నమామి నర్మదా

నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం.

Published : 01 May 2024 01:09 IST

నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. వృషభరాశిలోకి బృహస్పతి సంచారంవల్ల నర్మదానదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి.

మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే ఏకైక పుష్కర నది- నర్మద. మే 1 నుంచి 12 వరకు నర్మదానది పుష్కర సౌందర్యంతో విలసిల్లుతుంది. మత్స్య, కూర్మ, స్కాంద పురాణాలతోపాటు హరివంశం, రామాయణం, మహాభారతాల్లో నర్మదానది ప్రస్తావన ఉంది. స్కాంద పురాణంలోని రేవాఖండంలో నర్మదా వైభవం వర్ణితమైంది. భూలోకంలో తీవ్రమైన క్షామ పరిస్థితులు ఏర్పడినప్పుడు, మహర్షుల ప్రార్థన మేరకు, మహాదేవుడు జలరూపుడైన భవుడిగా సాకారమయ్యాడంటారు. ఆ భవుడు రుక్ష పర్వతంపై తాండవం చేసినప్పుడు శివ స్వేదం నుంచి నర్మద ఉత్పన్నమైందంటారు. తరుగుదల లేని జలసిరితో వర్ధిల్లమని నర్మదను ఆదిదేవుడు ఆశీర్వదించాడంటారు. అందుకే నర్మదను శివ పావనిగా జగద్గురు ఆదిశంకరులు నర్మదాష్టకంలో కీర్తించారు. గంగానదికి సాటిరాగల మేటినది అని నర్మదను భక్తతుకారం ప్రస్తుతించారు. కేవలం దర్శన మాత్రం చేతనే నర్మదవల్ల పుణ్యప్రాప్తి చేకూరుతుందని గోస్వామి తులసీదాసు పేర్కొన్నారు. పరమేశ్వరుడి ప్రియ పుత్రికగా నర్మదను శివనందిని అంటారు. మహావేగంగా ప్రవహించడం వల్ల మహతి, శబ్ద సమన్వితంగా ప్రవహిస్తుండటంవల్ల రేవా, నదీ గమనం శోభస్కరంగా ఉంటుంది కాబట్టి విమల, శుభగ, సమస్త సౌఖ్యాల్ని అందిస్తున్నందువల్ల కృపావాహిని, ధీరగంభీరంగా ప్రకటితం కావడంవల్ల మందాకిని- ఇలా ఎన్నో పేర్లతో నర్మదను వ్యవహరిస్తారు. రంజన, అమృత, దశార్ణ, చిత్రోత్పల, శోణ, తమస- ఇలా అనేక పేర్లతో నర్మదను పురాణాలు వర్ణించాయి. తమ పితృ దేవతలకు మోక్ష సిద్ధిని కలిగించడానికి పురూరవ చక్రవర్తి కోరిక మేరకు శంకరుడు, నర్మదను భువికి పంపాడని కథనం. బాణాసురుడు, శివానుగ్రహం కోసం నర్మదానది తీరంలో తపస్సు చేశాడంటారు. ఆ అసురుడి తపస్సుకు మెచ్చి, నర్మదా నదీపరీవాహక ప్రాంతంలో శిలారూపాలుగా వర్ధిల్లమని అతడికి మహేశ్వరుడు వరమిచ్చాడంటారు. ఈ నదీతీరంలో లభించే గుండ్రటి శిలల్ని, బాణుడి పేరిట, నర్మదా బాణశివలింగాలుగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా అనేక శివాలయాల్లో నర్మదా బాణలింగాలే పూజలందుకుంటున్నాయి.

నర్మదా నది పరీవాహక ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో, ఆధ్యాత్మిక కేంద్రాలతో, అనేక ఆలయాలతో తేజరిల్లుతోంది. వింధ్య, సాత్పూరా పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తూ నర్మదా లోయలోకి అడుగిడే ఈ నది, మధ్యభారతానికి వరదాయినిగా వెల్లివిరుస్తోంది. ఈ నదీతీరంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఓంకారేశ్వరంతోపాటు అమరేశ్వరస్వామి సన్నిధి, రాజరాజేశ్వరుడు కొలువైన మహేశ్వర్‌, బేధాఘాట్‌, నరేశ్వర్‌, గరుడేశ్వర్‌ వంటి సన్నిధానాలు నెలకొని ఉన్నాయి. గంగానదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు. నర్మదానదీ తీరంలో ఎందరో తపోసిద్ధి పొందారంటారు. సప్తపుణ్యనదులలో ఒకటైన నర్మదానదీ తీరంలో షట్చక్రవర్తులలో ప్రసిద్ధుడైన మాంధాత, ఆదిశంకరులు వంటివారు తపస్సు చేసి ఈశ్వరకటాక్షాన్ని పొందారని పురాణాలు విశ్లేషించాయి. నర్మదానది భవ్య ఫలదాయిని- దివ్య శుభకారిణి.

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని