ఏడు ప్రశ్నలు

శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేది పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగపరచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమపురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి.

Published : 21 May 2024 00:25 IST

శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేది పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగపరచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమపురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి. పురుషోత్తముడు శ్రీరాముడి వ్యక్తిత్వం, నడవడి, గుణప్రభావ విశేషాలు సర్వజనామోదంగా ఆవిష్కరించేందుకు ఎందరో కవులు గ్రంథరూపంలో రామాయణ మహా కావ్యాన్ని మనకు ప్రసాదించారు. రామభక్తుడైన గోస్వామి తులసీదాస్‌ మానస సరోవరంలో రామచరితం అనే అపూర్వ పద్మం వికసించింది. మానవజన్మకు అర్థాన్ని, పరమార్థాన్ని వివరిస్తూ తన సుగంధ సౌరభాన్ని లోకమంతా విరజిమ్ముతూ హృదయోల్లాసాన్ని కలిగించింది ఆ రచన. అవధి భాషలో సరళంగా, సుందరంగా వెలువడిన గ్రంథమది. శ్రీరాముడి గార్హస్త్య జీవనం, రాజధర్మం, భక్తి జ్ఞాన త్యాగ వైరాగ్య సదాచారాలు, ఉపదేశాలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు గోస్వామి.

ఈ కథా ప్రబంధంలో ఇంకా పితాపుత్ర సంబంధాలు, దంపతుల అన్యోన్యానురాగాలు, సోదరుల సౌహార్దాలు, స్త్రీ పురుష మర్యాదాజీవనం, మన్నన, ప్రభువు ప్రజానురాగాలు, పాలకుల పట్ల ప్రజల భక్తి విశ్వాసాలను హృదయాన్ని తాకేలా పొందుపరచాడు. ఏ కాలంలోనైనా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి, పరస్పర స్నేహ సహకారాలతో వర్ధిల్లడానికి రామచరిత మానస గ్రంథ అనుశీలన అవసరమంటారు విజ్ఞలు.

మహాశక్తిమంతుడైన తన ప్రభువు శ్రీహరి శ్రీరాముడిగాను, మహా శేషుడు అపూర్వ పరాక్రమవంతుడు లక్ష్మణుడిగాను దుష్టశిక్షణకు భూమిపై అవతరించారని విని పొంగిపోయాడు గరుత్మంతుడు. రణభూమిలో మాయా యుద్ధంలో మేఘనాథుడి అస్త్రానికి మూర్ఛిల్లిన లక్ష్మణుణ్ని, తమ్ముడి కోసం దుఃఖించిన రాముడి బాధను జీర్ణించుకోలేకపోయాడు వైనతేయుడు. బ్రహ్మ, శివులను దర్శించి తన సందేహాన్ని వెలిబుచ్చాడు. రామభక్తి సామ్రాజ్య సంద్రంలో మునకలు వేస్తున్న కాకభుశుండి అనే వాయసం నీ సందేహం తీర్చగలదని వారు గరుడుణ్ని అతడి చెంతకు పంపారు. అత్యంత శక్తిమంతుడైనా మానవుడిగా జన్మించిన శ్రీరాముడు సాధారణ వ్యక్తిలా కష్ట్టనష్టాల పాలైన స్థితిగతుల్ని, ధైర్య స్థైర్యాలను కోల్పోక వాటిని ఎదుర్కొన్న రాముడి శక్తిని, గాఢంగా నమ్మిన మిత్రులకు అందించిన ఆపన్న హస్తాన్ని, రాముడి శరణాగతి తత్త్వాన్ని వివరించి గరుడుడికి సందేహ నివృత్తి చేస్తాడు కాకభుశుండి.

గరుడుడి ఏడు ప్రశ్నలకు విజ్ఞతతో సమాధానాలు అందిస్తాడు. దుర్లభమైన జన్మ ఏదని అడిగిన మొదటి ప్రశ్నకు మానవజన్మకు మించిన జన్మ మరొకటి లేదంటాడు. పరోపకారం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని, వినియోగించుకోలేని జన్మ వ్యర్థమని వివరిస్తాడు. ఘోరమైన దుఃఖమేది అన్న ప్రశ్నకు కోరుకున్నది లభించలేదని వగచే జీవితమేనని, సంపద లభించిన తరవాత దాన్ని పరులకు వితరణ చేయని జన్మ పరమ దుఃఖమని చెబుతాడు. గొప్ప సుఖమేదన్న మూడో ప్రశ్నకు సత్సాంగత్యమే నిజమైన సుఖమంటాడు. సజ్జన దుర్జన స్వభావాల గురించిన మరో ప్రశ్నకు మానవసేవ దైవాన్ని దగ్గర చేసే మార్గమని, సజ్జనులు మర్రి వృక్షంలా తమ నీడలో ఆర్తులకు ఆశ్రయం కలిగించాలని చెబుతాడు. ఇతరులకు హాని కలిగించే దుర్జనులకు దూరం కావడమే సజ్జన లక్షణమని తేటతెల్లం చేస్తాడు. శ్రుతుల్లో చెప్పిన పుణ్యకార్యమేదన్న అయిదో ప్రశ్నకు అహింసను మించిన పరమధర్మం మరొకటి లేదని బోధిస్తాడు. భయంకరమైన పాపకార్యమేదన్న ప్రశ్నకు పరనిందేనని, అది నరకానికి దగ్గరి దారి అంటాడు వాయసరాజు. మానసిక జాడ్యాలేమిటన్న చివరి ప్రశ్నకు మోహమే సమస్త రోగాలకు మూలమని చెబుతాడు. వైరాగ్య భావనతో ఉత్తమ బుద్ధిని అలవరచుకొని విషయవాంఛలకు దూరంగా నిర్మలచిత్తంతో జీవనం సాగించడమే మనిషి ధర్మం అన్న కాకభుశుండి మాటలు ముత్యాల మూటలు.

 మాడుగుల రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు