గోవిందా... గోవింద!

పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య.

Published : 02 May 2024 01:02 IST

రమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. గోవింద నామం భక్తులకు అత్యంత ముక్తి ప్రదమైనది. నిత్య స్మరణీయమైనది. తనను విశ్వసించినవారికి, పూజించినవారికి అభయమిచ్చేది- గోవింద నామం.

భూమిపై దుర్జనులను శిక్షించి సజ్జనులకు ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడు. ఆయన కనిపించలేదని భగవంతుడు లేడనుకోవడం అజ్ఞానం. ఆయన అనుక్షణం భక్తుల వెన్నంటే ఉంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆర్తిగా పిలిస్తే అభయమిచ్చి ఆదుకుంటాడు. దీనికి ఉదాహరణ- ద్రౌపది, గజేంద్రుడు, కుచేలుడు... ఇంకా ఎందరో. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు.

జీవితం సుఖదుఃఖాల సమ న్వయం. వాటినుంచి కాపాడేది గోవింద నామ స్మరణే అని ఆళ్వారుల  మాట. గోవిందుణ్ని ఆశ్రయించినవారి కామితార్థాలు నెరవేరతాయని, అంతుపట్టని ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆ స్వామిని శరణు వేడాలనీ వైష్ణవ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. మనసును, దృష్టిని స్వామివారిపై లగ్నం చేసి, బుద్ధిని సక్రమ మార్గంలో పెడితే- ఆయన అభయం, అనుగ్రహం పొందగలం. వాటన్నింటికీ దోహదం చేసేది గోవిందుడి నామం.

దైవ గుణాలు కలిగినవారు స్వామివారికి అత్యంత సన్నిహితులవుతారు. భయ రాహిత్యం, అహింస, సత్యం, త్యాగం, భూతదయ, విషయలోలత్వం లేకపోవడం, ఓర్పు, పరోపకారం వంటి ఇరవయ్యారు సద్గుణాలే దైవానికి చేరువ చేస్తాయని, వాటన్నింటినీ సాకారం చేసేది ఒక్క గోవింద నామ స్మరణే అని పురాణాల వల్ల తెలుస్తోంది.

పాపులు, మూఢులు, నరాధములు, మాయా మోహంలో చిక్కుకున్నవారు అసుర స్వభావంతో అంధులైన అవివేకులు ఆ పరాత్పరుడి ఉనికిని సందేహిస్తారు. వారి సందేహాలను నివృత్తి చేసేది గోవిందుడి దివ్య మంగళ స్వరూపమే. ఆ స్వరూపాన్ని  దర్శించినప్పుడు ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా వీక్షించినప్పుడు పరిశీలిస్తే స్వామివారి కన్నులలో మనపై కురిసే అనుగ్రహం కనిపిస్తుంది. ఆయన కుడిచేయి అభయముద్రలో గోచరిస్తుంది. అది దిగువకు చూపిస్తుంది. అంటే తన పాదాలను ఆశ్రయించమని, శరణు వేడమని తెలియజేస్తుంది. సజ్జనుల పాలిట ఆయన అభయప్రదాత. మంగళకరమైన చూపులు కలవాడు ఆ భగవానుడు. తన చల్లని చూపులతో భక్తుల సకల తాపత్రయాలను చల్లార్చి, మనసుకు శాంతిని చేకూర్చుతాడు. ఆ గోవిందుడి మంగళ దృష్టి మాత్రంతోనే సకల పాపాలు నశిస్తాయి. సకల సంశయాలు, సంకటాలు సమసిపోతాయి. మనోల్లాసం, ఆత్మ స్థైర్యం చేకూరతాయి. ఆయన  శుభకరుడు. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఆత్మజ్ఞానం ఆవశ్యకం. దాన్ని కలిగించేది గోవింద నామస్మరణ మాత్రమే.

భగవంతుడు మనిషి అజ్ఞానానికి నవ్వుకునే సందర్భం గురించి రామకృష్ణ పరమహంస తరచూ తన శిష్యులకు ఒక కథ చెబుతుండేవారు. అన్నదమ్ములు భూమిని పంచుకొని ‘ఇదిగో ఈ భాగం నాది, అటువైపు ఉన్నది నీది’ అనుకుంటారు. వారి తండ్రి, తాతలు గతంలో అదే మాట అనుకొని ఉంటారు. వారంతా పోయారు. ఇప్పుడు వీళ్లూ అదే అంటున్నారు. రేపు ఈ సోదరులూ ఉండరు. అయినా, భూమి తమదనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నారని భగవంతుడు నవ్వుకుంటాడట. కానీ, ఒక్క గోవింద నామ స్మరణతోనే ఇలాంటి తాపత్రయాలన్నీ వదిలిపోతాయన్నది పౌరాణికులు చెప్పేమాట.

 వి.ఎస్‌.రాజమౌళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని