‘మనీ లాండరింగ్‌’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా

మనీ లాండరింగ్‌ కేసును బూచిగా చూపిన సైబర్‌ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్‌సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు.

Published : 26 Apr 2024 06:42 IST

బాధితురాలు ఎంఎన్‌సీ విశ్రాంత డైరెక్టర్‌

ముంబయి: మనీ లాండరింగ్‌ కేసును బూచిగా చూపిన సైబర్‌ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్‌సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. నిందితుల బెదిరింపులకు భయపడిన బాధితురాలు తన పేరున, తన తల్లి పేరున ఉన్న షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు విక్రయించారని, అంతేకాకుండా బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు సైతం తీసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న మొదలైన ఈ తతంగం రెండు నెలల పాటు కొనసాగిందన్నారు. బాధితురాలికి ఫిబ్రవరిలో వాట్సప్‌ కాల్‌ వచ్చింది. మీపై నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదైందని, మీరు వినియోగిస్తున్న మొబైల్‌ నంబర్లు, ఆధార్‌ కార్డు కేసుతో లింక్‌ అయ్యాయని వృద్ధురాలిని బెదిరించాడు. ఆ తర్వాత కాల్‌ను మరో వ్యక్తికి బదిలీ చేశాడు. తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. మీపై మనీలాండరింగ్‌ కేసు ఉందని చెప్పాడు. కేసు నుంచి బయట పడాలంటే తాము సూచించిన ఖాతాలో నగదు జమచేయాలని, ఆ తర్వాత ఆ మొత్తం వెనక్కి వస్తుందని నమ్మించాడు. అనంతరం మోసగాళ్లు బాధితురాలి పేరుతో కరెంటు ఖాతాను సైతం తెరిచి రూ.25 కోట్లు అందులో జమ చేయించుకున్నారు. అయితే ఆ మొత్తం వెనక్కి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని