వైరాగ్య సుఖం

మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు.

Published : 04 May 2024 00:10 IST

నిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. సుఖదుఃఖాలతో  తాదాత్మ్యం చెందకుండా, జయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా, కలిమి లేములు  మానావమానాలను సమదృష్టితో స్వీకరిస్తూ, బంధువులు మిత్రులు, ఎవరూ ఏవీ శాశ్వతం కాదు అనే అవగాహనతో రాగద్వేష రహిత స్థితిలో మనసును నిలుపుకొనే ఒక సాధన.  ఇది మోక్షసాధన మార్గాల్లో ముఖ్యమైనది. మోక్షమంటే దేహ పతనానంతరం పొందే స్థితి కాదు. జీవించి ఉండగానే అనుభవించవలసిన నిరంతర మహదానంద స్థితి. 

వైరాగ్య సాధన పెరిగే కొద్దీ కోరికలు బలహీనపడతాయి, రాగద్వేషాలు క్రమక్రమంగా మాయమవుతాయి,  మోహం దూరమవుతుంది, భవబంధాలు సడలుతాయి, హృదయం నిర్మలమవుతుంది. అప్పుడే నిజమైన శాంతిసుఖాలు అంతరంగంలో కొలువుతీరుతాయి.  వైరాగ్యభావాలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. కొన్ని తాత్కాలికంగా మనసును స్పృశించి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు- పురాణ వైరాగ్యం అది విన్నంతసేపే. శ్మశాన వైరాగ్యం... అక్కడ ఉన్నంత సేపే. ప్రసూతి వైరాగ్యం బిడ్డను చూసుకునేంతవరకే.

కొందరిని వైరాగ్య భావనలు తీవ్రస్థాయిలో ఆవహించి వారితో సంసారాన్ని త్యజింపజేసి  సత్యశోధనకు పురిగొల్పి ఆత్మజ్ఞానానికి దారి తీయిస్తాయి. అవి కేవలం వారిని తరింపజేయడమే కాక లోకోద్ధరణకూ కారణమవుతాయి. సిద్ధార్థుడు ‘బుద్ధుడు’ అయ్యాడు. ప్రపంచానికి తాను పొందిన జ్ఞానాన్ని పంచాడు. వేమారెడ్డి ‘యోగి వేమన’ అయ్యాడు. మేడిపండు వంటి ప్రపంచపు పొట్ట విప్పి లోక రీతిని బట్టబయలు చేశాడు. నాడు శ్రీరాముడికి కలిగిన వైరాగ్య ఫలితం- వసిష్ఠగీత. అది శ్రీరాముణ్ని మర్యాదా పురుషోత్తముణ్ని చేసింది. అర్జునుడి  వైరాగ్యం శ్రీకృష్ణుడి నోట భగవద్గీతను పలికించి లోకానికి ఉపనిషత్‌ సారాన్ని అందించింది. అర్జునుణ్ని నిష్కామ కర్మయోగిని చేసింది. 

కర్మయోగులకు వైరాగ్యం ముళ్లదారిలో నడిచేవారికి పాదరక్షల వంటిది. జనకుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి వంటి పురాణ పురుషులు  భోగభాగ్యాల మధ్య ఉన్నా, రాజులుగా రాచకార్యాలను నిర్వహిస్తున్నా, సదా వైరాగ్య స్థితిలో ఉండేవారు. వారు అంతరంగంలో అంతటా పరమాత్మను దర్శిస్తూ, విషయ సుఖాలను తృణప్రాయంగా భావించేవారు. అటువంటివారికి వైరాగ్య సుఖం కరతలామలకం. వైరాగ్య స్థితికి వయసుతో వృత్తితో నిమిత్తం లేదు. వయసు ఉడిగినప్పుడు వైరాగ్యం వద్దన్నా వచ్చి పడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆ వైరాగ్యం నిష్ప్రయోజనం. వైరాగ్యమనేది మొదటి నుంచి జీవనశైలి కావాలి. యోగి గాని భోగి గాని, సంసారి కానీ సన్యాసి గానీ వైరాగ్యం లేక నిజమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించలేడు. నిజమైన సుఖం ఆంతరంగిక స్థితిలో ఉంటుంది. బాహ్య ప్రపంచంలో కాదు. అసలైన విరాగి నిరంతరం నిశ్చలానంద స్థితిలో ఉంటారు. అది నిత్య సాధనతోనే సాధ్యం.

కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని