కర్మ యోధుడు

గురువులను మామూలు వ్యక్తులుగా, మంత్రాలను సాధారణ అక్షరాలుగా, దేవుణ్ని కేవలం విగ్రహంగా- పొరబడటం లోక సహజం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి విషయంలోనే అది సంభవించింది! అలా కాక, కృష్ణుణ్ని అవతార పురుషుడిగా గుర్తించిన వివేకవంతుల్లో భీష్మపితామహుడు అగ్రగణ్యుడు. ‘భగవంతుం డితడంచు స్పష్టపడియెన్‌’ అని ఆయనే వెల్లడించాడు. అంతే కాదు, అర్జునుడు నరనారాయణుల్లో మొదటివాడని నారదుడి ద్వారా గ్రహించాడు. .....

Published : 07 Feb 2017 18:24 IST

కర్మ యోధుడు


గురువులను మామూలు వ్యక్తులుగా, మంత్రాలను సాధారణ అక్షరాలుగా, దేవుణ్ని కేవలం విగ్రహంగా- పొరబడటం లోక సహజం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి విషయంలోనే అది సంభవించింది! అలా కాక, కృష్ణుణ్ని అవతార పురుషుడిగా గుర్తించిన వివేకవంతుల్లో భీష్మపితామహుడు అగ్రగణ్యుడు. ‘భగవంతుం డితడంచు స్పష్టపడియెన్‌’ అని ఆయనే వెల్లడించాడు. అంతే కాదు, అర్జునుడు నరనారాయణుల్లో మొదటివాడని నారదుడి ద్వారా గ్రహించాడు. వారిని జయించడం సాధ్యంకాదని, అందుకే దుర్యోధనుడికి ఆయన చాలాసార్లు నచ్చజెప్పాడు.

కృష్ణపరమాత్మను గుర్తించడంలో భీష్ముడికి తోడ్పడింది చర్మ చక్షువులు కావు, వివేకం అనే మూడో కన్ను! దాన్నే ‘జ్ఞాన నేత్రం’ అంటారు. ఆయన కళ్లతో కృష్ణపరమాత్మను దర్శించే ప్రయత్నం చేయడమే- భీష్మ ఏకాదశినాడు ఆ మహాపురుషుడికి నివాళిగా మనం భావించాలి. దానికి పోతన ఒక మంచి దారి చూపించాడు.

భాగవతంలో ‘త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప...’ అనే పద్యాన్ని ఎంతో మంది చదువుతూనే ఉంటారు. ఆ రకమైన చదువులో విశేషం ఏదీ లేదు. అలా పొడిపొడిగా కాక- ‘దీపింప... ఉద్దీపింప... తనువుద్దీపింప... కాంతి తనువు ఉద్దీపింప... నీలకాంతి తనువుద్దీపింప...’ అంటూ అక్షరాలను పెళ్ళగించి చూడాలి. విశేషణాలను ఒక్కొక్కటిగా భావన చేస్తూ, ఆ దివ్యకాంతి పరివేషంలో లీనమవుతూ, మనసుతో అనుశీలిస్తే- కృష్ణుడు మన మనసులను నిండుగా ఆవహిస్తాడు. ‘విజయుం చేరెడి వన్నెకాడు నా మది నావేశించు నెల్లప్పుడున్‌’ అని ఆ పద్యంలో భీష్ముడు సూచించిందదే! ఆ దివ్య సాక్షాత్కార అనుభూతిని మనకూ దక్కేలా చూడటమే భీష్మ ఏకాదశి పర్వ నిర్వహణలోని ఆంతర్యం.

‘పాండవులను చంపను’ అని భీష్ముడు కచ్చితంగా తేల్చిచెప్పడానికి కారణం- బంధుప్రీతో, వాత్సల్యమో కావు. భీష్మ పితామహుడి సునిశిత ధార్మిక ప్రవృత్తికి అసలు సిసలు వారసుడు- ధర్మజుడు. ఆయన పరాక్రమ దీధితులకు ప్రతినిధి అర్జునుడు. ఏ ధర్మ, వీర సంప్రదాయ పరిరక్షణకోసం చిరకాలంగా భరత వంశానికి, హస్తినకు రక్షణ కవచంగా భీష్ముడు నిలిచాడో, తపించాడో- ఆ సంప్రదాయ సంరక్షణ బాధ్యతను ఆయన అనంతరం స్వీకరించగల యోద్ధలు- ధర్మజుడు, అర్జునుడే! భీష్ముడి వంశప్రతిష్ఠను కొనసాగించగల రక్తసంబంధీకులు వారిద్దరూ!

యుద్ధం ప్రారంభించే క్షణాల్లో ధర్మరాజు తనను సమీపించి సంగ్రామానికి అనుమతి కోరకుంటే- ‘అతణ్ని శపించి ఉండేవాణ్ని’ అంటాడు భీష్ముడు. ధర్మజుడి లౌక్య ప్రవృత్తికి చిహ్నంగా కాక, ఆ చర్యను- ధర్మ వీర సంప్రదాయజ్ఞతకు కొనసాగింపుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకు భీష్ముడి మాటే దారి చూపిస్తుంది.

భీష్మాచార్యుడు కౌరవ పక్షాన నిలిచి యుద్ధం చేయడమే వాస్తవానికి శ్రీకృష్ణుడి అభిమతం. ఆయన దిగివచ్చిందే భూభారాన్ని తగ్గించేందుకు! పాండవ పక్షంలోనూ జన క్షయం కానిదే- కృష్ణుడి లక్ష్యం నెరవేరదు. రోజుకు పదివేలమందిని చంపుతానని చెప్పి మరీ చంపేశాడు భీష్ముడు. అలా గతించినవారంతా పాండవ పక్షంవారు. కౌరవుల వైపు పదకొండు అక్షౌహిణుల మహాసైన్యాన్ని భీమార్జునులు మట్టుపెట్టేశారు. శ్రీకృష్ణుడి అవతార లక్ష్యానికి ఇటు భీమార్జునులు ఎంతగా సహకరించారో- అటు నుంచి భీష్ముడు అంతగానూ సహకరించాడన్నది దీన్నిబట్టి రుజువవుతోంది.

భరత వంశ ప్రతిష్ఠను సుదీర్ఘ జీవితకాలం తన భుజస్కంధాలపై వహించినవాడు భీష్ముడు. దాని కొనసాగింపు విషయంలో పాండవులకు సహకరించినవాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామ మహా క్రతువులో, శ్రీకృష్ణుడి విశ్వ ప్రణాళికలో తన కర్తవ్యాన్ని గుర్తించినవాడాయన. తన ధర్మాన్ని తాను సక్రమంగా పూర్తిచేసిన కర్మయోధుడు, ధన్యుడు- భీష్మపితామహుడు. భీష్మ ఏకాదశి పూట, ఆయన స్మరణ అందరికీ శుభప్రదం!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు