నీ సేవకు నా ప్రేమ అడ్డుకాదు

జ్యోతి... ఆ పేరు వింటే చాలు నా మోములో వెయ్యి వాట్ల బల్బులు వెలుగుతాయి. సిగ్నళ్లు బాగా అందినప్పుడు నెట్‌ వేగంలా పరిగెడుతుంది నా మనసు. తను మా ఉమ్మడి స్నేహితుడు చంద్ర పెళ్లికి వస్తోందన్న కబురు నాలో ఉద్విగ్నతను రేపింది....

Published : 05 May 2018 01:17 IST

నీ సేవకు నా ప్రేమ అడ్డుకాదు

జ్యోతి... ఆ పేరు వింటే చాలు నా మోములో వెయ్యి వాట్ల బల్బులు వెలుగుతాయి. సిగ్నళ్లు బాగా అందినప్పుడు నెట్‌ వేగంలా పరిగెడుతుంది నా మనసు. తను మా ఉమ్మడి స్నేహితుడు చంద్ర పెళ్లికి వస్తోందన్న కబురు నాలో ఉద్విగ్నతను రేపింది. తను ఎలా ఉంటుందో? పెళ్లి చేసుకొని పిల్లలతో వస్తుందో? భర్త ఎలా ఉంటాడో? ఇలా అనేక ప్రశ్నలు నా మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌లో జ్యోతి, నేను మంచి స్నేహితులం. తను ఎంత మంచిదంటే... దారిలో ఎవరైనా బిచ్చగాళ్లు కన్పిస్తే వాళ్లతో మాట్లాడుతుంది. వాళ్ల కష్టం తెలుసుకుంటుంది. వారికి తన వంతు ఏం సహాయం చేయాలో చేసేదాకా నిద్రపోదు. పక్కనున్న నాలాంటి వాళ్లను అందులో భాగస్వాములను చేస్తుంది. తను నాకు బాగా నచ్చింది. ఫైనల్‌ఇయర్లో తనకు ప్రపోజ్‌ చేశాను. ‘నేను ఎప్పుడూ నిన్ను అలా చూడలేదని, అయినా నాకు ప్రేమించే ఉద్దేశమే లేద’ని చెప్పింది. నన్ను అపార్థం చేసుకోకుండా... ఇంత ఓపెన్‌గా చెప్పినందుకు నాకు మరింత నచ్చింది. నా చూపులు తనతో మాట్లాడేవేమో... మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేది. పరీక్షలయ్యాక తను కాలేజీ నుంచి వెళ్లే రోజు స్టేషన్‌దాకా వెళ్లాను. అక్కడ ఏమైనా చెబుతుందేమోనని... చెప్పింది. తన పెళ్లికబురు. వాళ్ల నాన్న తనకు సంబంధం చూశాడని వెళ్లగానే నిశ్చితార్థం, తర్వాత వెంటనే పెళ్లి అని... రైలు కదిలింది. ఆ చక్రాల కింద నా మనసు ముక్కలుముక్కలైంది. తన ఉనికే మాకు తెలియకుండా చాలాకాలం గడిచిపోయింది. ఇటీవలే ఫేస్‌బుక్‌లో మా చంద్ర తన కాంటాక్ట్‌ సంపాదించాడు. పెళ్లికి పిలిచాడు. తను వచ్చింది. నన్ను చూడగానే పలకరించింది. కాళ్లకు మెట్టెలు లేవు. పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘ఎవరూ’ అన్నాను... ‘నా పిల్లలే’ అంది. ‘మరి... నీ భర్త ఏం చేస్తుంటాడు?’.. పెళ్లి చేసుకుంటేగా భర్త ఉండటానికి..! అంది. అంతలో ఫ్రెండ్స్‌ అంతా వచ్చారు. అందరిలో మేం కలిసిపోయాం. మా చంద్రాను పలకరించి వెంటనే తను వెళ్లిపోయింది. తర్వాత తన స్నేహితురాలు నీరజను వివరాలు అడిగాను. తను పెళ్లి చేసుకోలేదని, ఆరోజు స్టేషన్లో చెప్పినవన్నీ అబద్ధాలనీ... తన కోసం ఎదురుచూడకుండా ఉండటానికే అలా చెప్పిందని తెలిసింది. ‘తనకు సేవ చేయడమంటే ఇష్టం. ఆ ఇద్దరు పిల్లల్లా 30 మందిని తను దత్తత తీసుకొని చదివిస్తోంది. బతికినంత కాలంలో ఎంతో మందికి సేవ చేయాలనేది లక్ష్యమ’ని నీరజ చెప్పేటప్పటికి నా మెదడు ఆగిపోయింది. తన నంబర్‌ తీసుకొని ఫోన్‌ చేశాను. తీయడం లేదు. ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టాను. స్పందించడం లేదు. జ్యోతి... నేను నీ సేవకు ఎలాంటి ఆటంకం కలిగించను. ఇద్దరం కలిసి సేవ చేద్దాం. నా ప్రేమను అంగీకరించు.

- రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని