విద్యాదానం

విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది.

Published : 05 May 2024 00:28 IST

విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది.

విద్య నేర్పే పాఠశాల ఏదైనా అది విజ్ఞానాన్ని ప్రసాదించే ఆలయమే. అక్కడ గురువే దైవం. ఆ పాఠశాలలో పేద, గొప్ప భేదాలు ఉండవు. దశరథ కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వసిష్ఠుడి దగ్గర, బలరామకృష్ణులు సాందీపని ముని వద్ద రాజకుమారుల్లా విద్యనభ్యసించలేదు. నిరాడంబరంగా, సామాన్యుల్లాగే చదువుకున్నారు. సామాజిక రాజనీతి విషయంలో శ్రీరామచంద్రుడిని నేటికీ ఆదర్శమూర్తిగా భావించడానికి కారణం- గురువుల దగ్గర ఆయన వినయ విధేయతలతో విద్యనభ్యసించడమే.

శ్రీకృష్ణ కుచేలుర మైత్రి కేవలం గురుకులం వరకే పరిమితం కాలేదు. కృష్ణుడు ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగాక కూడా కుచేలుడిని ఆదరించాడు. అతిథిమర్యాదలతో గౌరవించాడు. ఆ సంస్కారం ఆనాటి విద్యావిధానం నేర్పినదే. విద్య మాత్రమే మనిషికి ఎనలేని కీర్తిని అందిస్తుంది. అష్టావక్రుడికి రాజసన్మానాన్ని అందించినది వారి జ్ఞానమే కాని, ఎనిమిది వంకరలు కలవారి దేహం కాదు. అలాగే జన్మతో నిమిత్తం లేకుండా తాను నేర్చుకున్న ధనుర్విద్యలో చూపించిన ప్రతిభ వల్ల గొప్ప విలుకాడిగా పేరు తెచ్చుకున్నాడు ఏకలవ్యుడు. అందుకే చాణుక్యుడు ‘విద్య గుప్తధనం వంటిది... కామధేనువు లాంటిది. కామధేనువు కోరిన కోరికలు తీర్చినట్లుగా విద్య కూడా సుఖసంతోషాలను ఇస్తుంది’ అని బోధించాడు.

మనిషికి ఎన్ని సిరిసంపదలున్నా విద్య ఉండి తీరాలి. లేకపోతే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఉండదు. అందుకే బాల్యం నుంచే ప్రతీ ఒక్కరూ విద్య మీద శ్రద్ధ చూపించాలి. అక్కడ అలక్ష్యంగా ఉంటే భవిష్యత్తు మొత్తం అంధకారమవుతుంది. విద్యతో సమానమైన బంధువు ఉండరని హితోపదేశం వివరించింది.

విద్య మానవత్వాన్ని ధార్మికతను పెంచుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించుకునే తెలివి విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. విశిష్టమైన తేజస్సును ప్రసాదించి దేశాంతరాలలో బంధువులా ఆదుకునే విద్య దైవ సమానమైనది. మనిషిలోని ప్రజ్ఞను విస్తరింపజేసి మానసిక వికాసానికి దోహదం చేసే విద్య ఎంతమందికి పంచినా పెరుగుతుందే తప్ప తరగదు.
చంద్రుడు రాత్రిని వెలుగుతో నింపినట్లుగా విద్యావంతుడు, సజ్జనుడు అయిన వ్యక్తి కుటుంబంలో కనీసం ఒక్కరున్నా చాలు. అతడి విజ్ఞానకాంతులు ముందుతరాలకు వెలుగుబాటను చూపుతాయి. ప్రతి మనిషీ తన కుటుంబానికి ఆధారంగా, ఊరికి ఉపకారిగా, దేశానికి సేవకుడిగా జీవించాలంటే అతడు విద్యాధికుడై ఉండాలి.

అన్నదానం అన్నింటికన్నా గొప్పదే. కానీ, అంతకన్నా గొప్పది విద్యాదానం. విద్యను శ్రద్ధాభక్తులతో నేర్చుకున్న మనిషి శాశ్వతమైన ప్రయోజనం పొందగలడు. అందుకే తానునేర్చిన విద్యను పదుగురికీ పంచడానికి మనిషి ప్రయత్నించాలి. ఆ విధంగా సమస్త మానవాళికీ మేలు చేసేందుకు ఎవరికి వారు కృషి చేయాలి.

విశ్వనాథ రమ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని