‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్‌లో భారీ అక్రమాలున్నాయ్‌’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 06:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి: వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్‌లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. ఛైర్మన్‌ ఎన్‌.అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు బూర్ల రామాంజనేయులు, యార్లగడ్డ వెంకట్రావు, తెనాలి శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బొలిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సంబంధిత అధికారులు హాజరయ్యారు. 

ఆస్తులను జప్తు చేశామంటే సరిపోతుందా..?

‘పెద్దమొత్తంలో అప్పులిచ్చారు. శీతల గిడ్డంగులకూ రుణాలిచ్చారు. వాటిని తిరిగి రాబట్టరా?’ అని సభ్యులు ప్రశ్నించగా.. తిరిగి చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ‘జప్తు చేస్తే సరిపోతుందా? నిబంధనల ప్రకారం పబ్లిక్‌ నోటీసులిచ్చి వాటిని వేలం వేసి, మొత్తాన్ని రాబట్టాలి కదా’ అని సభాసంఘం నిలదీసింది. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారిని అప్పటికప్పుడు సభ్యులుగా చేర్చుకుని వారికి పెద్ద మొత్తాల్లో రుణాలిచ్చారు? ఎవరు చెబితే ఇలా చేశారు? ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి’ అని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే దాదాపు రూ.3 కోట్లపైనే అక్రమాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేక పోయారు?’ అని బొలిశెట్టి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. 

గోదాములన్నీ ఒకరికేనా?

‘రైతుల కోసం ఉద్దేశించిన గోదాముల్లో అత్యధికం జగనన్న కాలనీల్లోనే కట్టారు. గోదాములను రాష్ట్రవ్యాప్తంగా కట్టేందుకు ఒకరికే కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటి? వాటికి అనుసంధాన రహదారులు లేవు. ఉపయోగించుకునే స్థితిలో లేవు. ఎవరి ప్రయోజనాల కోసం వాటిని కట్టారు?’ అని సభ్యులు అసహనం వ్యక్తంచేశారు. గోదాముల పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు. 

51 సెక్షన్‌ విచారణ ఏమైంది?

‘సహకార చట్టం 51 సెక్షన్‌ కింద విచారణను ఫిర్యాదులు వచ్చిన చోటే.. అందులోనూ రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలోనే చేస్తున్నారు. దీనినీ పూర్తిస్థాయిలో చేపట్టక పోవడానికి కారణాలేంటి? విచారణను దారి తప్పించారు. ప్రాథమిక సహకారం సంఘం నుంచి రుణాలు ఇచ్చినప్పుడు కార్యదర్శి ఒక్కరితోనే అయిపోదు కదా? అక్కడ ఉండే త్రిసభ్య కమిటీ ఆమోదమూ కావాలి కదా? రుణాల పంపిణీలో అవకతవకలకు కార్యదర్శులను బాధ్యులను చేసి, త్రిసభ్య కమిటీలోని వారిని ఎలా తప్పిస్తారు? బినామీ పాస్‌ పుస్తకాలకు సూత్రధారులెవరు? తర్వాత వాటిని ఎలా డిలీట్‌ చేశారు? బాధ్యులెవరో తేలాలి కదా’ అని అధికారులను రామాంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ తదితరులు నిలదీశారు. ‘రికార్డులను డిజిటలైజ్‌ చేయడం అవసరమే. కానీ, అందుకోసం 5జీ కాలంలో 2జీ పరికరాలను ఎందుకు కొన్నట్లు? డిజిటలైజేషన్‌ ప్రక్రియలోనే అక్రమాలున్నట్లున్నాయి. వీటి సంగతి తేల్చాల్సి ఉంది’ అని సభ్యులు అభిప్రాయపడ్డారు.

15 రోజుల్లోగా సమర్పించండి

‘టర్నోవర్‌ ఆధారంగా సహకార సంఘాలను తనిఖీ చేసినప్పుడు నాబార్డు/డీసీసీబీలు/ఆడిటింగ్‌ సంస్థలు గుర్తించిన అవకతవకలపై ఏయే సమాధానాలిచ్చారు? ఆ నివేదికలను 15 రోజుల్లోగా సభా సంఘం ముందుంచండి’ అని ఛైర్మన్‌ అమరనాథరెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తామని స్పష్టంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు