లోకులు పలు కాకులు

ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం.

Published : 09 May 2024 02:06 IST

నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. మనిషిని మార్చగలిగేది ఒక్క అనుభవం మాత్రమే.

మనుషుల స్వభావాలు విభిన్న రీతుల్లో ఉంటాయి. మాటలూ అంతే. ‘అదిగో పులి’ అంటే ‘ఇదిగో తోక’ అనేవాళ్లూ ఉంటారు. ఓ మాట అన్నాము అంటే దాన్ని చిలవలు పలవలు చేసి, కథలల్లేసి అవతలవాళ్ల చెవిని వేసేదాక నిద్రపోలేని వాళ్లుంటారు. ‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్న సత్యం ఎరిగి కూడా ఇతరుల తప్పులను వెతికి చూపించడమే వృత్తిగా, ప్రవృత్తిగా వ్యవహరించే వాళ్లుంటారు.

అతిగా చనువిచ్చినా, అతిగా స్నేహం చేసిన మనసులో ఉన్నవన్నీ చెప్పేసినా ప్రమాదాలు ఎదుర్కోవలసివస్తుంది. తప్పటడుగులు వేస్తూ దుర్మార్గదిశలోకి వెళ్లే మిత్రుణ్ని హెచ్చరించి దారిలో పెట్టగలిగేవాళ్లే నిజమైన స్నేహితులు. మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే వంద చేతులకన్నా మన కన్నీటిని తుడిచేవాడే అసలైన ఆప్తుడు, స్నేహితుడు. పదిమంది ఎటువైపు వెళ్తూంటే అటే వెళ్లడం విజ్ఞత అనిపించుకోదు. ఆదారి మంచిదా, కాదా అని మనకు మనంగా అంతర విశ్లేషణ చేసుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. గౌరవమంటే పదవిని చూసి మర్యాద చేయడం కాదు. వ్యక్తిత్వాన్ని చూసి తలవంచి నమస్కరించడం ముఖ్యం. కొందరి సలహాలను నమ్మి, ఆచరించి నష్టపోతాం. నష్టం జరిగాక కొందరు సలహాలిస్తూంటారు. ప్రబోధిస్తూంటారు.

జూదంలో ఓడినవాడు, ఆ వ్యసనానికి బానిసై ఈ సారైనా ఫలితం దక్కవచ్చుననే ఆశతో చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూంటాడు. ధర్మరాజు జూదం ఫలితమే కదా పాండవులందరినీ ద్రౌపదితో పాటు అడవుల పాలుచేసింది! కైక మనసును మార్చడానికి మంథర ఎన్నిమాటలు చెప్పింది! ఎంతగా నూరిపోసింది. స్థితప్రజ్ఞులైనవాళ్లు, దూరాలోచన కలవాళ్లు కైకలా మారిపోతారా? కార్యకారణ సంబంధాలు మనుషుల్ని అలా మార్చేస్తుంటాయి. ధృతరాష్ట్రుడు మనసు చికాకుగా ఉన్నప్పుడల్లా విదురుణ్ని పిలిచి ‘మనసు అల్లకల్లోలంగా ఉంది విదురా! నాలుగు మంచిమాటలు చెప్పు’ అంటాడు. విదురుడొచ్చి ‘నీ కొడుక్కు చెప్పు. అతడు చేస్తున్న పని మంచిది కాదు. పాండవులతో కయ్యం మంచిది కాదు’ అని హితవు చెబుతూనే ఉంటాడు. పుత్రవ్యామోహితుడైన ధృతరాష్ట్రుడి చెవికామాటలు ఎక్కవు.

ఆప్తులు, ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు ఏం చెబుతున్నా అందులో నిజమెంత, విశ్వసనీయత ఎంత, ఇది హానికరమా, ప్రయోజనకరమా అనేది విశ్లేషించుకోవాలి. అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నమ్మదగినది ఏది, నమ్మదగనిది ఏది అనేది పదేపదే ఆలోచించుకోవాలి. వివేకం, విజ్ఞత సాధించాలంటే, మహనీయుల చరిత్రలు తెలుసుకోవాలి, అవధూతల ప్రవచనాలు వినాలి. మహానుభావుల అనుభవాలు గ్రహించాలి. మన మాట, నడక, నడత, వింటున్నవాళ్లు, చూస్తున్నవాళ్లు వాళ్లకిష్టమైన వ్యాఖ్యానాలు చేస్తూంటారు. అవన్నీ పట్టించుకుంటే ఒక్క అడుగైనా ముందుకు వేయలేం. మన ఆశయం, కర్తవ్యం ఇవే మనకు ఉచ్ఛ్వాసనిశ్వాసాలు.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని