పేరే పెన్నిధి

భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు.

Published : 25 Apr 2024 01:03 IST

భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు.

పురాణాలు, చరిత్రలోని పేర్లు ఆయా వ్యక్తుల ప్రవర్తన వల్ల దైవత్వాన్నో, రాక్షసత్వాన్నో ప్రతిఫలింపజేస్తాయి. రాముడు పోతపోసిన ధర్మ విగ్రహం. ఆంజనేయుడు శ్రీరాముడి బంటు. అర్జునుడు సవ్యసాచి. కర్ణుడు దానశీలి. హరిశ్చంద్రుడు సత్యనిరతుడు... ఇలా పేర్లు ఆయా వ్యక్తుల గుణ వైశిష్ట్యాన్ని లోకానికి వెల్లడిస్తాయి. రాముడికన్నా శ్రీరామ నామం ఎంత శక్తిమంతమైనదో లోకవిదితమే. భగవంతుడి అష్టోత్తర శత, సహస్ర నామావళిలోని ఒక్కోనామం ఒక్కో విశేషాన్ని తెలియజేస్తుంది. దివారాత్రాలు నామపారాయణం చేసి భక్తులు ధన్యులవుతారు.

ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ సమాజంలో దైవాంశతో వెలిగిపోతూ, మంచి పేరు తెచ్చుకోవాలని అభిలషిస్తారు. పుట్టిన బిడ్డకు నామకరణోత్సవం జరిపి ఎంచుకున్న పేరును పెట్టడంలోని ఔచిత్యం అదే. పదేపదే చేసే భగవంతుడి నామోచ్చారణ పదుగురికి పుణ్యం సంప్రాప్తింపజేస్తే, నాయకుల పేర్లు నాయకత్వ లక్షణాలను అందరి మదిలో మెదిలేలా చేస్తాయి. వారి కర్తవ్యదీక్షను చాటి చెబుతాయి. తమ జీవితాలకు మూలాలుగా నిలిచి, వారసత్వ లక్షణాలను ప్రసాదించినందుకు గౌరవ సూచకంగా, తమ పిల్లలకు పెద్దల పేర్లు పెట్టుకుంటారు వినయ సంపన్నులు.

రావణుడు, కంసుడు, శకుని, మంధర, కీచకుడు, హిట్లర్‌... అసురగుణ గణాల పేర్లు. పేరు చేసిన పాపమేమీ లేదు, ఆయా వ్యక్తుల ప్రవర్తన వల్ల ఆ పేర్లు నామకరణానికి నిషిద్ధాలయ్యాయి. దంపతులు తమ పిల్లవాడు మంచి పేరు తెచ్చుకుని ధరిత్రిలో చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుంటారు. రాక్షసుడు కావాలనో, దుష్ట శిక్షణలో భాగంగా మరొకరి చేతిలో హతమారాలనో కోరుకోరు.

తమ పేరు పట్ల ఎరుక కలిగి, బాధ్యతగా ప్రవర్తిస్తూ, దానికున్న విలువను, ప్రాముఖ్యాన్ని దిగ జార్చకుండా, సద్గుణసంపదతో, సత్ప్రవర్తనతో  పేరుకు సార్థకత చేకూర్చేవారుంటారు. తమకు జన్మనిచ్చినవారికి, గురువుకు, పుట్టిన గడ్డకు పేరు తీసుకువస్తారు. సంఘంలో తమ పేరుకు భిన్నంగా ప్రవర్తిస్తూ అపఖ్యాతి మూటగట్టుకునేవారూ ఉంటారు. పిలవడానికో పేరున్నా, పరుల కోసం పాటుపడని వారిని అనామకులుగా పరిగణిస్తుంది లోకం. మాట నిలుపుకోక పోతే నన్ను మారు పేరుతో పిలవ మంటారు నికార్సయిన వ్యక్తులు. వారి దృష్టిలో పేరును కోల్పో వడమంటే జీవితాన్ని నష్టపోవడమే.

శ్రీరాముడిలా సర్వగుణశోభితులం కాకపోయినా కనీసం మానవత్వ భావానికి చిరునామాగా నిలవాలి. నలుగురి తలలో నాలుకలా మెలగాలి. అవసరం మేరకు లౌక్యం ప్రదర్శించడం తప్పుకాదు కాని, ఎదుటివారిని వంచించే మోసం కూడదు. పెద్దల పట్ల మర్యాద, పిల్లల పట్ల కారుణ్యం చూపాలి. ధర్మవర్తనతో జీవనం సాగించాలి. మనిషి పోయినా కీర్తి నిలిచేది పేరుతోనే. పేరుపట్ల అందుకే అప్రమత్తంగా ఉండాలి. అర్థంపర్థం లేని పేర్లు పెట్టడం వ్యర్థం. వందేళ్ల జీవితాన్ని నిర్వచించే పేరు విషయంలో పెట్టేవారికి ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి. దాన్ని నిలబెట్టుకునే తత్వం పేరును కలిగివున్న వారికి ఉండాలి.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని