పొందిగ్గా విజ్ఞతాయుతంగా...

సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి.

Published : 03 May 2024 01:25 IST

సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. దేని గురించి ఎంత మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడని వారంతా తెలివైనవాళ్లని అనలేం... కానీ, తెలివైనవాళ్లు మాత్రం ఎక్కువ శాతం మితభాషులుగానే ఉంటారు. ఆలోచనలో సమగ్రత ఉన్నప్పుడే మాటల్లో స్పష్టత వినిపిస్తుంది.

ఆలోచన స్థాయిలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆలోచనలు మాటలుగా మారే దశలోనూ మన అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి. చాలామంది తమ మాట మీద తమకు నియంత్రణ ఉందనే భ్రమలో ఉంటారు. వాస్తవానికి చాలాసార్లు మన నోటికి, మాటకు మనపైనే అధికారం ఉంటుంది. ఏమి మాట్లాడబోతున్నామో తెలియక మాట్లాడిన తరవాత నాలుక కరుచుకుంటాం. ఒక్కోసారి మనం అనేసిన మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం అన్నారు రమణ మహర్షి.

విజ్ఞుల దగ్గర చెప్పేందుకు విషయం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. అయితే, మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని కల్పించుకుని మరీ మాట్లాడుతుంటారు. యక్షుడు ధర్మరాజును మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుందని ప్రశ్నించాడు. ‘ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏమి మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో, ఇతరుల పట్ల అలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైతే జాగ్రత్తపడతారో వారికి సజ్జనత్వం సిద్ధిస్తుంది’ అన్నాడు ధర్మరాజు. సమాజంలో మాటకు ఒక విశిష్ట స్థానం ఉంది. సందర్భోచితమైన మాట మాత్రమే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. ఇది ఎంత క్లుప్తంగా అర్థవంతంగా వినసొంపుగా ఉంటే అంత శక్తిమంతమవుతుంది. పరిధి దాటని మాట మానవ సంబంధాలను బలపరిస్తే, పరిధి దాటిన మాటలు క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేస్తాయి.

మనకు అవగాహన లేని అంశాలపై చర్చించకూడదు. స్పందించాల్సిన సందర్భం కాని చోట మేధావి మౌనంగా ఉంటాడు. మనసులో యోచన, మాటలో సూచన క్రియలో దక్షత- ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది. నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది తగుదునమ్మా అంటూ వచ్చి తల దూరుస్తుంటారు. అడగకపోయినా అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ మిడిమిడి జ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు. అధిక ప్రసంగ ధోరణి ఆత్మన్యూనతకు చిహ్నం. అది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ధర్మమార్గం పట్ల గౌరవం, సమయానుకూలంగా సర్దుకుపోయే గుణం, సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగే యుక్తి, సందర్భోచితంగా మాట్లాడే ప్రజ్ఞ ఉన్న వ్యక్తి సర్వకార్యాలను సాధించగలడని ఒక సుభాషితం చెబుతోంది. స్నేహం వైరం నిర్మలత్వం కళంకం పుణ్యం పాపం ఔన్నత్యం నీచత్వం వంటివి మాటలను బట్టే వస్తాయి. సమయానికి తగినట్లు పొందికగా విజ్ఞతగా మాట్లాడాలని సనాతన ధర్మం హితవు పలికింది.

ఎం.వెంకటేశ్వరరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని