ప్రాప్తకాలం

అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు.

Published : 21 Apr 2024 00:27 IST

నంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా నశించిపోతుంది. అన్నింటినీ తనలో లయం చేసుకుంటూ, ముందుకు సాగిపోతూ ఉండటమే కాల స్వభావం.

మహేతిహాసమైన మహాభారతంలోని మౌసల, మహాప్రస్థాన పర్వాలు కాల లీలకు ఉదాహరణలు. మహాభారతయుద్ధం ముగిసిన తరవాత ధర్మరాజు ముప్ఫై అయిదు సంవత్సరాల రాజ్యపాలన చక్కగా జరిగింది. ముప్ఫై ఆరో సంవత్సరంలో ఆపదలు, ఉత్పాతాలు మొదలయ్యాయి. వాటిని చూసి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ధర్మరాజు ఆందోళనకు గురయ్యాడు. కాలానికి తెలుసు- పాండవులు, ద్రౌపది, కృష్ణుడు, బలరాముడు వంటివారు భూలోకంలో అవతరించిన లక్ష్యం పూర్తయిందని. ప్రాప్తకాలం (తనువు చాలించవలసిన సమయం) వచ్చినందువల్ల వాళ్లంతా తమ అవతారాలు చాలించవలసిందే అని నిర్ణయించింది. యాదవకులంలో ముసలాన్ని పుట్టిస్తే ఈ పని నెరవేరుతుందని కాలం తన పథకాన్ని చక్కగా అమలు చేసింది.

యాదవులంతా నశించాక కృష్ణుడు, బలరాముడు సైతం తమ అవతారాలను చాలించవలసిన సమయం వచ్చిందని భావించారు. కృష్ణుడి చక్రాయుధం ఆకాశంలోకి ఎగిరిపోయింది. దివ్యరథాన్ని గుర్రాలు సముద్రంలోకి తోసేశాయి. మిగిలిన యాదవులను కృష్ణుడు ప్రభాస తీర్థానికి వెళ్ళమన్నాడు. ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి మొదలైనవారంతా తనువు చాలించారు. బలరాముడు మహాసర్పంగా మారిపోయి అవతారాన్ని ముగించాడు. అందరి వియోగాన్నీ చూస్తూ ఉండలేక కృష్ణుడు ఒక చెట్టు చాటున పడుకొని యోగదీక్షలో నిమగ్నమయ్యాడు. ఒక వేటగాడు కృష్ణుడి పాదాలను పొదలమాటునుంచి చూసి, మృగం అనుకొని బాణంతో కొట్టాడు. ఆ గాయంతో కృష్ణుడు తన అవతారాన్ని చాలించి, దివ్యతేజోరూపంలో ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

తమకు ఆత్మీయులైన కృష్ణ, బలరామ, యాదవులంతా నశించిపోయాక పాండవులు ఇక తమకూ ప్రాప్తకాలం వచ్చిందని గ్రహించి, పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి మహాప్రస్థానానికి బయలుదేరారు. మహాప్రస్థానం అంటే పుణ్యస్థలాలను దర్శిస్తూ, కాలినడకతో ఉత్తరదిశగా ప్రాణాలు వదిలేదాకా ప్రయాణం చేయడం. వారి వెంట ఒక కుక్కకూడా బయలుదేరింది. మంచుకొండలను అధిరోహిస్తూ ముందుకు సాగుతుంటే మొదట ద్రౌపది నేలపై పడిపోయి తనువు చాలించింది. ఆ తరవాత వరసగా సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు లోయలలోకి జారిపడిపోయి ప్రాణాలు వదిలారు. ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు. అతడి వెంట కుక్క మాత్రమే ఉంది. చివరికి ఇంద్రుడు వచ్చి ధర్మరాజును తనవెంట స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. తనవెంట వచ్చిన కుక్కనూ స్వర్గానికి రప్పిస్తేనే తాను వస్తానన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు గొప్పతనాన్ని అభినందించి కుక్కతోపాటు అతణ్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. కాలం ఎప్పుడు ఏమి చేయాలో, అదే చేస్తుంది. కాలం కలిసివస్తే ఎలా అందరూ ఉన్నత స్థితికి చేరుకుంటారో, కాలం మూడితే అలా అందరూ కాలం ఒడిలోకి జారుకుంటారు. దేనికైనా ఒక ‘ప్రాప్తకాలం’ ఉంటుంది. దాన్ని దాటి ఎంతటి వారైనా ముందుకు సాగలేరు. కాలం బలీయం... కాలం అనివార్యం!

 డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని