దేహం పోతుంది... మరి నేను?

శ్రీ రమణ మహర్షులవారికి నామకరణం చేసిన రోజున తల్లిదండ్రులు పెట్టిన పేరు- వెంకట్రామన్‌. ఆయన పదహారో ఏట తండ్రి మరణవార్త విని ఇంటికి చేరుకొన్నాడు.

Published : 28 Feb 2024 00:29 IST

శ్రీ రమణ మహర్షులవారికి నామకరణం చేసిన రోజున తల్లిదండ్రులు పెట్టిన పేరు- వెంకట్రామన్‌. ఆయన పదహారో ఏట తండ్రి మరణవార్త విని ఇంటికి చేరుకొన్నాడు. బయట పడుకోబెట్టిన మృతదేహాన్ని చూడగానే ‘మా నాన్న చనిపోయాడంటారేం? ఇక్కడే ఉన్నాడుగా’ ఆశ్చర్యంగా అన్నాడు. ‘చనిపోకపోతే నిన్ను ప్రేమతో దగ్గరికి పిలిచి మాట్లాడేవారు కదా బాబూ!’ సానునయంగా అన్నారు అక్కడ చేరిన పెద్దలు. ‘అయితే ఇంతకాలం నాతో మాట్లాడింది ఈ శరీరం కాదా?’ వెంటనే సంశయం వెలిబుచ్చాడు. పెద్దల నోట మాట రాలేదు... శరీరం వేరు. లోపలినుంచి మాటాడింది వేరా... అంటే నేను ఈ శరీరం ఒకటి కాదా, వేరు వేరా? అలాంటప్పుడు ‘నేను’ ఎవరు? ఆయన మనసును తొలిచివేసిన తొలి సంశయమిది.

ఒకనాడు వెంకట్రామన్‌ తన మేనమామ ఇంటిలో మేడమీద ఉన్న చిన్న గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. కొంత సేపటికి తన ఊహకు అందని ఓ విచిత్ర సంఘటన జరిగింది. అది ఆయన మాటల్లోనే చెప్పాలంటే- శరీరంలో ఎలాంటి అనారోగ్యమూ లేదు. చనిపోతున్నానన్న మాట ఎవరితోనూ చెప్పదలచుకోలేదు. వస్తూన్న మరణాన్ని ఎదుర్కొని ధైర్యంగా పర్యవసానం తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరాను. అనుకొన్నట్టు నిజంగానే చావు దాపురించింది. ఇంతకీ చావు అంటే ఏమిటి? ఎవరికొస్తుంది. నాకేనా? నేను ఎవరిని, చనిపోయేది ఏమిటి? ఓహో! ఈ శరీరం చనిపోతుంది. పోతే పోనీ అనుకొన్నాను. అంతే... నా రెండు కాళ్లు, చేతులు బార్లా చాచాను. పెదాలు బిగపట్టాను. మాట, పలుకు లేకుండా శ్వాస పీల్చకుండా ఉండిపోయాను. అటుపై నేను నాపై దృష్టి సారించాను. చావును అనుభవించాను... మళ్ళీ ఇలా అనుకొన్నాను. శరీరం చచ్చిపోయింది. ఇక శవాన్ని శ్మశానానికి తీసుకుపోతారు. దహనం చేస్తారు. కాలి బూడిదైపోతుంది. బూడిదైన శరీరంలో ‘నేను’ నశించానా? నేను నశించిపోతే శరీరం కాలి బూడిదైనట్లు నేను ఎలా తెలుసుకోగలను. అయితే నేను శరీరాన్ని కానా? శరీరం కాలి బూడిదైన తరవాతా చావును అంటకుండా ప్రకాశిస్తున్నాను. దీన్నిబట్టి అనునిత్యమైన శరీరం నేను కాదన్నమాట. శరీరం వేరు, నేను వేరు. ‘నేను’ నాశనం లేని ‘ఆత్మ’. శరీరం క్షయమైతే నేను అక్షయం. మహనీయంగా తలపింపజేసే ఈ శరీరంలోని భావాతీత శక్తిని నేను. అంతే... అలా అనుకొన్న నాకు నన్నావహించిన మరణ భయం శాశ్వతంగా నా నుంచి దూరమైపోయింది అని స్వయానా తానే చెప్పుకొన్నారాయన.

భగవాన్‌ రమణ మహర్షుల మహాభి నిష్క్రమణానికి ముందు కొద్ది కాలంపాటు ఎడమ చేయిపై లేచిన రాచపుండుతో బాధపడ్డారు. రమణులను దర్శింపవచ్చిన భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు వైద్య సలహాలిచ్చారు. మహావైద్యులను పిలిపించి పలుమార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. ఈ శరీరం నాది కాదు అనుకొన్న రమణులు భక్తుల మనవి కాదనలేక శస్త్ర చికిత్సలకు తలవొగ్గి జరుగుతున్నవాటిని తనవి కాదనుకొని భావించి భరించారు.

శ్రీరమణ మహర్షులవారు 1950 ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి తమ భౌతిక దేహాన్ని వీడారు. భక్తజనులందరూ చూస్తుండగానే ఆ శరీరంలోంచి ఓ దివ్యజ్యోతి కాంతులు విరజిమ్ముతూ బయటికొచ్చి ఆకాశమార్గాన వెళ్తూ అరుణాచల శిఖరంలో కలిసిపోయి కనుమరుగైంది. తాను, శరీరం ఒకటి కాదని ప్రత్యక్ష నిరూపణ చేసి ఆ తత్త్వ తేజాన్ని అందరికీ పంచిపెట్టి దేహం చాలించిన రమణులవారు భక్తజన హృదయాల్లో ఈనాటికీ చిరంజీవిగా విరాజిల్లుతున్నారు.

 యం.సి.శివశంకరశాస్త్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని