విభూతి ధారణ

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి. ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే. ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని.

Published : 20 May 2024 00:18 IST

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి. ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే. ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని. ఈ లోకంలో అనుభవానికి వచ్చే సంపదలను ‘భూతి’ అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ఆలోచనలను ‘విభూతి’ అని అంటారు. ఈ రెండు రకాల ఐశ్వర్యాలనూ ప్రసాదించేది భస్మ రూపంలో ఉండే విభూతి ధారణ.

విభూతి ధారణ అపమృత్యు భయాన్ని తొలగించి శుభాలు కలగజేస్తుందని, సకల సంపత్కరమైనదని ఒక శ్లోకంలో చెప్పారు పౌరాణికులు. వేదాలు, పురాణాలు విభూతి ధారణ మహిమను ముక్త కంఠంతో చాటుతున్నాయి.

వాటి కథనం ప్రకారం- భస్మ ధారణ చేసినవారికి దుష్ట గ్రహాలు, పిశాచ పీడలు, రోగాలు, పాపాలు దరిచేరవు. ధర్మబుద్ధి, బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతాయంటారు. విభూతిని నొసట ధరించి శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించేవారికి ఎంతోమేలు జరుగుతుందని యోగ శాస్త్రం చెబుతోంది.

కారణాంతరాల వల్ల నీటితో స్నానం చేసే అవకాశం లేనివారికి విభూతి స్నానాన్ని సూచించాయి శాస్త్రాలు. క్రమ పధ్ధతిలో విభూతిని ఒంటికి రాసుకోవడాన్ని విభూతి స్నానం అంటారు. ఇలా చేసినవారు సర్వతీర్థాలలో స్నానం చేసినవారితో సమానమని, దైవకార్యాల నిర్వ హణకు అర్హులని ధర్మ శాస్త్రాలలో వివరణ ఉంది.

అయితే- విభూతి రాసేసుకోగానే ఏదో అద్భుతం జరిగిపోతుందని మాత్రం దీని భావం కాదు. అలా చెప్పడంలో అంతరార్థం ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే భస్మ రూప విభూతి ఆవిర్భావ విధానం తెలుసుకోవాలి. ఈ సృష్టిలో ఏ పదార్థమైనా భౌతిక రూపంలో నిలిచేది కొద్ది కాలమే. అలా భౌతిక రూపంలో ఉన్నప్పుడు స్వరూపాన్ని బట్టి స్వభావం, స్వభావాన్ని బట్టి వాటి ఫలితాలు మారుతూ ఉండవచ్చు. కానీ చివరికి అగ్నితో కూడి బూడిదగా రూపాంతరం చెందిన తరవాత మరే రూపంలోకీ మారదు. మరే స్థితికీ చేరదు. అదే నిర్గుణ, నిశ్చల, శాశ్వత స్థితి.

తనలో చేరిన అన్నింటినీ దహించే గుణం అగ్నికి ఉంది. చాలా పదార్థాలకు దహనమయ్యే గుణం ఉంది. తనలో చేరిన అన్ని పదార్థాల స్థితులు మారి మారి, ఇక మారలేని ఆఖరిస్థితి బూడిద. అది దహించదు. దహనం కాదు. అంటే తాత్కాలికం, భౌతికమైన గుణాలను త్యజించి శాశ్వతత్వం సంతరించుకోవడమే విభూతి రూపం.

విభూతిలోని ఈ నిర్గుణ తత్వమే దాని ధారణ చేసినవారి మానసిక పరిస్థితిని నిశ్చలంగా ఉంచుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అందుకే ఆధ్యాత్మిక ఎదుగుదలను కోరుకునేవారు విభూతి ధారణ చేయాలని సూచిస్తారు. విభూతి ధరించినవారికి పైన వివరించిన విభూతి ఆవిర్భావ విధానం మదిలో మెదిలి, మనసులోని ఇతర వ్యాపకాలన్నింటినీ స్వచ్ఛందంగా విడిచి పెట్టేసి తమంత తాముగానే పవిత్ర హృదయులవుతారు. ఆ నిశ్చలతత్వ స్థితికి చేరినవారికి అంతా శాంతే. దాన్ని మించిన ఐశ్వర్యం లేదు.

పై భావాలనే భగవద్గీత విభూతి యోగం బోధిస్తోంది. అందువల్లనే దానికా పేరు వచ్చింది.

కె.వి.ఎస్‌.ఎస్‌.శారద

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని