పెళ్లికి ముందు ప్రేమకథలేంటి?

కాలేజీమేట్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించా. తనూ బాగానే మాట్లాడేది. కోర్సు పూర్తై బయటికెళ్తుంటే మనసులో మాట చెప్పా. నిన్ను ఫ్రెండ్‌గానే భావించా. నేను వేరే అబ్బాయిని ప్రేమించా’ అంది...

Published : 14 Jan 2016 16:10 IST

పెళ్లికి ముందు ప్రేమకథలేంటి?

 కాలేజీమేట్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించా. తనూ బాగానే మాట్లాడేది. కోర్సు పూర్తై బయటికెళ్తుంటే మనసులో మాట చెప్పా. నిన్ను ఫ్రెండ్‌గానే భావించా. నేను వేరే అబ్బాయిని ప్రేమించా’ అంది. నా మనసు వికలమైంది. తర్వాత అమ్మానాన్నలు చూసిన సంబంధానికి ఓకే చెప్పా. ముహుర్తాలూ పెట్టేసుకున్నాం. కొద్దిరోజులకు ప్రేమించిన అమ్మాయి నుంచి ఫోన్‌. ‘మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సరేనన్నా. జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్‌ చేయించి ఈమెతో డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నా. ఓరోజు ‘ఇంతక్రితం నేను ప్రేమించిన అబ్బాయితో అన్నిరకాలుగా దగ్గరయ్యా. భవిష్యత్తులో ఇబ్బంది రావొద్దని నీకీ విషయం చెబుతున్నా’నంటూ బాంబు పేల్చింది. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నా. తనని పెళ్లి చేసుకోవాలా? వద్దా? 

- ఎం.ఎస్‌.కె., ఈమెయిల్‌

 చదువు ముగించాకే ప్రేమ, పెళ్లి మాటెత్తారు. సంతోషించాల్సిన విషయమది. క్లాస్‌మేట్‌కి దగ్గరవడం, ప్రేమించి పెళ్లాడాలనుకోవడం తప్పేం కాదు. సరే.. పరిస్థితుల ప్రభావంతో తనూ మొదట్లో మిమ్మల్ని నిరాకరించింది. అందుకు ఆమెనూ తప్పు పట్టలేం. మారిన పరిస్థితులతో మళ్లీ మీకు దగ్గరై పెళ్లికి సమ్మతించింది. తాను ప్రేమిస్తున్న వ్యక్తికన్నా తనను ప్రేమించిన వ్యక్తికి దగ్గరవడం మంచిదనుకుంది. ఇది చక్కటి ఆలోచన.

ఇక తాను ప్రేమించిన వ్యక్తితో అన్నిరకాలుగా దగ్గరయ్యానంటే మీరు షాక్‌కి గురయ్యారు. ఇది నిజమా? లేక మీ ప్రేమ స్వచ్ఛతను పరీక్షించే ప్రయత్నమా? తెలియదు. ఒకవేళ అలాంటి ప్రయత్నమైతే ఫర్వాలేదు. నిజంగానే ఆ అమ్మాయి అతడితో సన్నిహితంగా ఉన్నా మీరు చిలవలు పలువలుగా వూహించుకొని కుంగిపోవడం సవ్యం కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమకు నిబంధనలుండవు. ఉండకూడదు. ఉంటే ప్రేమకు, వ్యాపారానికి తేడా ఏముంటుంది? స్వచ్ఛమైన ప్రేమను నిర్వచించడం కష్టమే అయినా అది ఒక పాజిటివ్‌ ఫోర్సు అనీ, భూమ్యాకార్షణలా పైకి కనిపించకపోయినా ఒక బలవత్తరమైన శక్తి అని రొండా బైర్నే అనే మేధావి ‘ది పవర్‌’ అనే పుస్తకంలో రాసింది. అన్నింటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఆ అమ్మాయి తెలిపిన విషయం, ఆమె నిజాయతీకి అద్దం పడుతోంది. అన్ని విషయాలూ మీతో పంచుకొని జీవితాంతం మీ తోడుగా ఉండాలనే నిశ్చితాభిప్రాయం ఆమెలో కనిపిస్తోంది. ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే నిర్ణయించుకోగలరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని