సత్యదేవ వైభవం

సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువైన అరుదైన క్షేత్రం- అన్నవరం. త్రిమూర్తుల ఏకీకృత మూర్తిమత్వంతో అన్నవరం సత్యనారాయణస్వామి అలరారుతున్నాడు.

Published : 19 May 2024 00:40 IST

సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లోగిలిలో కొలువైన అరుదైన క్షేత్రం- అన్నవరం. త్రిమూర్తుల ఏకీకృత మూర్తిమత్వంతో అన్నవరం సత్యనారాయణస్వామి అలరారుతున్నాడు. తెలుగునాట వ్రతాధిష్ఠాన దైవంగా సత్యదేవుణ్ని ఆరాధిస్తారు. సత్య శివ సుందర స్వరూపుడైన పరమాత్మ దశావతారాలకు అతీతంగా, లోకోద్ధరణే లక్ష్యంగా ఎన్నో రూపాల్ని ధరించాడు. ఆ పరంపరలోనిదే సత్యనారాయణ ఆకృతి. హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై అనంతలక్ష్మి సత్యవతి రమాదేవి సమేతుడై పంపానదీ తీరాన రత్నగిరిపై సత్యదేవుడు విరాజిల్లుతున్నాడు. అన్న వరం సన్నిధి- అనంతవరాల పెన్నిధిగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు స్మార్తఆగమ విధానపూర్వకంగా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు సత్యదేవ కల్యాణం వైభవంగా జరుగుతుంది.

భూలోకంలో నారాయణ తత్వాన్ని వ్యాప్తి చేయడానికి విచ్చేసిన నారదుడు, రత్నగిరిపై నారాయణ మహామంత్రాన్ని జపించి, తన తపోశక్తిని ఈ గిరిపై నిక్షిప్తం చేశాడంటారు. సత్యధర్మాలకు అధినాయకుడైన సత్యనారాయణుడు రత్నాచలంపై అవతరించాలని నారదుడు సంకల్పించాడంటారు. నారదుడి అభీష్టం మేరకు బ్రహ్మమహేశ్వరుల శక్తియుక్తులతో శ్రీహరి సత్యనారాయణమూర్తిగా రత్నాద్రిపై ఆవిష్కారమయ్యాడని చెబుతారు. ధర్మయుతమైన ఎలాంటి మనోభీష్టమైనా స్వామి కరుణవల్ల సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి ‘అనన్య’వరం అనే పేరు ఏర్పడింది. కాలక్రమంలో ఆ పేరు అన్నవరంగా స్థిరపడిందంటారు. నవవిధ గాయత్రీ మంత్రాలతో, అష్టాక్షరీ మంత్రంతో, 24 వృత్తాలతో ఉన్న శ్రీ మహానారాయణ యంత్రంపై సత్యనారాయణుడి విగ్రహాకృతి నెలకొని ఉంటుంది. స్వామికి కుడివైపున మహేశుడు, ఆలయానికి దిగువన యంత్రరూపంలో బ్రహ్మ వర్ధిల్లుతున్నారు. గర్భాలయంలో పదమూడు అడుగుల విగ్రహంగా సత్యదేవుడి మూలవిరాట్‌ గోచరమవుతుంది. గర్భాలయాన్ని మహా మంత్రాలయంగాను, దిగువన ఉన్న ఆలయాన్ని మహా యంత్రాలయంగా పేర్కొంటారు. మంత్ర, యంత్ర, తంత్ర సమన్వితమైన ఈ ఆలయం మహిమాలయంగా ఖ్యాతిగాంచింది.

విష్ణు పంచాయతన క్షేత్రంగానూ అన్నవరం విలసిల్లుతోంది. ఆదిత్యుడు, గణపతి, అంబిక, ఈశ్వరుడు, వీరి మధ్యలో విష్ణురూపంలో సత్యనారాయణుడు దర్శనీయమవుతున్నాడు. సత్యదేవ వ్రతం సకల దేవతారాధన సమన్వితం! ఈ వ్రతంలో భాగంగా అధిదేవతలు ప్రత్యధిదేవతలతో పాటు, పంచలోక పాలకుల్ని, నవగ్రహాల్ని, అష్టదిక్పాలకుల్ని ఆహ్వానించి, మంటపారాధన నిర్వహిస్తారు. సమస్త దేవతా శక్తుల్ని ఆహ్వానించి, ఆరాధించే అపురూప వత్రంగా సత్యవ్రతాన్ని భావిస్తారు. అయిదు అధ్యాయాలుగా ఉండే ఈ వ్రత కథా సమాహారానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ఈ కథలన్నీ జీవన గమనానికి కావాల్సిన నైతిక బలాన్ని అందిస్తాయి. దైవశక్తి పట్ల విశ్వాసాన్ని కలిగి, చిత్తశుద్ధితో క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని కొనసాగించేవారికి విజయం సిద్ధిస్తుందనే అంశాన్ని ఈ కథలు ప్రతిఫలిస్తాయి. సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ‘మహిమా సుపాద’గా వ్యవహరిస్తారు. సత్య, సత్వ సమష్టి రూపధారి- అన్నవరం సత్యనారాయణ స్వామి. కలియుగంలో సత్యసంధతకు పట్టం కట్టడానికి, శ్రీహరి ‘సత్య’నారాయణుడై తేజరిల్లిన భవ్య సన్నిధానం అన్నవరం దివ్యక్షేత్రం!

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని