గజ పురాణం

దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ  ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.

Published : 07 Apr 2024 00:55 IST

దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ  ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. ఐరావతానికి ఇతర ఏనుగుల్లా రెండు పొడవైన దంతాలు కాకుండా నాలుగుంటాయి. కొన్నిచిత్రాల్లో ఆరు దంతాలు కనిపిస్తాయి. ఐరావతాన్ని అభ్రమాతంగం అంటారు. అభ్రమంటే ఆకాశం, మేఘం అనే అర్థాలున్నాయి. మేఘాల్ని బంధించే ఏనుగని అర్థం. సూర్యుడి సోదరుడనే అర్థంలో అర్క సోదరుడనే పేరూ ఐరావతానికి ఉంది. దేవగురువు బృహస్పతికి, భూదేవికి  ఏనుగు వాహనమని కొన్ని పురాణాలు పేర్కొన్నాయి. ఐరావతం దక్షిణ దిక్కులో ఉంటుందని పురాణోక్తి. భూమిని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయని ప్రతీతి.

ఏనుగుకు సంబంధించి పౌరాణికంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంఘిక జీవనానికి సంబంధించి అనేక విషయాల ప్రసక్తి, ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. భూమిని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయని పురాణోక్తి. భాగవతంలో గజేంద్ర మోక్షణ వృత్తాంతం ప్రసిద్ధం. ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్యుడి శాపం వల్ల గజరాజై మొసలికి చిక్కి విష్ణువును ప్రార్థించి విముక్తి పొందాడు. సైన్యంలో చతురంగ బలాల్లో గజబలం ఉంటుంది. మహాభారతంలో అశ్వత్థామ పేరుతో ఏనుగు ఉండేది. ధర్మరాజు అసత్యం చెప్పవలసిన పరిస్థితిలో ఈ పేరు వాడుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షాన యుద్ధం చేసిన భగదత్తుడి ఏనుగు ప్రతీకం. భాగవతంలో కంసుడి ఏనుగు కువలయాపీడనం. అశోకచక్రవర్తి అగజాతమనే ఏనుగును అధిరోహించినట్లు ప్రస్తావన ఉంది. దేవాలయాల్లో స్వామివారిని గజవాహనంపై  ఊరేగించే సంప్రదాయం ఉంది. కేరళలో గురువాయూర్‌ శ్రీకృష్ణదేవాలయంలో 60 నుంచి 70 వరకు ఏనుగులు ఉంటాయి. సింహాచలంలో అప్పన్నకు వేములవాడ రాజన్నకు కోడె దూడల్ని సమర్పించే ఆచారం ఉన్నట్టు గురువాయూర్‌లో భక్తులు ఏనుగుల్ని బహూకరించే సంప్రదాయం ఉంది. కటకాన్ని పాలించే ప్రభువులను గజపతులుగా చరిత్ర పేర్కొంది. కాకతీయ రాజుల్లో ప్రతాపరుద్ర గజపతి ఉన్నాడు.

వినాయకుడు గజాననుడు. ఆ ఉదంతం పురాణ ప్రసిద్ధం. లోకంలో గొప్పదనాన్ని చెప్పే సందర్భాల్లో గజరాజుతో పోల్చడం తెలుగు నుడికారం ప్రత్యేకత. గజ ఈతగాడు, గజనిమ్మ, గజదొంగ, గజగమన, గజయాన, గజదంతం, గజకర్ణ మొదలైన పదాలు వాడుకలో ఉన్నాయి. రెండు వైపులా రెండు ఏనుగులు పూలదండలు పట్టుకొని నిలుచుండగా కనిపించే లక్ష్మీదేవిని గజలక్ష్మి అంటారు. ఏనుగుచుట్టూ లోకోక్తులు జాతీయాలు కొల్లలు. ఏనుగు కళ్లు మూసుకుంటే సింహం కలలో కనపడుతుందట. అందుకే సింహస్వప్నం మాట పుట్టింది. ఉన్నత లక్ష్యం ఏర్పరచుకోవడాన్ని కొడితే  ఏనుగు కుంభస్థలమే కొట్టాలనే వాక్యప్రయోగం ద్వారా వ్యక్తం చేస్తారు. ఏనుగు తిండి దానికి తగ్గట్టు అది చేసేపనీ సూచిస్తూ ఏనుగు మేత ఏనుగు మోత అనే లోకోక్తి ఏర్పడింది. ఆధిక్యానికి అల్పత్వానికి భేదాన్ని చెప్పడానికి హస్తిమశకాంతరం అనే జాతీయం వాడతారు. ఏనుగు పోతుంటే కుక్క మొరగడం అంటుంటారు. గొప్పవాణ్ని చూసి ఓర్వలేని అల్పుల ప్రవర్తనను ఉద్దేశించిన వ్యాఖ్య ఇది. కరిమింగిన వెలగపండు అనే జాతీయాన్ని సుమతీ శతకకారుడు ప్రయోగించాడు.ఏనుగు శరీర భాగాలూ విలువైనవే. ఒకప్పుడు ఏనుగు చచ్చీ వెయ్యి, బతికీ వెయ్యి అంటారు కదా. ఏనుగు జ్ఞాపకశక్తి అపారం. వివిధ వాసనల్ని మనుషుల స్వరాలను దశాబ్దాల పాటు గుర్తుంచుకోగలదు. ఉపకారులను, అపకారులను తేలికగా పసిగట్టగలదు.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని