Pawan: తుపాను అనంతరం గ్రామాల్లో పారిశుద్ధ్యంపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 29 Oct 2025 22:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: తుపాను అనంతరం గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అధికారులతో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నామని, తదుపరి చర్యలు అత్యంత కీలకమన్నారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధప్రాతిపదికన పని చేయాలని పవన్ సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమర్థంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.

1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు.. ఉప ముఖ్యమంత్రికి తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు. తాగు నీటిని అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం చూడాలని పవన్ అధికారులతో చెప్పారు. 21,055 మంది సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని