నేను బిజీ అంటే... అంతా గజిబిజి!

అప్పుడే కేర్‌మన్న పిల్లాడి నుంచి మనలాంటి యూత్‌ దాకా.. అందరికీ రోజూ ఇరవైనాలుగ్గంటలే. అయినా కొందరే ఎందుకు సూపర్‌ సక్సెస్‌ అవుతారు? చాలామంది ఎంత పనిచేసినా ఉన్నచోటే ఆగిపోతారు? ఈ గుట్టు వెనక ఉన్న గూడుపుఠానీ సంగతి చూద్దాం. పనే ఉండదు ‘నేను చాలా బిజీ అని చెప్పుకోవడం గొప్ప కాదు. ఇదో పెద్ద అబద్ధం లేదా పని చేయడానికి సామర్థ్యం లేదని పరోక్షంగా ఒప్పుకోవడమే’ అంటాడు బీఎఫ్‌ స్కిన్నర్‌. జగమెరిగిన మానసికవేత్త.

Published : 04 Mar 2017 02:40 IST

నేను బిజీ అంటే... అంతా గజిబిజి!

* ‘రోజూ జిమ్‌కెళ్లి హృతిక్‌లా కండలు పెంచేయాలని ఉంది మామా... కానీ చదువు, ప్రాజెక్టు వర్కుతోనే సరిపోతోంది!’

- ఓ కుర్రాడి బాధ

* చాలీచాలని జీతంతో సర్దుకోలేకపోతున్నా. నా టాలెంట్‌కి కచ్చితంగా గ్రూప్స్‌ ఉద్యోగం కొడతా. కానీ ఆఫీసులో గంపెడు చాకిరీ.. ఇంటి బాధ్యతలు.. చదవడానికి తీరికెక్కడ?

- చిరుద్యోగి నైరాశ్యం

* సంగీతం నేర్చుకొని ఏదైనా రియాలిటీ షోలో నిరూపించుకోవాలని కోరిక. ఇంట్లో అమ్మ చెప్పే పనులు.. కాలేజీ పాఠాలతో నా కల నెరవేరేలా లేదు

- ఓ అమ్మాయి ఆవేదన

విద్యార్థి.. ఉద్యోగి.. మరొకరు.. అందరికీ లక్ష్యాలుంటాయ్‌.. నెరవేరకుండా సాకులు అడ్డు పడుతుంటాయ్‌!

మరి నిజంగానే వీళ్లంతా తీరిక లేకుండా ఉన్నారా? అంటే ఇదో పెద్ద అబద్ధం అంటారు నిపుణులు...

ఇది అరువు తెచ్చుకున్న తీరికలేనితనమేనని తేల్చేస్తారు...

ఈ తీరు మన కలలకు గండి కొట్టడమే కాదు

వ్యక్తిత్వం దెబ్బతీస్తుంది.. ఎదుగుదలకి ప్రమాదం అని హెచ్చరిస్తారు కూడా...

ఇంతకీ ఈ గజిబిజిల బిజీ సిండ్రోమ్‌ సంగతేంటి? సాకులేంటి? లక్షణాలేంటి?

బయటపడే మార్గాలేవి? ఇవిగోండి.

ప్పుడే కేర్‌మన్న పిల్లాడి నుంచి మనలాంటి యూత్‌ దాకా.. అందరికీ రోజూ ఇరవైనాలుగ్గంటలే. అయినా కొందరే ఎందుకు సూపర్‌ సక్సెస్‌ అవుతారు? చాలామంది ఎంత పనిచేసినా ఉన్నచోటే ఆగిపోతారు? ఈ గుట్టు వెనక ఉన్న గూడుపుఠానీ సంగతి చూద్దాం.

పనే ఉండదు
‘నేను చాలా బిజీ అని చెప్పుకోవడం గొప్ప కాదు. ఇదో పెద్ద అబద్ధం లేదా పని చేయడానికి సామర్థ్యం లేదని పరోక్షంగా ఒప్పుకోవడమే’ అంటాడు బీఎఫ్‌ స్కిన్నర్‌. జగమెరిగిన మానసికవేత్త. అనడమే కాదు నేను తీరికలేకుండా ఉన్నాను అనేవాళ్లలో ఎనభైశాతం మందికి చేయడానికి చేతినిండా పనే ఉండదని పరిశోధన చేసి మరీ తేల్చేశాడు. ఈ విషయం నిజం అని నిరూపించడానికి మనచుట్టే చాలామంది ఉంటారు. ‘లావుగా ఉన్నావ్‌. జిమ్‌కెళ్లి వ్యాయామం చేయొచ్చు కదా’ అంటే తెగ నొచ్చుకుంటాడో అబ్బాయి. ‘నాకూ వెళ్లాలనే ఉంది గురూ. సమయం చిక్కడం లేదు’ అని అడ్డంగా అబద్ధం ఆడేస్తుంటాడు. అతగాడే అభిమాన హీరో సినిమా చూడ్డానికి, క్రికెట్‌ మ్యాచ్‌ కోసం గంటలు వెచ్చిస్తాడు. ఇంకోఅమ్మాయికి యాంకరమ్మలా ఆంగ్లంలో గడగడా మాట్లాడేయాలని ఆశ. ఫలానా చోట స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాసులు ఉచితంగా చెబుతున్నారని సమాచారమిస్తే కిక్కురుమనదు. అందరి సంగతి కాదుగానీ మేం బిజీ అని రొమ్ము విరుచుకొని చెప్పేవాళ్లలో ఎక్కువమంది ఇదే బాపతు అంటారు సామాజికవేత్తలు. మానసిక నిపుణులు ఇంకాస్త లోతుల్లోకి వెళ్లి ఇందులోని ఇంకో కోణాన్నీ బయటపెడతారు. వారు చెబుతున్న దాని ప్రకారం మెదడు ఒకే విషయాన్ని రెండురకాలుగా నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది.

చేతన స్థితి: మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే మస్తిష్కం ముందే ఫలితాన్ని వూహిస్తుంది. జరగబోయే పరిణామాలకు రూపం ఇస్తుంది. మనం సానుకూలంగా ఉంటే అన్నిరకాలుగా సిద్ధం చేస్తుంది.

అచేతన స్థితి: లక్ష్యం ఉన్నా కొందరు దానిపై ఆసక్తి చూపించరు. బద్ధకంతో నాకు తీరిక లేదని ఫిక్సైపోతారు. మెదడు వెంటనే సిద్ధమైపోతుంది. బిజీగా ఉన్నామని చెప్పడానికి ఉన్న అన్ని సాకులు వెతుకుతుంది.

ప్రతికూలం అధికం
ఇంతకీ తీరిక లేకుండా ఉన్నానని చెప్పడం నేరమా? ఇదేమైనా చేయకూడని పనా? అంటే అంతకన్నా ఎక్కువే అంటారు వ్యక్తిత్వవికాస నిపుణుడు ప్రొ.రాజశేఖర్‌. ‘నేను బిజీగా ఉన్నానని పదేపదే చెప్పుకోవడం గౌరవప్రదం కాదు. చేస్తున్న పనిపై నాకు నియంత్రణ లేదని చెప్పడం, సంకుచితంగా ఆలోచించడమే’ అంటారాయన. ఇలా సొంతడబ్బా కొడుతూ ఉంటే నిజంగానే ఇతగాడు అంత బిజీనా? అంత విషయం ఉందా? అని ఆరా తీస్తారు పక్కవాళ్లు. మనది నటనని తేలగానే చులకనభావం ఏర్పడుతుంది. తేలిగ్గా తీసుకుంటారు. మనల్ని ఏ విషయంలోనూ నమ్మరు. దీంతో రావాల్సిన అవకాశాలు దక్కకుండా పోతాయి. కొన్నిసార్లు మానవ సంబంధాలకు ఎసరు వచ్చే ప్రమాదమూ ఉందని ప్రతికూల ఫలితాలు వివరిస్తారు.

మరేంచేయాలి?
* ఏరోజు చేయాల్సిన పనుల జాబితా ఆరోజే సిద్ధం చేసుకోండి. ఫలితాన్నిచ్చేవి, సమయం వృథా చేసేవేవో బేరీజు వేసుకొని సమయం తినేవాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే ఉత్తమం.

* మొహమాటం, మంచి పేరు కోసం ఇతరులు చెప్పే ప్రతి పనికీ ‘ఎస్‌’ అనొద్దు. కీలక విధులపై ప్రభావం చూపేవాటికి నిర్మొహమాటంగా ‘నో’ చెప్పాలి.

* చాటింగ్‌, ఈమెయిళ్లకు బదులివ్వడం, ఫోన్లు మాట్లాడ్డం, ఉత్తర ప్రత్యుత్తరాలు.. ఇలాంటి పనులన్నింటికీ ఒక ప్రత్యేకమైన, నిర్ణీత సమయం కేటాయిస్తే ఎనభైశాతం టైం ఆదా చేయొచ్చని ఓ అధ్యయనం చెబుతోంది.

* బిజీగా ఉన్నామని చెప్పేముందు ఆత్మపరిశీలన చేసుకోవడం అతి ముఖ్యం. ఫలితాన్నివ్వని తీరికలేని పనులు వదులుకోవడం తక్షణం చేయాల్సిన పని.

* ఎక్కువ పనులు చేస్తూ తీరిక లేకుండా ఉండటంకంటే తక్కువ పనులే ఎంచుకొని ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

* పని చేసేటపుడే ఫలితంపై దృష్టి పెట్టకుండా చర్యకు ఉపక్రమించేముందు పక్కా ప్రణాళికతో వెళుతూ సమయం ఆదా చేయాలి.

* ఉన్నతస్థానంలో ఉన్నా కొందరు ఎదుటివాళ్ల మీద నమ్మకం లేక కిందిస్థాయి పనులు చేస్తుంటారు. దీంతో అసలు పనికే ఎసరొచ్చే ప్రమాదం.


పలాయనవాదమే

నేను బిజీగా ఉన్నానని చెప్పుకోవడం పనిని తప్పించుకొని తిరిగే మనస్తత్వమే. ఆత్మన్యూనత, పనిపై ఆసక్తి లేకపోవడం, బద్ధకం, సమయ నిర్వహణ సరిగా లేకపోవడం, పేరు కోసం పాకులాడ్డం.. బిజీ సిండ్రోమ్‌ వ్యక్తుల్ని తయారు చేస్తుంది. ప్రణాళికాబద్ధమైన సమయ నిర్వహణతో ఎన్ని పనులున్నా ఇంకొంత సమయం మిగుల్చుకోవచ్చు. చేస్తున్న పనిపై ఆసక్తి, ఇష్టం పెంచుకోవడం.. వ్యక్తిగతంగా కొన్ని త్యాగాలు చేస్తుంటే ఏ పనిలో అయినా విజయం సాధించొచ్చు. అంతకంటే ముందు తన సామర్థ్యం మీద అంచనా ఉండాలి. దానికి తగ్గట్టే మసలుకోవాలి. చేసే పనిలో ఆనందం అనుభవిస్తుంటే అలసట ఉండదు. నేను బిజీ అనే మాటే వినిపించదు. సమయ నిర్వహణ, సానుకూల దృక్పథం, వ్యక్తిత్వం.. ఈ మూడూ మెరుగైన వ్యక్తుల్ని, సమాజాన్ని తయారు చేస్తాయి.

- ప్రొ.బి.రాజశేఖర్‌, కెరీర్‌ కౌన్సిలర్‌

రోజుకి పద్దెనిమిది గంటలు

మ్మానాన్నలకి ముగ్గురం కూతుళ్లం. నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నాన్న కల. ఎంసీఏ పూర్తైన వెంటనే ప్రయత్నాలు మొదలెట్టా. ఏడాది దాకా ఖాళీ. ఇంట్లో పరిస్థితేం బాగా లేదు. స్నేహితురాలి సాయంతో ఒక విద్యాసంస్థలో డాక్యుమెంటేషన్‌ ఉద్యోగంలో కుదిరా. నా లక్ష్యం మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఉదయం ఆరింటికే లేచి తయారయ్యేదాన్ని. ఏడు నుంచి తొమ్మిది వరకు ఎంఎస్‌బీఐ సాఫ్ట్‌వేర్‌ కోర్సు పాఠాలు. తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు దాకా కొలువు. నాలుగున్నర నుంచి రాత్రి ఏడున్నరదాకా పిల్లలకు హోం ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇంటికి రాగానే మళ్లీ పుస్తకం పట్టడం, కోర్సు సాధన. పద్దెనిమిదిగంటలు ఉరుకులుపరుగులు. ఇవన్నీ ఎలా చేస్తున్నావని ఫ్రెండ్స్‌ ఆశ్చర్యపోయేవాళ్లు. నాకు కష్టం విలువ తెలుసు. లక్ష్యం చేరాలనే పట్టుదల ఉంది. దానికి తగ్గట్టే కోర్సు పూర్తైన వెంటనే నా కల ఫలించి పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం వచ్చింది. ప్రతి పనినీ ఇష్టపడితే, బాధ్యతగా ఫీలైతే మన జీవితంలో ‘బిజీ’ అనే మాటకే తావుండదు.

- జి.భారతీ, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని