తొలి విగ్రహం... తొలి పండుగ

ఈరోజు ఉగాది పండుగ... త్వరగా లేచి తలంటుకుని కొత్తబట్టలు వేసుకో అంటూ చింటూను నిద్రలేపింది వాళ్లమ్మ. చింటూ తయారయ్యేలోపు ఆమె వంటింట్లోంచి ఆరు రుచులతో చేసిన ఉగాది పచ్చడి తెచ్చి అందరికీ పెడుతోంది.

Published : 29 Mar 2017 09:57 IST

తొలి విగ్రహం... తొలి పండుగ

రోజు ఉగాది పండుగ... త్వరగా లేచి తలంటుకుని కొత్తబట్టలు వేసుకో అంటూ చింటూను నిద్రలేపింది వాళ్లమ్మ. చింటూ తయారయ్యేలోపు ఆమె వంటింట్లోంచి ఆరు రుచులతో చేసిన ఉగాది పచ్చడి తెచ్చి అందరికీ పెడుతోంది. పచ్చడి గిన్నె తీసుకుని చింటూ మామిడాకుల తోరణాలను గుమ్మాలకు కడుతున్న తాతయ్య దగ్గరకు వెళ్లాడు.

‘తాతయ్యా... కొత్త ఏడాది జనవరిలోనే వచ్చిందిగా. మరి ఉగాది కూడా ఎలా కొత్త సంవత్సరం?’ అంటూ ముద్దుముద్దుగా అడిగాడు చింటూ.
‘భలే ప్రశ్నే అడిగావు ఓపిగ్గా కూర్చుంటే సంగతంతా చెబుతా’ అంటూ మొదలుపెట్టాడు తాతయ్య..
‘ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుంచి డిసెంబరు వరకు చెబుతావుగా. అలాగే తెలుగు నెలలు వేరే ఉన్నాయి. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు. కాలాన్ని కొలవడంలో వేర్వేరు పద్ధతుల్ని ఉపయోగించడం వల్లే ఈ తేడాలు. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుడి గమనం ఆధారంగా చాంద్రమానం వాడుకలో ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తొలిరోజునే ‘ఉగాది’గా చెబుతామన్నమాట.’

చింటూ ఆసక్తిగా వింటుంటే... తాతయ్య కొనసాగించాడు.

‘ఉగాది’ అన్న పదం యుగ ఆది నుంచి వచ్చింది. అంటే యుగం ప్రారంభమయ్యే రోజని అర్థం.

పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. దీనిపై మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడట. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడట. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇచ్చాడట. ఇదే దేవుని మొదటి విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తిచేసిన బ్రహ్మ, ఆ తర్వాత దాన్ని సూర్యుడికి ఇచ్చేశాడు. ఆ విగ్రహాన్ని సూర్యుడు తన కొడుకైన మనువుకూ, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికీ ఇచ్చారు. అలా అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడు అడిగితే రాముడు దాన్ని ఇచ్చేశాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోయిందిట. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహం శ్రీరంగనాథస్వామిదనీ చెబుతారు. ఈ సంఘటన ఉగాదినాడే సంభవించిందంటారు. ఇలా మన కొత్త సంవత్సరం వెనక ఆకట్టుకునే పురాణగాథలున్నాయి అంటూ తాతయ్య చెప్పడం ముగించాడు.

ఇంతలో మామయ్య వస్తే చింటూ అక్కడికి పరుగెత్తుకెళ్లి పచ్చడి అందించాడు. ‘మామయ్యా! పోయిన ఏడాది నువ్వు బెంగళూరులో ఉన్నావుగా అప్పుడు ఉగాది పచ్చడి తినలేదు కదూ’ అన్నాడు చింటూ.
దానికి మామయ్య బదులిస్తూ ‘ఉగాదిని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... కర్ణాటకలోనూ చేసుకుంటారు. ఇంకా కశ్మీర్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, సింధీ ప్రజలకు కూడా ఉగాది పండగే. ఈరోజునే కశ్మీర్‌లో ‘నవ్‌రెహ్‌’ పేరుతో పండుగ చేసుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండగనే ‘గుడిపడ్వా’ అంటారు. సింధీ ప్రజలైతే ఉగాదినే ‘చేత చాంద్‌’అని పిలుస్తారు. మిగతా ప్రాంతాల కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో భలేగా తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాదిని జరుపుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు, కవిసమ్మేళనం లాంటివి ఇంకా పంచాంగ శ్రవణం ఇవన్నీ ఉంటాయి. సాయంత్రం నిన్నూ తీసుకెళ్తాలే అని చెప్పాడు.

భలే భలే అంటూ గెంతులేసుకుంటూ ఈ సంగ‌తుల్ని స్నేహితులకు చెప్పడానికి పరుగులు తీశాడు చింటూ...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని