ధర్మ స్వరూపం

ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి...

Published : 06 May 2024 01:26 IST

పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి.

ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో  వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి. వ్యర్థ పదార్థాలను సముద్రం తనలో ఉండనీయదు. వాటిని ఒడ్డుకు విసిరేస్తుంటుంది. ధర్మం కూడా అంతే... తనలో దుర్గుణాలను ఉంచుకోదు.

అనంతామాత్యుడి భోజరాజీయంలోని ఆవు-పులి ఘట్టం ధర్మనిరతికి గొప్ప నిదర్శనం. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని ఆవు పులిని వేడుకుంటుంది. ఇచ్చిన  మాట ప్రకారం ఆవు తిరిగి పులి వద్దకు వస్తుంది. ఆడిన మాట తప్పకుండా ఆవు తన ధర్మాన్ని తాను పాటించింది.  పులి క్రూర జంతువు. అది ఆవును చంపి తినేయవచ్చు. కానీ పులి ఆవును తినకుండా వదిలిపెట్టింది.  క్రూర జంతువై ఉండీ పులి గొప్ప ధర్మాన్ని పాటించింది.

శిబి చక్రవర్తి కథ గొప్ప ధర్మాన్ని ఉపదేశిస్తుంది. ఆకలితో అలమటించిన డేగ తనకు కనిపించిన పావురాన్ని తన ఆహారంగా భావించింది. అది గమనించిన పావురం తన ప్రాణాలను కాపాడుకోవడానికి శిబి చక్రవర్తిని ఆశ్రయించింది.  చక్రవర్తి పావురం ప్రాణాలకు అభయమిచ్చాడు.  డేగ తన ఆహారాన్ని అడ్డుకోవడం  పాడి కాదని రాజుతో వాదించింది.  దానితో  శిబి చక్రవర్తి తన దేహంలోని మాంసాన్ని కోసి డేగ ఆకలి తీర్చాడు. పావురం తన ప్రాణాలను కాపాడుకోవడం తన ధర్మం. తన ఆహారాన్ని తాను సంపాదించుకోవడం డేగ ధర్మం. తన రాజ్యంలోని ఏ ప్రాణికి ఆపద కలిగినా రక్షించడం రాజు ధర్మం. ఈ కథలోని ముగ్గురూ ఎవరి ధర్మాన్ని వారు పాటించారు. లోకంలో శిబిచక్రవర్తి గొప్ప త్యాగశీలిగా  నిలిచిపోయాడు. పక్షపాతరహితమైన ఆలోచన ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాన్ని చూపిస్తుంది.

సమాజంలో గృహస్థుడు, ఉద్యోగి, వ్యాపారి... ఇలా అనేక వృత్తులవారు ఉంటారు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే లోకంలో శాంతి సౌఖ్యాలకు లోటు ఉండదు. ఇంటికొచ్చిన భిక్షగాడికి పది రూపాయలు ఇవ్వడం, అమ్మా  ఆకలి అన్నవాళ్లకు పట్టెడన్నం పెట్టడం, కలిగింది  దానం చేయడం- ఇది మాత్రమే ధర్మం కాదు.

నైతిక  ఆలోచనలు ధర్మబద్ధ జీవన విధానానికి ప్రథమ సోపానం.  పరధనాన్ని ఆశించకూడదు. అనాయాసంగా ఎటువంటి సంపదను కోరుకోకూడదు. ఆహారమైనా,  విహారమైనా  స్వార్జనతోనే అనుభవించాలి. మన ధనం, మన ఆస్తి మనకు ఎంత విలువైనవో ఎదుటి వారికి వారి సంపదలు అంతే విలువైనవి. అటువంటి వాటిని ఆశించకూడదు.

పరనింద మంచిది కాదు. పౌరులు ఎటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలని మనం కోరుకుంటామో మనమూ అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి.  ఎవరైనా మనల్ని దూషిస్తే మనం ఎంత బాధపడతామో ఎదుటివారు కూడా అంతే కదా.

ఉత్తమమైన ఆలోచనలతో ధార్మిక భావనలు పెంపొందుతాయి. కేవలం ఆలోచనలతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఆచరణలేని ఆలోచనలు అవి ఎంతటి ఉత్తమమైనవి అయినా నిరుపయోగమే. సదాలోచనలను కలిగి ఉండి, వాటిని ఆచరించి చూపాలి. భౌతిక  సాధనతోనే ధర్మ స్వరూపం భూమ్మీద వర్ధిల్లుతుంది.

డాక్టర్‌ బండి సత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని