ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు.. ఏ1గా జోగి భార్య శకుంతల, ఏ2, ఏ3గా కుమారులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Nov 2025 07:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విజయవాడ జీజీహెచ్‌లో పోలీసులను నెట్టుకుంటూ లోపలికి వెళ్తున్న జోగి రమేష్‌ అనుచరులు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట: పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్‌ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన జోగి రమేష్, రాములను న్యాయస్థానంలో హాజరుపరిచే ముందు పోలీసులు ఆదివారం రాత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైకాపా శ్రేణులు వీరంగం స్పష్టించాయి. లోపలకు చొచ్చుకురాకుండా నిలువరిస్తున్నా ఆగకుండా ఆ పార్టీ అనుచరులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ప్రవేశ ద్వారం అద్దాలు పగలగొట్టారు. అక్కడే విధుల్లో ఉన్న మాచవరం ఎస్‌.ఐ శంకర్‌రావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతనిపై దౌర్జన్యం చేశారు. వీరిలో జోగి రమేష్‌ భార్య శకుంతల, కుమారులు రాజీవ్, రోహిత్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి బీఎన్‌ఎస్‌లోని 189 (2), 324 (3) రెడ్‌విత్‌ 190, 3 పీడీపీపీఏలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1గా జోగి రమేష్‌ భార్య శకుంతల, ఏ2గా పెద్ద కుమారుడు రాజీవ్, ఏ3గా చిన్న కుమారుడు రోహిత్‌లతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరో 10 నుంచి 15 మందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది.

పేరు డిజిటల్‌ బుక్‌లో రాస్తాం: ‘ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా రెండేళ్లే. నీ పేరు ఏంటి? డిజిటల్‌ బుక్‌లో రాసుకుంటాం. నీ కాలర్‌ పట్టుకుని నిలదీస్తాం. నీకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం’ అంటూ ఎస్‌.ఐ. శంకర్‌రావును వైకాపా అనుచరులు దుర్భాషలాడారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా రచ్చ చేశారు. అందరూ కలసి పోలీసులను నెట్టుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు యత్నించగా ప్రవేశమార్గం వద్ద ఉన్న తలుపు అద్దాలు పగిలిపోయాయి. ‘జై జోగి’ అని నినాదాలు చేస్తూ చొచ్చుకెళ్లారు. అక్కడే ఉన్న ఎస్‌.ఐను పక్కకు నెట్టేశారు. ఓ కానిస్టేబుల్‌ కిందపడిపోవడంతో అతనిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లి పైశాచికత్వం ప్రదర్శించారు. 

వైకాపా శ్రేణుల అరాచకంపై పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యం చేస్తున్నా ఎందుకు నిలువరించలేకపోయారని పోలీసు అధికారులను సీపీ ప్రశ్నించినట్లు సమాచారం. ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి పోలీసులపై తిరగబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags :
Published : 04 Nov 2025 06:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని