పోగొట్టుకున్న చోటే...

ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు.

Published : 18 May 2024 00:30 IST

క వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి- ‘తాతా, ఏం వెతుకుతున్నావు?’ అని అడిగాడు. ‘బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది... ఎంత వెతికినా దొరకడం లేదు’ అన్నాడు. కొద్దిసేపు యువకుడు కూడా వెతికాడు కానీ కనిపించలేదు. ‘తాతా ఎక్కడ పడింది?’ అని మళ్ళీ అడిగాడు. దూరంగా చేయి చూపిస్తూ- ‘అదిగో అక్కడ పడిపోయింది’ అన్నాడు. ‘అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా’ అన్నాడు. ‘అక్కడ అంతా చీకటి... ఇక్కడ వీధి దీపం వెలుగు ఉంది... అందుకే ఇక్కడ వెతుకుతున్నా’ అన్నాడు వృద్ధుడు. ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు కాని, చాలామందికి ఏదో సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్న సంతోషాలను మరెక్కడో వెతుక్కుంటారు.
మనిషి ఆశాజీవి. మంచి భవిష్యత్తుకోసం ఎన్నో కలలు కనడం సహజం. కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కొక్కసారి ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. ఇతరులు స్వయంకృతమని నిందిస్తారు. తల్లిదండ్రులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఆందోళన, మానసిక ఒత్తిడి ఎక్కువై మనిషి తీవ్ర నిరాశకు లోనవుతాడు. తమ బాధ్యత మరిచిపోయి పెడదారులు పడతారు. తాము పోగొట్టుకున్న లోటు తోటివారికి తెలియకుండా ధైర్యం వహించి, ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి, తిరిగి శాంతిని పొందేవారు ధీరులని భర్తృహరి సుభాషితం చెబుతుంది. ఏది కోల్పోతారో అదే పొందలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యామ్నాయాన్ని సాధించవచ్చు. మనం పోగొట్టుకున్న శాంతి ఇతరులకు శాపం కాకూడదు. పోగొట్టుకున్న చోటే ఆనందం తిరిగి ఆవిర్భవించేలా ప్రయత్నం సాగించాలి.

కురుక్షేత్ర సంగ్రామం రెండు కుటుంబాల మధ్య రాజ్యం కోసం జరిగింది. హస్తినాపురం రాజధానిగా రాజ్యాన్ని కురువంశీయులు పాలించారు. అది కురురాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అన్నివిధాలా అర్హుడైన పాండురాజు చక్రవర్తి అయ్యాడు. దిగ్విజయంగా రాజ్యాన్ని సుసంపన్నం గావించాడు. శాపవశాత్తు రాజ్యాన్ని వదలి ఆశ్రమవాసం చేయడంతో ధృతరాష్ట్రుణ్ని రాజును చేశారు. అహంకారంతో దుర్యోధనుడు, పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బిగపట్టారు.

అర్జునుడు రాజసూయ యాగం నిర్వహణ ధనం కోసం మాత్రమే ఇతర రాజుల మీద దండయాత్ర చేశాడు. ఎవరి రాజ్యాన్నీ ఆక్రమించలేదు. తమ రాజ్యాన్ని కౌరవులు మాయా జూదంలో గెలిచారు. గడువు తీరిన వెంటనే పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని కోరారు. అహంకారంతో అంగీకరించని కారణంగా కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. తాము వంచనకు గురై  పోగొట్టుకున్న కురురాజ్యం కోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు. ఎక్కడ, ఏది తాము కోల్పోయారో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చారు. తాము అవమానం పొందినచోటే సత్కారం పొందారు.

శిశిరంలో ఆకులు రాలినప్పుడు  చెట్టు మోడులా మారుతుంది. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపజేస్తుంది. ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తన మోడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది. జీవిత గమనం కూడా పాతను పోగొట్టుకుంటూ, కొత్తవి సంతరించుకుంటూ సాగుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. జారిన ఆనందాన్ని తిరిగి ఒడిసిపట్టి జీవనం గడపడమే సమగ్రమైన జీవితం.

 రావులపాటి వెంకట రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు