విలాసాల మోజులో జేబు గుల్ల!

పల్లెటూరిలో పుట్టిపెరిగా. చదువు పూర్తవగానే ఉద్యోగం కోసం నగరానికొచ్చా. ఓ యాడ్‌ ఏజెన్సీలో కొలువు దొరికింది. అక్కడ పనిచేసే వారంతా ఆధునికంగా...

Published : 14 Jan 2017 01:07 IST

విలాసాల మోజులో జేబు గుల్ల!

* పల్లెటూరిలో పుట్టిపెరిగా. చదువు పూర్తవగానే ఉద్యోగం కోసం నగరానికొచ్చా. ఓ యాడ్‌ ఏజెన్సీలో కొలువు దొరికింది. అక్కడ పనిచేసే వారంతా ఆధునికంగా ఉన్నారు. అమ్మాయిలతో రాసుకుపూసుకు తిరగడం, పార్టీలు... నాకో కొత్తలోకం కనిపిస్తోంది. నేను పూర్తిగా మారిపోతున్నానని అర్ధమవుతోంది. ఇంటికి డబ్బులు పంపాల్సిన పరిస్థితి ఉన్నా పంపలేకపోతున్నా. ఈమధ్య కళ్లు మూసినా, తెరచినా అమ్మాయిలే. ఏవో తప్పులు చేయాలని మనసు ఆరాటపడుతోంది. చెడిపోతున్నాననే బాధ ఒకవైపు, కోర్కెలు తీర్చుకోవాలనే ఉద్రేకం మరోవైపు. నన్ను నేను అదుపులో ఉంచుకునేదెలా?

- బి.ఆర్‌.కె., నిజామాబాద్‌

* ప్రతి వ్యక్తీ జీవితంలో కొన్ని విలువలు పాటించాలి. క్రమశిక్షణాయుతమైన జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. తద్వారా స్వీయనియంత్రణ (సెల్ఫ్‌ కంట్రోల్‌) సాధించొచ్చు. అప్పుడు ప్రమాదకర వ్యామోహాల నుంచి బయటపడటం తేలికవుతుంది. మీర్జా రుస్వా రాసిన ఉమ్రావ్‌జాన్‌ బాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రం. ఓ సందర్భంలో ఉమ్రావ్‌జాన్‌ ‘పట్నం వాళ్లు చెడిపోవడం మొదలుపెడితే ఎప్పుడో ఓసారి తప్పు దిద్దుకోగలుగుతారు. వాళ్లకి పట్నవాసపు తళుకు బెళుకులు మొదటి నుంచి పరిచయం ఉంటాయి. అదే పల్లెటూరి కుర్రాళ్లు పట్నవాసం చేరి పతనం కావడం మొదలుపెడితే చివరి అంచు వరకూ వెళ్లిపోతారు. వారు పెరిగిన వాతావరణంలోని అమాయకత్వంతో ఏ అలవాటైనా గాఢంగా ఉంటుంది’ అంటాడు. అందుకే పెద్దలు పట్నం వెళ్లే పిల్లలకు హితబోధలు చేస్తుంటారు. పల్లెటూరి నుంచి నగరం చేరిన కుర్రకారుకి స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెట్టిన భావన కలగడం సహజం. కానీ అది దురలవాట్లకు కారణం కాకూడదు.

సంతోషించాల్సిన విషయం ఏంటంటే నీకు నీపై స్వీయ అవగాహన ఉంది. సమస్యేంటో తెలుసు. అనువైన చోటు నుంచి కొత్త పరిస్థితుల్లోకి వెళ్లే ప్రతి కుర్రాడికీ ఎదురయ్యే సమస్యే నిన్నూ వేధిస్తోంది. కొత్త జోన్‌లో కలిగే ప్రతి పరిచయం ఉత్సాహం, ఆనందాన్నిస్తుంది. అయితే మనం చేసే స్నేహాలన్నీ గొప్పవి కావు. ప్రతి పరిచయం నుంచి కొన్ని అంచనాలు, అనుభవాలు నేర్చుకోవాలి. స్నేహితుల కోసం డబ్బు ఖర్చుపెట్టడం తప్పు కాదు. కానీ డబ్బు ఖర్చుపెట్టడమే స్నేహమనే భ్రమ విడిచిపెట్టాలి. డబ్బు ఖర్చుచేసి స్నేహితుల మనసులు గెల్చుకోవాలనుకోవడం మంచిది కాదు. డబ్బుతో ముడిపడి ఉండే స్నేహాలు ఎక్కువ కాలం నిలబడవు.

ఈ వయసులో అమ్మాయిలపట్ల ఆకర్షణ సహజం. ఇది అలవాటుగా కొనసాగకుండా జాగ్రత్త పడాలి. అలా జరక్కుండా ఉండాలంటే ముందు మంచి ఉద్యోగం, చక్కటి ఇల్లాలిని పొందడం నీ లక్ష్యం కావాలి. వృత్తిలో నైపుణ్యం సాధిస్తూ, ఇంటి ఆర్థిక అవసరాలు తీరుస్తూ నిన్ను నీవు చక్కదిద్దుకోవాలి. నీ ఎదుగుదలకు అవసరమయ్యే పరిచయాలను మాత్రమే పరిమిత సంఖ్యలో కలిగి ఉండాలి. జీవితంలో చక్కగా సెటిల్‌ కావాలనే లక్ష్యం ముందు మిగిలిన వ్యామోహాలన్నీ స్వల్పంగా కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని