Story: వేణు దిద్దిన వ్యాపారం!

‘రండి.. రండి.. పిల్లలూ! మీకేం కావాలో చెప్పండి ఇస్తాను’ అన్నాడు చలమయ్య. పిల్లలంతా అతని బండి చుట్టూ మూగారు. వారికేమేమి కావాలో చెబుతూంటే చలమయ్య వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వారు కోరిన తినుబండారాలు ఇస్తున్నాడు. వాళ్లు సంతోషంగా.. ‘అబ్బా ఎంత బాగున్నాయో?’ అని ఆనందంగా తింటున్నారు. వారిలో వేణు కూడా ఉన్నాడు. ‘నాకూ ఇవ్వు నాన్నా’ అన్నాడు వేణు. అసహనంగా చూశాడు చలమయ్య.

Published : 06 Jun 2024 01:14 IST

‘రండి.. రండి.. పిల్లలూ! మీకేం కావాలో చెప్పండి ఇస్తాను’ అన్నాడు చలమయ్య. పిల్లలంతా అతని బండి చుట్టూ మూగారు. వారికేమేమి కావాలో చెబుతూంటే చలమయ్య వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వారు కోరిన తినుబండారాలు ఇస్తున్నాడు. వాళ్లు సంతోషంగా.. ‘అబ్బా ఎంత బాగున్నాయో?’ అని ఆనందంగా తింటున్నారు. వారిలో వేణు కూడా ఉన్నాడు. ‘నాకూ ఇవ్వు నాన్నా’ అన్నాడు వేణు. అసహనంగా చూశాడు చలమయ్య. ‘నీకెన్నిసార్లు చెప్పాను? ఇక్కడ నన్నేమీ అడగొద్దని.. ఇంటికి పద.. అక్కడ అమ్మ ఇస్తుంది’ అన్నాడు కోపంగా. పాపం వేణు బిత్తరపోయాడు. ఈ రోజే కాదు. ప్రతి రోజూ ఇదే తంతు. తను అడగడం. నాన్న ఇవ్వకపోవడం. పైగా తనను కసురుకోవడం. తనకు కూడా తన స్నేహితులతో కలిసి ఆ తినుబండారాలు తినాలని చాలా కోరిక. కానీ నాన్న తనకు చిన్న ముక్క కూడా పెట్టడు. పైగా తిడతాడు. చలమయ్య వేణును కసురుకోవడం చూసి తక్కిన పిల్లలకు జాలేసింది.
 ‘పోనీలే, మీ నాన్న నీకివ్వకపోతే ఏం? ఇవి మా డబ్బులతో కొనుక్కున్నవి కదా! ఇంద తిను’ అని ఇవ్వబోతే వాటిని కూడా ఇవ్వనివ్వలేదు చలమయ్య. పైగా.. ‘ఇక వెళ్లండి మీ ఇళ్లకు’ అని వాళ్లను కూడా కసురుకున్నాడు. దాంతో పిల్లలు బిక్కమొహాలేసుకొని తుర్రుమని పారిపోయారు. చలమయ్య వేణు వంక చూశాడు. మొహం కళ తప్పి ఉంది. ‘వేణూ, నువ్వు ఇంటికి వెళ్లు. నేను బేరాలు చూసుకొని వస్తాను. ఇంటి దగ్గర అమ్మ నీకు పెడుతుందిలే’ అన్నాడు చలమయ్య. వేణు బాధగా ఇంటిముఖం పట్టాడు. నడుస్తూ ఆలోచిస్తున్నాడు. 
 తన తండ్రి బడి దగ్గర తినుబండారాల బండి నడుపుతున్నాడు. రోజూ సాయంత్రం తన బడి పిల్లలే కాక, ఇంకా ఆ దారిన పోయే చాలా మంది చలమయ్య బండి దగ్గర ఆగి, వేడి వేడి పకోడీలు, బజ్జీలు, సమోసాలు, జిలేబీలు కొనుక్కొని వెళుతుంటారు. కొంతమంది పార్సిళ్లు కూడా పట్టుకెళతారు. సాయంత్రమైతే చాలు చలమయ్య కొట్టు జనంతో కళకళలాడుతుంది. అతడొక్కడే అవలీలగా తను తయారు చేసిన చిరుతిళ్లు అన్నీ అమ్మేసి డబ్బుల మూటతో రాత్రికల్లా ఇంటికి చేరుతాడు. ఎప్పుడూ మిగిలి పోయినవి అంటూ ఉండవు. ఆ బండి మీదే తమ కుంటుంబమంతా బతుకుతోంది.  

ఇంటికి వెళ్లాడు వేణు. కాళ్లూ చేతులూ కడుక్కొని అమ్మ పెట్టే తినుబండారాల కోసం కూర్చున్నాడు. తల్లి ఒక ప్లేటులో ఎప్పుడో తను తయారు చేసిన లడ్డూలు, జంతికలు పట్టుకొని వచ్చింది. అవి తను రోజూ తింటున్నవే! నీరసంగా కొన్ని తిని తర్వాత ట్యూషన్‌కు వెళ్లిపోయాడు వేణు. అక్కడికి తన స్నేహితులు కూడా వస్తారు. ట్యూషన్‌ అయిపోయాక వేణు, రాము ఇంటికి వెళ్లాడు. రాముకు ఒంట్లో బాలేదు. ఆసుపత్రికి వెళ్లాడు. మరో రోజు రాజుకు సుస్తీ చేసింది. ఇంకో రోజు శ్రీనుకు అనారోగ్యం! అన్యమనస్కంగా ఇంటికి వెళ్లాడు వేణు. కొన్ని రోజులయ్యాక ఒకరోజు చలమయ్యకు జ్వరం వచ్చింది. 

‘వేణూ! ఇప్పుడు నీకు సెలవులే కదా. కాస్త మన బండి దగ్గరకు వెళ్లు బాబూ’ అంది తల్లి. ‘అమ్మా, నాకేం తెలుసనీ నన్ను వెళ్లమంటున్నావు’ అన్నాడు వేణు. ‘నువ్వేమీ చేయొద్దు బాబూ. అంతా కిష్టయ్య చూసుకుంటాడు. నాన్నకు బాలేదని చూడ్డానికి వచ్చాడు. నాన్నకు తగ్గాక వెళతాడు. అన్ని తినుబండారాలు అతడే తయారు చేసి అమ్ముతాడు. నువ్వు డబ్బులు మాత్రమే తీసుకో’ అని చెప్పాక వేణు అయిష్టంగా కదిలాడు. నాలుగు రోజులు గడిచాక, చలమయ్యకు ఆరోగ్యం చేకూరి వ్యాపారం చూసుకుంటున్నాడు. కిష్టయ్య వెళ్లిపోయాడు. కానీ వేణు ఇంట్లో అందరి మీదా అలిగాడు. అన్నం తినడం మానేశాడు. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. 

‘చెప్పు బాబూ! ఏం జరిగింది? నువ్వెందుకు అలిగావు? నీకేం కావాలో చెప్పు. నాన్న తెస్తారు. అలిగి అన్నం మానకూడదు’ అని ఎంతో బుజ్జగించారు వేణు అమ్మానాన్నా. అప్పుడు నోరు విప్పాడు వేణు. ‘నేను చెప్పినట్టు మీరు చేస్తానంటేనే అన్నం తింటాను. లేదంటే భోజనం చేయను’ అని భీష్మించుకు కూర్చున్నాడు. తల్లిదండ్రులు మాటిచ్చాక వేణు నోరు విప్పాడు. ‘నాన్నా! వ్యాపారంలో బాగా డబ్బులు గడించడానికి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. నేను ఒక పుస్తకంలో చదివాను. జబ్బులకు మీరు కారణం అవుతున్నారు. ఎలా అంటే చిరుతిళ్లు తయారు చేయడానికి మీరు ఒకసారి వాడిన నూనెనే పదే పదే ఉపయోగిస్తున్నారు. అలా వాటితో వండిన మీ తినుబండారాలు.. జనమే కాదు.. మా బడి పిల్లలు కూడా ఎగబడి తింటున్నారు. దాని వల్ల పిల్లలకే కాదు పెద్ద వాళ్లకు కూడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. నా స్నేహితులు ఆసుపత్రుల పాలయ్యారు. నేను కళ్లారా చూశాను. మీరు వాడుతున్న నల్లని నూనెను కిష్టయ్య డబ్బాలో పట్టుకెళ్లి, దాన్ని చిరుతిళ్లు తయారు చేయడానికి ఉపయోగించాడు. నేను వద్దని చెప్పినా అతడు నా మాట విన్లేదు. మీరు ఈ పద్ధతి మానుకుంటే తప్ప నేను భోజనం చేయను’ అని ఏడుస్తూ చెప్పాడు వేణు. దాంతో తల్లిదండ్రుల మనసులు కరిగాయి. చిన్నవాడయినా వేణు మాటను తు.చ. తప్పకుండా పాటించాడు చలమయ్య. 

నంద త్రినాథరావు  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని