సాయం చేస్తూనే భయం అంటోంది!

నా ఫ్రెండ్‌ది వింత సమస్య. తను ప్రతి ఒక్కరి బాగు కోరుకుంటుంది. అందరికీ సాయం చేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉందిగానీ తను సమస్యలో ఉంటే మాత్రం అందరూ పరామర్శించాలని, ఓదార్చాలని కోరుకుంటుంది..

Published : 14 Jan 2016 15:44 IST

సాయం చేస్తూనే భయం అంటోంది!

 నా ఫ్రెండ్‌ది వింత సమస్య. తను ప్రతి ఒక్కరి బాగు కోరుకుంటుంది. అందరికీ సాయం చేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉందిగానీ తను సమస్యలో ఉంటే మాత్రం అందరూ పరామర్శించాలని, ఓదార్చాలని కోరుకుంటుంది. అలా జరక్కపోతే తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఏడుస్తుంది. అలిగి అన్నం తినడం మానేస్తుంది. పైగా చిన్న విమర్శను సైతం తట్టుకోలేదు. ప్రతి పనికీ భయమే. ఏం చేస్తే ఏ ఆపద ముంచుకొస్తుందోనని సందేహిస్తోంది. ఎంత చెప్పినా వినట్లేదు. తనని మార్చేదెలా?

- గౌతమి, విశాఖపట్నం

   మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ ఫ్రెండ్‌ ఉన్నత భావాలున్న వ్యక్తి, ఇతరుల పట్ల శ్రద్ధ చూపే రకం, చాలా జాగ్రత్తపరురాలు అని తెలుస్తోంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. సైకాలజీ కోణంలో చూస్తే తను ఎన్నో అపసవ్య ఆలోచనలున్న (ఇర్రేషనల్‌ థాట్స్‌) వ్యక్తి. వ్యాకులత స్వభావం ఉన్నవాళ్లు చిన్న సమస్యలను కూడా భూతద్దంలోంచి చూస్తారు. సాధారణ సమస్యలు సైతం బుసలుకొట్టే పాముల్లా కనిపిస్తాయి. ఇలాంటి వాళ్లకు కష్టాలకు ఎదురొడ్డే ధైర్యం తక్కువ. చిన్న విషయాలకీ ఎక్కువ కంగారు పడతారు. తనకి కష్టం ఎదురైతే అంతా పరామర్శించాలని, సానుభూతి చూపాలని ఆశించడం, ఎదుటివాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మీ ఫ్రెండ్‌లో మితిమీరి ఉన్నట్టు తెలుస్తోంది. సానుభూతి లభించకపోతే విలవిలలాడిపోవడం, ఏడవడం, అలగడం ఈ అమ్మాయిలో చిన్నపిల్లల మనస్తత్వం, Immaturity ని సూచిస్తాయి. ఈ న్యూనతా భావాలు మనసును తొలిచేస్తాయని, గుండెల్నిండా ఆందోళన నింపుతాయని ఆల్ఫ్రెడ్‌ ఆడ్లర్‌ అనే ప్రముఖ సైకాలజిస్టు తెలుపుతాడు. పైగా వీటిని జయించాలన్న తపన కూడా ఎక్కువ మోతాదులో ఉంటుందని అతడు తెలిపాడు. న్యూనతా భావాలను జయించడానికి వ్యక్తి చేసే ప్రయత్నాలను కంపెన్సేషన్‌ Compensation అంటారు అంటాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. మంచి ప్రవర్తనతో అందరి మనస్సు గెలవాలనుకోవడం, సమస్యల్లో ఉన్నవాళ్లకి సాయం అందించడం, అందర్నీ పట్టించుకోవడం.. ఇవన్నీ తను కంపెన్సేషన్‌ ఉపయోగించి న్యూనతా భావాలను గెలవాలనుకుంటోంది అని తెలుస్తోంది. కేవలం మాటలు చెప్పి ఈమెను మార్చలేం. తను మారాలంటే వైఖరి, ఆలోచనా విధానాల్లోనూ మార్పులు తేవాలి. అప్పుడే ఆమెలో కొత్త వ్యక్తిని చూడవచ్చు. ఆమెలోని వ్యాకులతా స్వభావాన్ని కూడా కొంతవరకు తగ్గించడం అవసరమే. ఈ మార్పులు తేవడానికి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ లోని కొన్ని థెరపీలను ఉపయోగించాలి. అందుకే మీరు ఒక క్లినికల్‌ సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. థెరపీతోనే ఇది సాధ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని