..కానీ, మాట్లాడు సౌమ్యా!

ఆ రోజు సాయంత్రం ఆరుగంటలు. నా బెస్ట్‌ఫ్రెండ్‌ సోదరి దేవి నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది.. ‘మా ఇంటికి వచ్చిందే ఆ అమ్మాయి ఎలా ఉంది?’ అని. నిన్ననే వాళ్లింటికి వెళ్లొచ్చాను. బంధువుల అమ్మాయి వచ్చింది. మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంది. మా ఇద్దరి తొలిచూపులు కలిశాయేమో అన్నంతగా డిస్ట్రబ్‌ అయ్యాను....

Published : 03 Feb 2018 02:06 IST

మనసులోమాట
..కానీ, మాట్లాడు సౌమ్యా!

రోజు సాయంత్రం ఆరుగంటలు. నా బెస్ట్‌ఫ్రెండ్‌ సోదరి దేవి నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది.. ‘మా ఇంటికి వచ్చిందే ఆ అమ్మాయి ఎలా ఉంది?’ అని. నిన్ననే వాళ్లింటికి వెళ్లొచ్చాను. బంధువుల అమ్మాయి వచ్చింది. మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంది. మా ఇద్దరి తొలిచూపులు కలిశాయేమో అన్నంతగా డిస్ట్రబ్‌ అయ్యాను. నేను దేవికి రిప్లయి ఇస్తూ ‘అదేం ప్రశ్న. నువ్వు అలా అడక్కూడదు’ అని మెసేజ్‌ ద్వారా చెప్పాను. ‘చెప్పు ఫర్లేదు’ అంది మళ్లీ. ‘మనమిలా మెసేజ్‌లతో అమ్మాయి మీద కామెంట్లు చేసుకుని.. డిస్ట్రబ్‌ చేయడం సరికాదు’ అన్నాను. ఆఖర్న ‘యువార్‌ గుడ్‌ బాయ్‌’ అంది. అంతలోపే ‘దిసీజ్‌ నాట్‌ దేవి.. ఐ యామ్‌ సౌమ్య. ఇందాక జరిగిన స్టోరీ అంతా నాదే!’ అంటూ పెద్ద జలక్‌ ఇచ్చింది. ‘అవునా, హాయ్‌ ఎలా ఉన్నారు’ అంటూ పలకరించా. ‘దేవి పేరుతో మీరెందుకు నాకు మెసేజ్‌లు పెట్టారు’ అనడిగాను. ‘ఏం లేదు.. నా పట్ల నీ క్యారెక్టర్‌ ఎలా ఉందో తెలుసుకుందామని’ అంటూ చెప్పింది. కించిత్‌ కోపం కలిగింది. ‘నా క్యారెక్టర్‌ నువ్వు డిసైడ్‌ చేయడమేంటి’ అన్నాను. నాతో ఎందుకిలా ఆడుకుందంటూ.. మరో మిత్రుడితో మెసేజ్‌ల ద్వారా బాధను పంచుకున్నాను. కొత్తగా వచ్చిన అమ్మాయికి పడిపోతానని.. ఇలా చేసిందేమో అనుకున్నాను. సౌమ్య మంచిది కాదని భ్రమపడ్డా.  ఆ తరువాత రోజు కలిసి మాట్లాడుకున్నాం. ‘ఏంటి అలా మెసేజ్‌లు చేయొచ్చా. అందులో అమ్మాయివి’ అన్నాను. ఏం మాట్లాడలేదు. ‘సెల్‌ఫోన్‌ మెసేజ్‌లతో ఒక వ్యక్తిలోని మంచిచెడ్డలను నిర్ణయించలేం’ అన్నాను. ‘అవును, నువ్వు చెప్పింది నిజమే’నని ఒప్పుకుంది. ఆమె క్యారెక్టర్‌ ఏమంత మంచిది కాదని నా ఫ్రెండ్‌కు మెసేజ్‌లు పంపుతూనే ఉన్నాను. మరోవైపు సౌమ్యతో ఎంగేజ్‌ చేస్తూనే ఉన్నాను. రాత్రింబవళ్లు మా ఇద్దరి ఫోన్లు బిజీ బిజీ. అప్పుడప్పుడు దేవితో కలిసి తను మా ఇంటికి వచ్చేది. ఒక రోజు ‘నేను నీకు నచ్చానా.. నా నుంచి ఏం కోరుకుంటున్నావు’ అంది. నేను వేరేలా అనుకుని.. ‘డియర్‌, నాకు ఒక ముద్దు కావాలి’ అనడిగేశా. అటు నుంచి సమాధానం లేదు. కాసేపు భయమేసింది. వెంటనే క్షమించమన్నా. చాలా ఫీల్‌ అయ్యింది. తప్పుగా భావించానేమోనని నాలో నేనే పశ్చాత్తాపడ్డాను. అప్పటి వరకు ఆమె మీదున్న అభిప్రాయం మారింది. నా ఫ్రెండ్‌కు నెగిటివ్‌ మెసేజ్‌లకు బదులు పాజిటివ్‌ మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాను. ఒకరికి ఒకరం ప్రేమ తెలియపరచక ముందే విడిపోయే కాలం వచ్చింది. ‘రేపు మా ఊరికి వెళుతున్నాను. నా మీద నీ అభిప్రాయం చెప్పు’ అంది. ‘సరే, రేపు ఉదయం మాట్లాడదాం’ అంటూ పొద్దున్నే వెళ్లి కలిశాను. మాటల్లో సరదాగా నా సెల్‌ లాక్కుంది. తన గురించి నా ఫ్రెండ్‌కు పంపిన నెగిటివ్‌ మెసేజ్‌లన్నీ చూసింది. ‘నన్ను ఇంత చెడుగా భావించావా? ఈ మెసేజ్‌లు చాలా నీచంగా ఉన్నాయి. నిన్ను ప్రేమిస్తే నా జీవితం నాశనం అయ్యేది. ఛీ.. ఛీ..’ అంటూ వెళ్లిపోయింది. నా గుండె బద్ధలైంది. తనను మోసం చేయాలనుకోలేదు. చెడు మెసేజ్‌లను డిలీట్‌ చేసినా సరిపోయేది. అంతటితో ఇద్దరం దూరమయ్యాం. దేవిని బతిమాలి సౌమ్య ఫోన్‌నెంబర్‌ తీసుకున్నాను. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా వినలేదు. తనకంటే నేనే ఎక్కువ బాధపడ్డా. ఎంత కుమిలిపోతున్నానో ఆ దేవునికే తెలియాలి. తను నన్ను ప్రేమించకున్నా ఫరవాలేదు. నా గోడు వింటే చాలని ఆరాటపడ్డాను. సమయాన్ని వెనక్కి తిప్పాలి అనిపించేది. రెండేళ్లు అవుతోంది. నరకం చూస్తున్నా. కనీసం ఇది చూసైనా నీ గుండె కరిగితే చాలు.. ప్లీజ్‌ సౌమ్యా.. తప్పు నాదే! కానీ, ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదు. ఏదో కోపంలో అలా జరిగిపోయింది. నీ దగ్గర నా ప్రవర్తనలో మార్పు లేదు కదా! అదైనా గమనించు. ప్రేమించడం తప్పు కాదు.. ప్రేమించగలగడం గొప్ప. శిక్షించు.. వీలైతే క్షమించు.. కానీ, మాట్లాడు సౌమ్యా!

-వెంకేష్‌, నాగసముద్రం, మంచిర్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని