పరమ పూజ్యులు ఆచార్యులు

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు.

Published : 12 May 2024 00:23 IST

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాక, ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో ఆదిశంకరుని ఆవిర్భావం, ఆవిష్కారం అద్భుతాంశాలు. కేరళలోని కాలడిలో జన్మించి చిన్న వయసులోనే అపార జ్ఞాన సంపదతో, దేశమంతా ముమ్మార్లు పర్యటించిన ఆ మహానీయుడు గొప్ప వాఙ్మయాన్ని అందించడమే కాక, తాత్త్విక జగతిలో సుస్థిరమైన స్థానాన్ని అలంకరించారు. దేశం నలుదిశలా పీఠ ప్రతిష్ఠాపన చేసి ధర్మానికి పటిష్ఠ వ్యవస్థ ఏర్పరచారు. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు సరళ సుందర గంభీర భాష్యాలను రచించి; వేదాంత విద్యను అనేక గ్రంథాలుగా రమణీయంగా ప్రకరణ సాహిత్యరూపంగా వెలువరించారు. జ్ఞానభక్తి ఉట్టిపడేలా మధురమైన స్తోత్ర సాహితిని అందించారు.

ఆనాటి భారతదేశంలో సనాతన ధర్మంలోని అనైక్యతను తొలగించి, సమైక్యపరచిన చైతన్య స్వరూపులు, జగద్గురువులై పూజ్యులయ్యారు. ఒకే పరమేశ్వరుని వారివారి పద్ధతుల్లో విభిన్న రూపాల్లో ఉపాసిస్తున్నారే గానీ, అంతా ఒకే పరమాత్మను ఆరాధిస్తున్నారని సమన్వయపరచి ‘షణ్మత ప్రతిష్ఠాపనాచార్య’గా ప్రసిద్ధులయ్యారు. వారు కేవలం వేదాంత మత స్థాపకులుగానే కాక, ‘సమగ్ర వేద ధర్మ ప్రతిష్ఠాపకులు’ అని చెప్పడం సమంజసం.

వారి తరవాత కొన్ని వందల ఏళ్లకు ఉద్భవించిన మరో ధార్మిక భక్తమూర్తి శ్రీ రామానుజాచార్యులవారు. ఆదిశంకరులు జన్మించిన వైశాఖ శుద్ధ పంచమి తిథియే వీరి జయంతి కావడం ‘కాకతాళీయం’ అనకుండా ‘దైవికం’ అనాలి. వీరు వేద ప్రతిపాద్యమైన ఉపాసననీ భక్తినీ పదిలపరచి నాటి సమాజంలో గొప్ప చైతన్యాన్ని ప్రసరింపజేశారు. సిద్ధాంతరీత్యా శ్రీశంకరులది అద్వైతమని, శ్రీరామానుజులవారిది విశిష్టాద్వైతమని ప్రసిద్ధి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు- ఈ మూడింటి మధ్య భేదం లేదని, ‘మాయ’ వల్ల భేదం కనిపిస్తోందని, వేదాంత విచారణ వల్ల, జీవేశ్వరుల రూపంలో ఉన్నది ఒకే ‘పరమాత్మ’ అనే సత్యం తెలుస్తుందని శంకరుల ప్రతిపాదన. ఇది అభేదవాదం. 

జీవుడు, జగత్తు ఈశ్వరుడికి అధీనాలనీ, ఈశ్వర శరణాగతితో జీవుడు పరమాత్మను పొందుతాడని, ఆ పరమాత్మ వైకుంఠవాసి అయిన నారాయణుడని శ్రీరామానుజమతం. చేతనుడైన జీవుడు(చిత్‌), అచేతనమైన ప్రకృతి(అచిత్‌) ఈ రెండూ ఈశ్వరుడి నియంత్రణలోనివి. పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడు- జీవులు పరతంత్రులు... అని విశిష్టాద్వైత సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు.

ఉత్కృష్టమైన తత్త్వ చింతనను, ధార్మిక ప్రవృత్తిని, భక్తిని, సదాచారాన్ని, సద్గుణాల అవసరాన్నీ మానవాళికి బోధించిన ఈ ఆచార్యుల ప్రభావం సనాతన ధర్మంలో బలంగా ఉంది. సిద్ధాంతపరంగా సూక్ష్మమైన కొన్ని భేదాలు మినహాయిస్తే ఈ ఇరువురు మహాశయుల ద్వారా ధర్మ-భక్తి-జ్ఞాన మార్గాలు ఎంతో పరిపుష్టిని చెందాయి. ఆ ఆచార్యుల స్ఫూర్తితో మనలో దివ్యత్వాన్ని జాగృతపరచుకొని ధన్యులం కావాలి.

సామవేదం షణ్ముఖశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని