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పి వెళ్లింది పులి.
సింహం తన సైన్యంతో, పులి తన మిత్రులతో తలబడ్డాయి. పోరాటం భీకరంగా సాగింది. పులి తాను నేర్చుకున్న విద్యలను, ఎత్తుకు పై ఎత్తులను ప్రదర్శించి సింహాన్ని ఓడించింది. ఆఖరుకు సింహం ప్రాణ భయంతో అడవిని వదిలి పారిపోయింది. అప్పటి నుంచి ఆ అడవికి, పులి.. రాజుగా వ్యవహరించింది.
అది తోటి జంతువులన్నింటినీ సమావేశపరిచి... ‘మిత్రులారా! ఆకలి కోసం మనం తోటి జంతువులను చంపి తినటం న్యాయం. కానీ అన్యాయంగా అభం శుభం తెలియని చిన్ని జంతువుల జోలికి మాత్రం వెళ్లకండి. నేను కూడా ఆకలైతే తప్ప ఇతర జీవుల జోలికి పోను. అనవసరంగా వాటిని చంపను’ అంది పులి. తన మిత్రుడు కోతిని మంత్రిగా నియమించుకుంది. దాని సలహాలు తీసుకుంటూ పులి చక్కగా అడవిని పాలించింది.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని