కర్మయోగం - జ్ఞానయోగం

పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు.

Published : 30 Apr 2024 00:15 IST

రమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. కొందరు పనిచేయకుండానే ఫలితం మీద ఆశపెట్టుకుంటారు. సత్కర్మను ఆచరిస్తూ, దాని ఫలితాన్ని ఎవరు ఆశించకుండా ఉంటారో వారే కర్మయోగులు. మన పురాణాల్లో జనకచక్రవర్తిని, శిబిచక్రవర్తిని, రంతిదేవుణ్ని కర్మయోగులుగా లెక్కించవచ్చు.

లోకోపకారకమైన పనులు చేస్తూ నూరు సంవత్సరాలు జీవించమని వేదం తెలుపుతుంది. శ్రీకృష్ణుడి నోట వచ్చిన భగవద్గీత కూడా ‘నీవు కర్మకధికారివి మాత్రమే, ఫలానికి కాదు’ అని తెలుపుతుంది (2-47). మనిషి దైనిక జీవనం యావత్తు కర్మలతోనే నిండి ఉంటుంది. పుణ్యం కావాలనుకున్నవారు పుణ్యకర్మలు చేయకతప్పదు. పాపకర్మలు చేసి సుఖాన్ని ఆశించేవాళ్లు కూడా ఉన్నారు. ఐతే మనం చేసే కర్మలు పాపంతో లేదా పుణ్యంతో ఎంతవరకు ముడివడి ఉన్నవో మనకు తెలియక పోవచ్చుగాని, పరమాత్మకు తెలుసు.

కొందరు కర్మఫలాలను ఆశించనప్పుడు కర్మలెందుకు చేయాలి, ఊరకుంటే సరిపోదా అని ప్రశ్నిస్తుంటారు. దీనికి సమాధానం గీతలోనే కనిపిస్తుంది. మనిషి అన్నవాడు ఏ పనీ చేయకుండా ఉండలేడు. కారణమేమిటంటే- ప్రకృతి నుంచి పుట్టిన సత్వం, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలతో మనిషి వివశుడవుతున్నాడు. కనుక పనిచేయడానికి బాధ్యుడవుతున్నాడు. కర్మఫలితాన్ని అనుభవిస్తున్నాడని స్వయంగా కృష్ణుడే చెబుతాడు.

ఉత్తముడైన మానవుడు తన సుఖానికి కారణం పుణ్యమని, దుఃఖానికి కారణం పాపమని తెలుసుకుంటాడు. ఎన్ని జన్మలెత్తినా కర్మఫలం మనిషిని విడిచిపెట్టదని, కర్మఫలం అదృష్టరూపంలో ఉండి మనకు సుఖదుఃఖానుభవం కలిగిస్తుందని గ్రహిస్తాడు.

సుఖ దుఃఖాలిచ్చేవాడు ఒకడున్నాడని, అతడే పరమాత్ముడని తెలిసినప్పుడు, ఫలాన్ని పక్కన పెట్టి సత్కర్మకే ప్రాధాన్యం ఇస్తాడు ఉత్తమ మానవుడు. ఆశ్చర్యమేమంటే- ఒకరి కర్మఫలం మరొకరికి చెందదు. ఎవరి కర్మకు వారే కర్తలు, ఫలానికి భోక్తలు కూడా. పరమాత్మ పాపాలు పోగొట్టేవాడని చాలామంది విశ్వసిస్తారు. కాని వట్టిగా పోగొట్టేవాడు కాడు పరమాత్మ. అతడు కర్మఫలాన్ని అనుభవింపజేసి గాని మన పాపాన్ని పోగొట్టడు. అందుకే యోగులు కర్మఫలాలను అనుభవిస్తూ, కొత్తగా కర్మలు చేస్తూ, వాటి ఫలాలను పరమాత్మకే అర్పిస్తారు. వీరినే నిష్కామ కర్మయోగులని పిలుస్తారు. కర్మయోగమంటే నిష్కామ కర్మయోగమే. జ్ఞానయోగం దీనికంటే భిన్నంగా కనిపించినప్పటికీ, కర్మజ్ఞాన యోగాలు రెండూ అనుసరణీయమైనవే. ఈ విషయాన్ని యజుర్వేదం స్పష్టం చేస్తుంది.

కర్మయోగం మనల్ని మృత్యుముఖం నుంచి తప్పిస్తుంది. జ్ఞానయోగం అమృతత్వం(మోక్షం) ప్రాప్తింపజేస్తుంది. అందుకే పరమాత్మ పట్ల నిష్ఠకలిగినవారు ఫలాపేక్షలేని కర్మలు చేస్తూ, పరమాత్మ స్వరూపం తెలిసి జ్ఞానమార్గంలో పయనిస్తూ, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తారు.

ఆచార్య మసన చెన్నప్ప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని