ఉచ్ఛ్వాస నిశ్వాసాలు

ప్రతి మనిషికీ జన్మించినప్పటి నుంచి మరణించే దాకా నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాంటిది. ఇవ్వడం... తీసుకోవడం. కణాలను, శరీరాన్ని, మనసును... ప్రతి దాన్ని ఉత్తమంగా పనిచేసేందుకు నిలబెడుతుంది.

Published : 24 May 2024 00:28 IST

ప్రతి మనిషికీ జన్మించినప్పటి నుంచి మరణించే దాకా నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాంటిది. ఇవ్వడం... తీసుకోవడం. కణాలను, శరీరాన్ని, మనసును... ప్రతి దాన్ని ఉత్తమంగా పనిచేసేందుకు నిలబెడుతుంది.

మరణం అనేది మానవ శరీరం తాలూకు అన్ని ప్రకంపనల సంపూర్ణ ముగింపు. గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఊపిరితిత్తులు, సిరలు, ధమనులు... నిజానికి భౌతిక శరీరంలోని ప్రతి అవయవం పనిచేయడం, కంపించడం నిలిచిపోతాయి. ఇంద్రియజ్ఞానం పోతుంది. లోపలకు, బయటకు తీసుకెళ్ళేందుకు పనిచేసే నాడులు ఉత్తర్వులు అందుకోవడం మానేస్తాయి. ఆ రకమైన విరామమే- మరణం.
శ్వాసక్రియలో గాలి పీల్చిన తరవాత వెంటనే విడవడం ఉండదు. శ్వాసను కొంతసేపు లోపల ఉంచుతాం. ఆ తరవాత ఊపిరి పీల్చుకుంటాం. అలాగే మళ్ళీ గాలి విడిచిపెట్టాక... రెండు సందర్భాల్లోనూ చిన్న విరామం ఉంటుంది. మొదటి విరామం ఉచ్ఛ్వాసం(పూర్ణకుంభకం). రెండో విరామం నిశ్వాసం(శూన్య కుంభకం). ఈ విరామ స్థితులు వేగానికి సంబంధించినవి కావు. విరామ స్థితి మరణ స్థితే తప్ప మరొకటి కాదు. ఆ స్థితిలో ప్రతి చర్యా, ప్రతి కంపనం నిలిచిపోతాయి.

మృత్యువు అని దేన్ని అంటాం? శ్వాస విడుదలైన తరవాత ఒక సెకనుకు బదులుగా ఒక ఏడాది, నెల, లేదా ఒక రోజు లేదా సుదీర్ఘ విరామం తరవాత తిరిగి రావడం... ఇదే తేడా. మరణం అంటే ఒక రకమైన మార్పు. ఇంద్రియాల బహిర్ముఖ చలనం ద్వారా మనం మార్పుచెందే ప్రపంచాన్ని మాత్రమే గ్రహిస్తాం. మార్పులేని, అజరామరమైన వాటిని గ్రహించాలనుకునేవారు ఈ మార్పు పవనాలను అధిగమించాలి. ఆ అస్తిత్వమే దైవం.

అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్‌ ఆఖరికి ఇంటికెళ్ళే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. సాధించిన విజయాలు, పెద్ద సైన్యం, అంతులేని సంపద... ఏవీ మరణం నుంచి కాపాడలేవని స్పష్టమైపోయింది.

తన శవ పేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలని, శ్మశానానికి వెళ్ళేదారిలో విలువైన వజ్రాలు, మణిమాణిక్యాలను పరచాలని, శవపేటికలో నుంచి ఖాళీ చేతులు బయటకు కనిపించే విధంగా ఉంచాలనే మూడు కోరికలూ వెల్లడించాడు తన ప్రీతిపాత్రుడైన సైనికుడికి.

ఆ కోరికల వెనక ఆంతర్యమడిగాడతడు. నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే! అందుకనే మొదటి కోరిక కోరానన్నాడు. జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేదీ తన వెంట తీసుకెళ్ళలేకపోతున్నానని, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన కాలాన్ని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పడానికి రెండో కోరిక. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను... వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే మూడో కోరిక అని చెప్పి కళ్లు మూశాడు.

ఎందరెందరో జీవిస్తున్నారు. అయితే పొందిన జీవితానికి కొంతైనా జోడించాలి మనిషి. ప్రతి మనిషీ ఎంతో అవగాహనతో జీవించాలి. దైవం మనిషికి ఈ ఉనికిలో ఒక బాధ్యతను అప్పగించాడు. అది- మానవస్పృహను పెంపొందించే దిశలో కృషి చేయడం. ప్రతి ఒక్కరూ ఆ పాత్రను నూరుశాతం పోషిస్తే దైవం కార్యం చేస్తున్నట్లే.

మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని