ప్రాణం పోక ముందే కాల్‌ చెయ్‌

ఒక మధ్యాహ్నం బైక్‌పై వెళ్తున్నాను. రోడ్డు పక్కన స్మార్ట్‌ ఫోన్‌ పడి ఉంది. తీసుకొని దగ్గరలోని షాప్‌ వాళ్లను అడిగి చూశాను. తమది కాదన్నారు. ఫోన్‌లో నంబరు చూసైనా డయల్‌ చేద్దామంటే అది ఛార్జింగ్‌ అయిపోయి స్విచ్‌అఫ్‌ అయింది....

Published : 02 Jun 2018 01:38 IST

మనసులో మాట!‌
ప్రాణం పోక ముందే కాల్‌ చెయ్‌

క మధ్యాహ్నం బైక్‌పై వెళ్తున్నాను. రోడ్డు పక్కన  స్మార్ట్‌ ఫోన్‌ పడి ఉంది. తీసుకొని దగ్గరలోని షాప్‌ వాళ్లను అడిగి చూశాను. తమది కాదన్నారు. ఫోన్‌లో నంబరు చూసైనా డయల్‌ చేద్దామంటే అది ఛార్జింగ్‌ అయిపోయి స్విచ్‌అఫ్‌ అయింది. ఇంటికెళ్లి ఛార్జింగ్‌ పెట్టాను. కొద్దిసేపటి తర్వాత ఆన్‌ చేశాను. ఎవరిదో కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేశాను. ‘ఏరా నా ఫోన్‌ దొంగిలించడానికి నీకు ఎంత ధైర్యం... నీ మీద పోలీసు కంప్లైంట్‌ ఇస్తాను.’ అవతల అమ్మాయి వాయిస్‌ గట్టిగా అడుగుతోంది. ‘ప్లీజ్‌ కొంచెం ఆగండి...నేను చెప్పేది వినండి’ అంటున్నా వినిపించుకోవడం లేదు. కొద్దిసేపటికి ఆ వాయిస్‌ తగ్గింది. దీంతో నేను విషయం చెప్పాను. ‘సారీ అండి... నాకు ఆ ఫోన్‌ చాలా ముఖ్యం. అది మా కంపెనీ ఫోన్‌. చాలా వివరాలు అందులో ఉన్నాయి.’ దయచేసి నాకివ్వండి అంది. సరే అని ఒక చోటు అనుకొని తనని కలిశాను. చాలా అందంగా ఉంది. తొలిచూపులోనే నాకు నచ్చేసింది. ‘చాలా థ్యాంక్స్‌ అండి’ అంది. ‘నా పేరు లావణ్య..’ అంటూ పరిచయం చేసుకొంది. కొద్దిసేపు మాట్లాడాక... మరోసారి థ్యాంక్స్‌ చెప్పి వెళ్లిపోయింది. తనని ఫాలో అయి... తన ఇల్లు చూశాను. వారం రోజులకు గుడిలో కన్పించింది. అందరూ ప్రసాదం తింటుంటే తను చాక్లెట్‌ తింటూ కనిపించింది. అప్పటి నుంచి తనని ‘చాక్లెట్‌’ అని పిలవాలనుకున్నాను. దగ్గరికెళ్లి పలకరించాను. చేయికలిపింది. నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది. మీరు ఏం చేస్తుంటారని అడిగింది. ఖాళీగా ఉంటున్నానని చెప్పాను. అయితే మా కంపెనీలో జాబ్‌ ఉంది చేస్తారా? అంది. ఓకే అన్నాను. అయితే నా నంబర్‌కి రెజ్యుమ్‌ వాట్సప్‌ చేయమని చెప్పి, తన నంబర్‌ ఇచ్చింది. తర్వాత రోజూ మెసేజ్‌ చేసేవాడిని. కొన్ని రోజులకు మాట్లాడుకోవడం మొదలైంది. తన అభిరుచులు, ఆశయాలు నాకు నచ్చాయి. నా ఇష్టాఇష్టాలను తను గౌరవిస్తుందని అనిపించింది. ఇంతలో నా కాలేజీ ఫ్రెండ్‌ రోషిణి పుట్టిన రోజుకు ఫ్రెండ్స్‌ అందరితో కలిసి వెళ్లాం. తనూ వచ్చింది. ఏమిటి.. ఇక్కడ? అంటూ పలుకరించాను. తన స్నేహితురాలు పిలిస్తే వచ్చానని చెప్పింది. అంటే తను రోషిణి ఫ్రెండ్‌కి ఫ్రెండ్‌ అన్నమాట. ఎన్నో కబుర్లు. సరదాలు, జోకులు, పాటలు... ఇలా పార్టీ అయ్యాక అమ్మాయిలందరినీ వాళ్ల ఇళ్ల దగ్గర వదిలిపెట్టే పని నాకు అప్పజెప్పారు. నేను కారు తీసుకొని వారందరినీ వదలడానికి బయలుదేరాను. ఒక్కొక్కరినీ వదులుతూ... చివరికి నేను, చాక్లెట్‌ మిగిలాం. తనింటి దగ్గరికి వచ్చాక ... నా మనసులో మాట చెప్పాను. తను నా కళ్లలోకి చూసి నవ్వి వెళ్లిపోయింది. తను నన్ను ప్రేమిస్తోందని నాకు అర్థమైంది. నేను ఎంతో ఆనందంగా పార్టీ దగ్గరికి వెళ్లాను. అక్కడ రోషిణి నన్ను పక్కకి పిలిచింది. తను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. నేను కాదన్నాను. నేను చాక్లెట్‌ను ప్రేమిస్తున్నానని చెప్పాను. తను ఏడుస్తూ వెళ్లిపోయింది. మరుసటి రోజు తనతో వివరంగా మాట్లాడాలని పార్క్‌కి రమ్మన్నాను. చాక్లెట్‌నూ అక్కడికి రమ్మన్నాను. రోషిణి ముందుగా వచ్చి ఏడ్చింది. నేను ఓదార్చాను. నాకు చాక్లెట్‌ అంటే ఎంత ఇష్టమో వివరంగా చెప్పాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను. నేను మాట్లాడుతుండగానే రోషిణి నన్ను హత్తుకొంది. ఇంతలో చాక్లెట్‌ అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూసింది. అంతే నాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. తర్వాత నేను కాల్‌ చేస్తే తీయడం లేదు. మెసేజ్‌కి స్పందించడం లేదు. ఫోన్‌ నంబరు మార్చేసింది. నేను తన గురించి ఆలోచిస్తూ... పిచ్చివాణ్ని అయిపోతున్నా.
చాక్లెట్‌... నా మాట ఒక్కసారి విను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆరోజు జరిగింది ఏమిటో దయచేసి చెప్పే అవకాశమైనా ఇవ్వు. నువ్వు లేకుండా నా జీవితం ఊహించుకోలేను. నా ప్రాణం పోకముందే దయచేసి నాతో ఒకసారి మాట్లాడు.

- నీ కాల్‌ కోసం ఎదురుచూసే... నీ రాక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని