కోరికలు - భయక్రోధాలు

అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు. అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి? రుషి కోరికలను జయించినవాడు. అందువల్ల అతడికి భయ క్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు.

Published : 26 Feb 2024 00:44 IST

అనంతమైన లోకాలను సృష్టించినవాడు భగవంతుడు. అతడే జగత్తుకు ప్రభువు. ఆయన సృష్టి మానవమాత్రుడి అవలోకనకు రాదు. మహర్షులు సైతం, అనంతమైన జ్ఞానంతో ఏ లేశమాత్రమో తెలుసుకుంటారు. సామాన్య వ్యక్తికి, జితేంద్రియుడైన రుషికి తేడా ఏమిటి? రుషి కోరికలను జయించినవాడు. అందువల్ల అతడికి భయ క్రోధాలు అనుభవంలోకి రావంటారు పండితులు. మనిషి కోరికల స్థావరం! కోరికలు తీరనప్పుడు అసహనం స్థానాన్ని క్రోధం ఆక్రమిస్తుందంటాడు శ్రీకృష్ణ భగవానుడు.

భగవంతుడి సువిశాల సృష్టిలో గడ్డి మైదానాలు, ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, సముద్రాలు, వాటి ఆవల దిగంతాలు, వాటి ఆవల తమ ఆకర్షణ పరిధిలో అంతరిక్షంలో తేలియాడే, అనేక నక్షత్ర గ్రహసముదాయాలు ఉన్నాయి! ఆకాశం ఎంత మేర వ్యాపించి ఉందన్నది ఊహకు అందని విషయం.

జీవించి ఉండే ప్రాణులకే కాదు, ప్రాణం లేని వస్తువులకు సైతం వార్ధక్యం(బలం కోల్పోవడం), వినాశం ఉన్నాయంటారు తత్వజ్ఞులు. వార్ధక్య, మరణాలు అణువుకు సంబంధించిన భౌతిక లక్షణాలు. దైవం అణువులో అణువుగా, ఘనంలో ఘనంగా బ్రహ్మాండాలను ఆక్రమించిన విక్రముడిగా ఉన్నాడు. మనిషి సాధన పండించుకుని ఏనాటికైనా దివ్యత్వాన్ని తెలుసుకోవలసి ఉంది. అయితే అతడి ఎదుగుదలకు అడ్డు తగిలేవి భౌతికమైన కోరికలే. హాయిగా జీవించాలన్న కోరిక వల్లే అది తీరదేమోనన్న శంక వెంటాడుతుంది. వెలుగు వెంట నీడలా భయం ఆవహిస్తుంది. కోరికలు తీరనప్పుడు కలత చెందిన మనసు సులభంగా క్రోధావేశాలకు లోనవుతుంది.

కోరికలకు మూలం మనసు. మనసును లొంగదీసుకోవాలని గీతాచార్యుడి సందేశం. వైరాగ్య భావన అలవాటు చేయడం వల్ల మనసు మనిషి మాట వింటుంది. తర్ఫీదులో భాగంగా రుషులు ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంద్రియాల(కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం) వల్లే మనిషికి కోరికలు కలుగుతాయి. మంచి దృశ్యాన్ని చూడాలని, సుశ్రావ్యమైన శబ్దాలు వినాలని, సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించాలని, షడ్రుచులను ఆస్వాదించాలని, శీతోష్ణాలు హాయిగొలపాలని ఇంద్రియాలు కోరుకుంటాయి. ధ్యాన సాధనకు ఉపక్రమిస్తే ఇంద్రియాల వేగం తగ్గుతుంది. కోరికలూ తగ్గుముఖం పడతాయి.
సాధారణ వ్యక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వేగం తగ్గడాన్ని తెలుసుకుంటారు. కోరికలు తగ్గించుకున్నవారికి అవి తీరడం లేదన్న మనస్తాపం ఉండదు. మనిషిని భయం ఆవరించినప్పుడు దాన్ని ఎదుర్కోలేక తనపై తనకే కోపం కలగవచ్చు. శరీరం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తాయి. ధ్యాన సమయంలో, నిద్రలో ఆ అవసరం ఉండదు.

రామకృష్ణ పరమహంస, భగవాన్‌ రమణ మహర్షి సామాన్యులను కలతకు గురిచేసే భయంకర వ్యాధులను ఉదాసీనంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అటువంటి వ్యాధులు వారికి భయం కలగజేయలేదు. చేతకానితనం సామాన్యుల్లో క్రోధావేశాలు కలిగిస్తుంది. కోరికలను జయించిన సాధకులు భయక్రోధాలను జయించినవారవుతారు. ఆ దిశగా ఆధ్యాత్మిక సాధన సాగిన జిజ్ఞాసువులు పరిపూర్ణ ఆనంద స్థితికి చేరుకోగలరన్న సందేశాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది.

గోపాలుని రఘుపతిరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని