రాకపోకలు

జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం.

Published : 17 May 2024 00:52 IST

జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అనీ, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అనీ అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. గంటలలో ముగిసే ప్రయాణాలు, ఒకటి రెండు రోజులు సాగే ప్రయాణాలే సాధారణంగా కనపడుతుంటాయి.

మానవ జీవిత ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది. ‘శతమానం భవతి’ అన్నట్లుగా నూరేళ్లు సాగే ఈ ప్రయాణం తల్లి గర్భంలో ప్రవేశించడంతో ప్రారంభం అవుతుంది. అంటే తల్లి గర్భమే మానవ జీవితానికి ప్రవేశద్వారం. తల్లి గర్భం నుంచి నేల తల్లి ఒడిలో పవళించే రోజు మనిషి పుట్టిన రోజు. తల్లి కడుపులో ఉన్నంతకాలం అవ్యక్తంగా ఉన్న జీవితం పుట్టిన తరవాత క్రమంగా వ్యక్త ప్రపంచంలోకి చేరుకొని, వివిధ దశలుగా ఎదుగుతుంది. తొలుత పసిగుడ్డుగా కనిపించిన మనిషి శరీర సంవర్ధనంతో పెరిగి పెద్దవాడవుతాడు. ‘ఆ పసికందేనా ఇతడు?’ అని ఆశ్చర్యపడేంతగా స్వరూప, స్వభావాలు మారిపోతాయి. బాల, కౌమార, యౌవన, వార్ధక్యాలు కాలానుగుణంగా మారిపోతూ, జీవితం పరిణామశీలం అనే సత్యం స్పష్టమవుతుంది. కాలానుగుణంగా ఒక్కొక్క దశను దాటుకొంటూ, జీవితం చరమాంకంలోకి ప్రవేశించి, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది.

పుట్టకముందు మానవుడి ఉనికి ఏమిటో తెలియదు. మరణానంతరం ఏమవుతుందో అర్థంకాదు. కనుక బతికినకాలమే మనిషికి ప్రత్యక్షానుభవాన్ని అందజేస్తుంది. అందుకే తత్త్వవేత్తలు గతం మృతం అని, భవిష్యత్తు అనూహ్యం అని, వర్తమానమే సత్యమని అంటారు.

మనిషి ఇలా భూమిపైకి రావడం ఎందుకు, తిరిగి పోవడం ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తుంది. పురాణేతిహాసాల కథనం ప్రకారం ప్రతి మనిషి పుట్టుక వెనక ఏదో ఒక పరమార్థం ఉండి తీరుతుందని, అది మనిషిని పుట్టించిన బ్రహ్మదేవుడికే తెలుస్తుందని అంటారు. సకల ప్రాణుల సృష్టికర్త బ్రహ్మదేవుడే కనుక, ఆయన ప్రతి ప్రాణినీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి సృష్టిస్తాడని అంటారు. ప్రాణులను సృష్టించడం వరకే బ్రహ్మదేవుడి కర్తవ్యం. ఆ తరవాత ఆయా ప్రాణులు తమ తమ ప్రవర్తనల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకొంటాయని, వాటి మంచి చెడులకు బ్రహ్మదేవుడు బాధ్యుడు కాడని వేదాంతుల మాట. పుట్టిన ప్రతి ప్రాణికీ ప్రపంచంలో బతకడానికి అన్ని వనరులూ సహజంగానే పుష్కలంగా ఉన్నాయి. వాటిని ఎంత వరకు వినియోగించుకోవాలో, వాటిని కలుషితం చేయకుండా ఎలా కాపాడుకోవాలో, తెలుసుకోవలసిన బాధ్యత మనుషులదే. ఈ ప్రపంచం అంతా భగవంతుడి సంపద. దాన్ని అవసరమైనంత వరకే వాడుకొని, మిగిలిన సంపదను ఇతర ప్రాణుల కోసం వదిలేయాలని ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. కానీ మనిషి ఈ ఉపదేశాన్ని పెడచెవిన పెట్టి దుర్వినియోగం చేస్తూ, తానూ భ్రష్టుడై, ఇతరులకు కష్టనష్టాలను కలిగిస్తూ పాపాలను మూటగట్టుకుంటున్నాడు.

చివరికి నూరేళ్ల దాకా బతికినా, ఏదో ఒక రోజు మృత్యువు నుంచి పిలుపు వస్తుంది. మృత్యువుకు కనికరం ఉండదు. ఏ పక్షపాతమూ ఉండదు. కాలం మూడిన వెంటనే తన పని తాను చేసుకొని పోతుంది. మనిషి జీవితంలో పుట్టుక ఎంత సహజమో, మరణం కూడా అంతే సహజం. ‘మరణం అనేది మనిషికి సహజమైన విషయం. మనిషి సుదీర్ఘకాలం బతికి ఉన్నాడంటేనే ఆశ్చర్యంకానీ, మరణించాడనేది ఆశ్చర్యం కాదు’ అని కాళిదాస మహాకవి రఘువంశంలో అంటాడు.

‘రాకపోకలు’ అనే మాట ప్రయాణాల విషయంలో ఎంత సహజమో, మానవ జీవిత ప్రయాణాల విషయంలోనూ అంతే సహజం. మనిషి తాను ఈ భూమిపైకి ఎందుకు వచ్చానని ఆత్మావలోకనం చేసుకోవాలి. అమూల్యమైన మానవ జన్మను అర్ధాంతరంగా ముగించకుండా, జీవిత సాఫల్యం కోసం కడదాకా ప్రయత్నించాలి. అప్పుడే మనిషి రాకపోకలకు అర్థం ఉంటుది.

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని