శుభోదయం - శుభరాత్రి

మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.

Published : 04 Apr 2024 01:28 IST

మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. కాలం అనేది కంటికి కనబడని అనుక్షణ పరివర్తన. ఉదయాలు వస్తుంటాయి, పోతుంటాయి. రాత్రులు వస్తుంటాయి, పోతుంటాయి. దేనికీ నిలకడ లేదు. కాలప్రవాహంలో శుభాలు, అశుభాలు నిత్యం జరిగేవే. వాటిని ఎవరూ ఆపలేరు. అయినప్పటికీ మనిషి ఎప్పుడూ శుభాన్నే కోరాలని సనాతన కాలం నుంచి వినిపిస్తున్న సందేశం. పుట్టుకలు, చావులు అనేవి సృష్టిధర్మాలు. వాటిని స్తంభింపజేయడం ఎవరి తరమూ కాదు. లోకంలో పుట్టిన ప్రాణులన్నీ మరణం లేకుండా అలాగే శాశ్వతంగా ఉంటే సృష్టి ధర్మానికి విరుద్ధం అవుతుందే కానీ, అనుకూలం కాదు. పుట్టడమే తప్ప చావులు లేకుంటే ఈ భూగోళంపై నిలవడానికి కూడా చోటు దొరకదు. కృతయుగంలోని దృశ్యాలు కలియుగం దాకా ఉండవు కదా? అందుకే ఈ ప్రపంచం అశాశ్వతమని, ప్రాణుల ఉనికి క్షణభంగురమని అనేక తత్వాలు బోధిస్తున్నాయి. మనిషి పురుషుడు కానీ, స్త్రీ కానీ పుట్టినప్పుడు ఎలా ఉన్నారో జీవిత చరమదశ వరకు అలాగే ఉండరు. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే వివిధ దశలలో వివిధ రూపాలలో మానవ శరీరం పరిణామం చెందుతూనే ఉంటుంది. సృష్టి అంతా పరిణామశీలం అయిందేనని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. కాలం కూడా పరిణామశీలం. అనుక్షణం మార్పులతో అనూహ్యంగా సాగిపోతూనే ఉంటుంది. ఎండ వస్తుందనుకుంటే వాన పడుతుంది. వాన పడుతుందనుకుంటే ఎండ కాస్తుంది. ప్రకృతి పరిణామం అనూహ్యం. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరు ముందుగా చెప్పగలరు?

మనిషి ఆశాజీవి. తన కళ్లెదుట విషమ పరిస్థితులు కనబడుతున్నా, అవన్నీ శాశ్వతంగా ఉండవని, మళ్ళీ మంచిరోజులు వస్తాయనీ ఆశిస్తుంటాడు. ఈ ఆశ ఒక్కటే మనిషిని బతికిస్తుంది. మనిషి- కటిక చీకటిలో కాంతిపుంజం కోసం వెదకాలి. అగాధలోయలో పడినా ప్రయత్నించి, నేలపైకి చేరుకోవాలి. ప్రాణాపాయ స్థితిలోనూ ధైర్యకవచాన్ని వీడరాదు. అడవిలో సంచరించే జింకపిల్ల, పులి కనబడగానే పరుగులు తీస్తుంది. తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం అది రాళ్లలో, రప్పలలో, ముళ్లకంచెల్లో, మంటల్లో నుంచి సైతం దూకి పరుగులు తీస్తుంది. ఈ గుణం మనిషికి అవసరం. విషమ పరిస్థితుల్లోనూ అనుకూలభావాలు మనిషిని రక్షిస్తాయి.

వేదంలో కూడా ‘మంగళకరమైన మాటలనే నిరంతరం వింటూ ఉండాలి, మంగళకరమైన దృశ్యాలనే చూడాలి, స్థిరసంకల్పంతో మంచినే కోరుకోవాలి’ అని చెప్పే మంత్రాలు వినిపిస్తాయి. సీతాన్వేషణకై లంకానగరానికి వెళ్ళిన మారుతి, అక్కడ ఎంత వెదికినా సీత జాడ కనబడకపోగా, ఒక్క క్షణం నిరాశకు లోనవుతాడు. సీతాదేవి జాడను తెలుసుకోకుండా, తిరిగి వెళ్ళి రామచంద్రుడికి తన ముఖం ఎలా చూపాలని ఆవేదన చెందుతాడు. ఇక తనకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావిస్తాడు. కొంతసేపటికి, తానే తేరుకొని, ‘నేను మరణిస్తే రాముడికి ఎన్నో ఆపదలు సంభవిస్తాయి. బలవన్మరణం ఎన్నో దోషాలకు నెలవు. బతికి ఉంటే ఏదైనా సాధించగలను’ అనుకొని, తన ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకొని, ఉత్సాహంతో ముందుకు సాగి, చివరికి అశోకవనంలో సీత జాడను కనుగొంటాడు. ప్రతి మనిషీ ఆంజనేయుడిలా ఆలోచించాలి. చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకోవాలి. ఆత్మశక్తితో ముందుకు నడవాలి!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని