ఆఫీసులో చూపులన్నీ నాపైనే

ఎంబీఏ పూర్తి చేసి ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఆఫీసర్‌ హోదాలో చేరా. ఆధునికంగా ఉండటం నాకలవాటు.

Published : 01 Apr 2017 01:28 IST

ఆఫీసులో చూపులన్నీ నాపైనే

* ఎంబీఏ పూర్తి చేసి ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఆఫీసర్‌ హోదాలో చేరా. ఆధునికంగా ఉండటం నాకలవాటు. మొదటిరోజు జీన్స్‌, టాప్‌ వేసుకొని వెళ్లా. మేనేజర్‌ పిలిచి ఇలాంటి డ్రెస్‌ వేసుకొని రావొద్దని ముఖం మీదే చెప్పారు. చీర కట్టుకునే ఓపిక లేదు. చుడీదార్‌ ఇష్టం లేదు. కొన్నాళ్లు మేనేజ్‌ చేసి మళ్లీ పాత స్టైల్‌నే పాటిస్తున్నా. ఆఫీసులో మగవాళ్లంతా కొరుక్కుతినేలా చూస్తున్నారు. ఏదో వంకతో మాట కలపాలని ప్రయత్నిస్తున్నారు. నీవల్ల అందరి పని చెడిపోతోందని బాస్‌ ఈమధ్య మళ్లీ సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరి తీరూ నచ్చట్లేదు. అలాగని ఉద్యోగం మానేయలేను. నా సమస్యకు పరిష్కారం ఏంటి?

- ఎం.ఆర్‌.

 * కొంతమంది ఎవరి కోసం మారరు. మరికొందరు పరిస్థితుల్ని బట్టి సర్దుకుపోతారు. కొంతమందికి తమ గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న బెంగ ఉండదు. మరికొందరు ఇతరుల కోసమే అన్ని పనులూ చేస్తుంటారు. తెలివైన వాళ్లు పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటారు. సాదాసీదాగా బతికేద్దామనుకున్నవాళ్లు రాజీ పడిపోతుంటారు. రాజీ పడిన ప్రతిసారీ ఓడిపోయినట్లు కాదు. మార్పు అనివార్యమైతే మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్లడంలో తప్పేమీ లేదు.

సౌకర్యంగా లేని దుస్తులు ధరించమని ఎవరూ సలహా ఇవ్వరు. అలాగే నాగరిక సమాజంలో మన హోదా, గౌరవం కాపాడే దుస్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. హుందాగా ఉండే వస్త్రధారణ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చక్కటి పనితీరు ప్రదర్శించడం ఎంత అవసరమో, హోదాకు తగ్గట్టుగా నడక, నడవడిక, వస్త్రధారణ కలిగి ఉండటం అంతే అవసరం.

ఫలానా దుస్తులే ధరించాలని చెప్పడం అన్యాయమే కానీ అధికారి హోదాలో ఉన్న మీరు బహుశా కార్యాలయంలోని సహోద్యోగులతోనే కాకుండా బయటివారితో కూడా వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. సంస్థ గౌరవం ఇనుమడించేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. అందులో మీ వస్త్రధారణ కూడా కీలకమైందే. పనిలో వంకలు పెట్టడం కుదరకపోతే ఇటువంటి విషయాలను పెద్దవి చేసి చూపడం మామూలే. ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కొన్నాళ్లు బాస్‌ చెప్పిన పద్ధతిలో తయారవండి. చీర కట్టుకోవడం మరీ కష్టమేమీ కాదు. చుడీదార్లలో ఇప్పుడు చాలా వెరైటీలు దొరుకుతున్నాయి. వస్త్రాల ఎంపికపై తగినంత శ్రద్ధ లేకపోతే మీ ఆత్మీయులతో, స్నేహితులతో చర్చించండి. మీ గౌరవాన్ని పెంచే దుస్తులపై శ్రద్ధ పెట్టండి.

మార్పును అంగీకరించండి. పరిస్థితులకు అనుగుణంగా, అధికారుల పట్ల అణకువగా, సహోద్యోగులతో అభిమానంగా మెలగడంలో తప్పు లేదు. కానీ మన గురించి, మన వ్యక్తిత్వాన్ని గురించి వ్యాఖ్యానించే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు. మన గురించి కామెంట్‌ చేయాలంటే ఇతరులు భయపడేలా మన ప్రవర్తన ఉండాలి. ఉద్యోగం మానలేనంటూ అశక్తత ప్రకటిస్తున్నారు. మెల్లిగా మీ అభిరుచులకు సరిపడే ఉద్యోగం వెతుక్కోండి. అంతవరకు పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వెళ్లండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని