దేహాలయం

సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు.

Published : 16 Apr 2024 00:40 IST

సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు.

కాళిదాసు కుమారసంభవ కావ్యంలో పార్వతి శివుడి గురించి తపస్సు చేసే సందర్భంలో శరీరమే ధర్మాలను ఆచరించే సాధనం అంటాడు. మనిషి కుటుంబ పోషణార్థం కష్టపడాలన్నా, జ్ఞాన విజ్ఞానాలు సంపాదించాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచిపనులు చేయడానికి ప్రధాన సాధనం శరీరమే కాబట్టి, మన దేహం ఆరోగ్యంగా చైతన్యవంతంగా ఉండాలి. శరీర ఆరోగ్యం ఉంటే తద్వారా మానసిక ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మనిషి కష్టం, దుఃఖం లాంటివి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా ఉండాలని భగవద్గీత బోధిస్తోంది. ఇలా ఉండాలంటే శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ బాగుండాలి.

ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం, జిహ్వచాపల్యం, అవసరాలకు మించి ఆహారాన్ని భుజించడం లాంటి వాటి వల్ల జీవనశైలి అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి వాటిని అదుపు చేసుకోవాలి. లేకపోతే శరీరం అనేక రుగ్మతల పాలవుతుంది. పెద్దలు మిత(ం) హాయి, అతి హాని అంటారు. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం మరేదీ ఉండదు కదా! అలాగే భక్తి పేరుతో మితిమీరిన ఉపవాసాలతోనో, పంతాలూ పట్టింపులతో అలిగి నిరాహారంతో శరీరాన్ని శుష్కింపజేసుకుని నీరసించిపోతే వచ్చే ఆలోచనలు కూడా చిక్కి శల్యమవుతాయి. చిన్న చిన్న ప్రతికూల భావనలు కలిగినప్పుడు కుంగి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ తెగింపు మాత్రం వెంటనే రాదు. అలాంటప్పుడే తన నిర్ణయం ఎంతవరకు సమంజసమని ఆలోచించాలి. ఈ చిన్న సమస్యకు ఎంతో అపురూపమైన మానవ జీవితాన్ని అర్ధాంతరంగా అంతం చేసుకోవడం సమంజసమని ఆలోచించాలి.

కఠోపనిషత్తు మానవ జీవితానికి ఇలా భాష్యం చెప్పింది- శరీరమనే రథం ఆత్మ అనే రథికుడి చేతిలో ఉంటుంది. దాన్ని మనసు అనే పగ్గంతో ఇంద్రియాలు అనే గుర్రాలు నడిపిస్తాయి. కాబట్టి దాన్ని సరైన ఆలోచనా మార్గంలో నడిపించాలి! 

శంకరులు ‘ఆత్మాత్మం గిరిజామతి’ అన్న శ్లోకంలో ‘శివా నా ఆత్మే నీవు, నాలోని బుద్ధి సాక్షాత్తు గిరిజాదేవియే. నా శరీరమే గృహం. ఈ శరీరం ద్వారా నేను అనుభవిస్తున్న విషయ భోగాలన్నీ నేను ఆచరించే పూజలే. నా నిద్రే సమాధి స్థితి. నేను నా పాదాల ద్వారా చేస్తున్న సంచారమంతా నేను మీకు చేస్తున్న ప్రదక్షిణ. నేను పలుకుతున్న మాటలన్నీ మీ స్తోత్రాలే’ అంటారు. మనం చేసే ప్రతి పనిలోనూ ఈశ్వర పూజ ఉందని దీని అర్థం. అటువంటి దేహాన్ని కాపాడుకోవడానికి ఆహార నియమాలు, యోగాభ్యాసం, ధ్యానం, ధర్మబద్ధమైన జీవన విధానం మొదలైనవి అలవరచుకోవాలి. చంచలమైన మనసు స్థిరపడటానికి సాధన అవసరం అంటాడు శ్రీకృష్ణుడు గీతలో. అంతరించిపోతున్న ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆదిశంకరాచార్యులు కాలినడకన దేశమంతా పర్యటించి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. చైతన్యవంతమైన శరీరం ఉన్నప్పుడే సత్కర్మలు చేయగలుగుతాం. దేహం ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే. కాబట్టి పరమాత్ముడు ప్రసాదించిన ఈ దేహంతో ధర్మబద్ధంగా జీవిస్తూ ఈ కాయాన్ని ఆలయంగా పరిరక్షించుకోవాలి. 

గంటి ఉషాబాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని