శాంతి సౌభాగ్యాలు

కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు.

Published : 08 May 2024 00:37 IST

ష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. తన శాంతమే తనకు రక్ష అంటుంది సుమతీ శతకం. అంతులేని కోరికలతో అశాంతిని సృష్టించుకుంటాం. పేదవాడు ధనవంతుడు కావాలని తపన పడుతుంటాడు. ధనవంతుడు మరింత ధనం సంపాదించాలని శ్రమిస్తుంటాడు. కోటీశ్వరుడు పదవి కోసం పాకులాడుతుంటాడు. పంచేంద్రియాలు పనిచేస్తున్నంత కాలం మనిషిని అసంతృప్తి పీడిస్తుంటుంది. ఉన్నదానితో సంతృప్తి చెందక మరేదో కావాలని మనసు మారాం చేస్తుంటుంది. కోరికలు తీరనప్పుడు కోపం ప్రజ్వరిల్లుతుంది. అశాంతితో మనసు బరువెక్కుతుంది. అశాంతి అధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. కానిపనులు చేయిస్తుంది. మనిషిని పతనావస్థకు చేరుస్తుంది.

సత్వగుణ సంపన్నులకు శాంతమే భూషణమవుతుంది. భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు, విషాదకర వార్త విన్నప్పుడు మనిషి వేదనాభరితుడవుతాడు. బంధుమిత్రుల ఓదార్పు మాటలతో మనసు శాంతిస్తుంది.

చెడు ఆలోచనలను తొలగించి దుఃఖ కారణమైన పనులను నివారించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సదా సద్భావనలతో నిండిన మనసులో అశాంతికి తావుండదు. సమస్త ప్రాణులనూ ప్రేమించగలవారు మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు.

ఆకాశం, భూమి, అంతరిక్షం, ప్రవహించే నదులు, చెట్లు ప్రశాంతంగా ఉండి మనకు ప్రశాంతత నిచ్చు గాక... నిత్యం నాలుకపై ఉండే వాగ్దేవి ప్రశాంతంగా ఉండు గాక... పంచేంద్రియాలు ప్రశాంతంగా ఉండు గాక అన్నది శాంతి మంత్రం. మానసిక శారీరక ఒత్తిడులను తగ్గించుకుని ప్రశాంత జీవితం గడపాలని వేద ఉద్బోధ.

ధర్మరాజు రాజసూయ యాగం అత్యంత వైభవంగా పూర్తి చేయడం చూసి మయసభలో పరాభావం పొందిన దుర్యోధనుడి మనసులో అసూయ ప్రజ్వరిల్లింది. ఆ సమయంలో రారాజు మనసులో రేగిన అసూయ, క్రోధం కౌరవ వంశ వినాశనానికి దారితీశాయి. కామ క్రోధాలు, లోభమోహాలు, ఈర్ష్యాసూయలతో నిండిన చిత్తం అశాంతితో రగులుతూ ఉంటుంది.

హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వంవల్ల అతని మనసులో రోషం అనే అగ్ని భగభగ మండింది. తామస గుణం విజృంభించింది. హిరణ్యకశిపుడు ద్వేషించిన శ్రీహరే నరసింహస్వామిగా అవతరించి రాక్షసుణ్ని అంతమొందించాడు. క్రోధాన్ని శాంతంతో జయించాలని, శాంతి రూపమైన ఖడ్గం చేతిలో ఉన్నవాడిని దుష్టులు కూడా ఏమీ చేయజాలరని మహాభారతం చెబుతోంది.

ప్రశాంతనిలయమైన ఆలయంలో భగవంతుణ్ని స్మరిస్తున్నప్పుడు మనసులో ఆందోళన మాయమవుతుంది. భక్తిరస ప్రధానమైన గ్రంథ పఠనంతో మనిషి ప్రశాంత చిత్తుడవుతాడు. మనోహరమైన వనాలలో విహరిస్తున్నప్పుడు మనసు ఉత్సాహభరితమవుతుంది. ఆహ్లాద భరితమైన సుస్వర సంగీతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనిషి ఆనందంతో పరవశిస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆత్మీయులను ప్రేమగా ఆదరించడం, దాన ధర్మాల వంటి సత్కర్మలవల్ల అపూర్వ శాంతి లభిస్తుంది. పరమేశ్వరుణ్ని శరణు జొచ్చినవారు ఆయన కృపతో పరమ శాంతిని, శాశ్వతమైన పరమపదాన్ని పొందగలరని భగవంతుడి గీతాబోధ.

ఇంద్రగంటి నరసింహ మూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని