మనసు పెట్టిన పని... అవకాశాల గని!

‘అటెండర్‌ అయినా ఫర్వాలేదు... నువ్వు ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి కన్నా’ చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు ఎన్నిసార్లు ఈ మాటన్నారో!

Published : 10 Sep 2016 01:31 IST

మనసు పెట్టిన పని... అవకాశాల గని!

‘అటెండర్‌ అయినా ఫర్వాలేదు... నువ్వు ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి కన్నా’ చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు ఎన్నిసార్లు ఈ మాటన్నారో! దానికి తగ్గట్టే సర్కారీ కొలువుపై నాకూ మోజు పెరుగుతూ వచ్చేది.

నా కలకు, ఇష్టానికి అనుగుణంగా డిగ్రీ తర్వాత బీఈడీ ఎంచుకున్నా. కోర్సు పూర్తయ్యేలోపే అర్థమైంది టీచరవడం అంత ఆషామాషీ కాదని. పట్టా అందుకొని పోటీలో దిగేసరికే ఏళ్లనుంచి దండయాత్ర చేస్తున్న లక్షల మంది కనిపించారు. తీవ్రమైన పోటీకితోడు ఉద్యోగ ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియదు. కష్టపడి చదివి మూడు డీఎస్సీలు రాసినా పోస్టు దక్కలేదు.

వయసు ముదురుతున్నా కొలువు దక్కే మార్గం కనపడట్లేదు. ‘రేయ్‌.. నీ పొట్ట, పట్టా (బట్టతల) పెరుగుతోందిగానీ ఉద్యోగం వచ్చేలా లేదురా’ మొహం మీదే వేళాకోళమాడేవారు ఫ్రెండ్స్‌. ‘ఏం చేస్తున్నావ్‌?’ ‘పెళ్లైందా?’ బంధువుల ఆరాలు. ‘అబ్బాయి మంచివాడే.. పాపం సరైన ఉద్యోగమే లేదు’ సన్నిహితుల జాలి. వినీవినీ విసిగిపోయేవాణ్ని.

అమ్మానాన్నలు ముసలివాళ్లైపోతున్నారు. ఎన్నాళ్లని నన్ను భరించగలరు? ఇక లాభం లేదనుకొని ప్రైవేటు ఉద్యోగాల బాట పట్టా. ‘ఇన్నాళ్లేం చేశావ్‌?’, ‘నీలో టాలెంట్‌ ఉంటే ఈపాటికి ఏదో ఉద్యోగంలో స్థిరపడేవాడివిగా?’ ఈరకం ప్రశ్నలతో మనసు గాయపడేది. కానీ బాధ పడుతూ కూర్చుంటే పాపం అని ఆదుకునేవాళ్లుండరుగా! మనసు చంపుకొని రెండేళ్లు కూలి పనులకెళ్లా. ‘బాగా చదువుకున్న కుర్రాడు. పాపం ఉద్యోగంలేక ఈ పని చేస్తున్నాడు’ అక్కడా జాలి మాటలే. ఏడుపొచ్చేది.

ముప్ఫైఅయిదేళ్లు నిండాయి. నాలుగు పెళ్లి సంబంధాలు చూశా. అన్నీచోట్లా పెదవి విరుపులే. వయసు ముదురుతోంది.. అసలు నాకు పెళ్లవుతుందా? నాలో కొత్త అనుమానాలు, బాధలు మొదలయ్యాయి. ఒకానొకదశలో జీవితంలో అసలు పెళ్లి జోలికే వెళ్లొద్దనుకున్నా. ‘నీలాగే ఒకమ్మాయి ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉండిపోయిందట. వయసు ముప్పై. నీకు ఓకేనా?’ ఓ దూరపు బంధువు సంబంధం తెచ్చాడు. అంతకన్నా ఏం కావాలి? ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశా. నా ప్రభుత్వ ఉద్యోగం కల.. పడ్డ కష్టాలు.. మానసిక వ్యధ.. మనసులోని బాధంతా తన ముందుంచా.

మా ఇద్దరిదీ ఉపాధ్యాయ నేపథ్యమే. ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూసి విసిగిపోయినవాళ్లమే. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాం. సంసారం నడవడానికి ముందుగా ఇద్దరం ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా చేరాం. సంపాదన కోసం కాకుండా మనసుపెట్టి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాం. అనుకున్నట్టే ఆ వృత్తిపై ప్రాణం పెట్టాం. అందరితో కలుపుగోలుగా ఉన్నాం. శ్రమ అనుకోకుండా స్కూళ్లొ అన్ని పనులూ చేశాం. విద్యార్థులు, సహోద్యోగుల్లో మంచి పేరొచ్చింది. మూడేళ్లలో ప్రమోషన్ల నిచ్చెనలు ఎక్కాం. ఓ కార్పొరేట్‌ స్కూల్‌ మా పనితనం గుర్తించింది. మంచి జీతంతో మమ్మల్ని చేర్చుకుంది.

ఇప్పుడు ఇంచుమించు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సంపాదిస్తున్నాం. ఇంకొకరికి సాయం చేసే స్థితిలో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగంతోనే సంపాదన, గౌరవం దక్కుతుందనే నా అపోహ పటాపంచలైంది. చేసేది ఎలాంటి ఉద్యోగమైనా మనసుపెట్టి చేస్తే ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే వస్తాయని తెలియజెప్పడానికే మీ ముందుకొచ్చాం. - విజయ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని