దేవుడి కోరికలు

మనుషులకు కోరికలుంటాయి. వాటిని భగవంతుడు తీరుస్తాడు. మరి దేవుడి కోరికల మాటేమిటి? వరాలిచ్చేవాడికి కోరికలుండటమా? అఖిల సృష్టికీ రక్షణ కల్పించేవాడికి కూడా కోరికలుంటే... వాటిని తీర్చేదెవరు? ఎవరికి సాధ్యం? సహజంగానే ఈ సందేహం ఉత్పన్నమవుతుంది.

Published : 26 May 2024 00:34 IST

మనుషులకు కోరికలుంటాయి. వాటిని భగవంతుడు తీరుస్తాడు. మరి దేవుడి కోరికల మాటేమిటి? వరాలిచ్చేవాడికి కోరికలుండటమా? అఖిల సృష్టికీ రక్షణ కల్పించేవాడికి కూడా కోరికలుంటే... వాటిని తీర్చేదెవరు? ఎవరికి సాధ్యం? సహజంగానే ఈ సందేహం ఉత్పన్నమవుతుంది.

మనం కోరే కోరికలన్నీ సుఖసంతోషాల కోసమే. మన శ్రేయస్సు కోసమే. ఇది అక్షర సత్యం. మరి, పరమాత్మ కోరేదేమిటి? ఎవరిని కోరుతున్నాడు, ఏమని కోరుతున్నాడు? ఆయన కోరికలూ మన కోసమే. మన భవిత కోసమే. లోకకల్యాణం కోసమే. అవి కోరికలు కావు. సలహాలు, సూచనలు, బోధనలు, ఉపదేశాలు. వాటిని మనం శిరోధార్యంగా భావించాలి. అవగాహన చేసుకోవాలి. అనుసరించాలి. ఆచరించాలి. అప్పుడే జన్మ చరితార్థమవుతుంది.

దైవం ప్రధానంగా కోరేదేమంటే- మనం నిరంతరం ధర్మవర్తనులమై ప్రయాణించాలని! ధర్మాచరణకు మనకు పంచేంద్రియాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. మంచిని కనమన్నాడు, మంచిని వినమన్నాడు, మంచి చేయమన్నాడు. ‘ఆపన్నుల సేవే అంతర్యామి సేవ’ అన్నాడు. జీవితమనేది ఓ అద్భుతమనుకుంటే, జీవన విధానం మరీ అద్భుతమైంది. అమూల్యమైంది. దేవుడిచ్చిందే ఇది. ఇచ్చినందుకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటి ద్వారా పరమేశ్వరుడు మహత్తరమైన సందేశాలందించాడు. రుషులు, యోగులు, అవధూతలు మొదలైన మహానుభావుల ద్వారా స్వామి అద్భుతమైన ప్రవచనాలందించాడు. సావధానంగా అన్నీ చదివి, లేదా విని జీవిత మకరందంతో సమన్వయం చేసుకుని భవిష్యత్తును మహోజ్జ్వలం చేసుకొమ్మన్నాడు. పత్రం, పుష్పం, ఫలం, జలం- ఏది సమర్పించాలనుకున్నా చిత్తశుద్ధి, నిర్మల భక్తి, ఏకాగ్రత ఉంటే చాలన్నాడు వాసుదేవుడు. ఇదేమైనా పెద్ద కోరికా? ఈ మాత్రం మనం తీర్చలేమా? అదీ మనకోసమేగా!

నోమో, వ్రతమో, తీర్థయాత్రో, దేవాలయ దర్శనమో, మౌనమో, ధ్యానమో- ఏదైనా మన మనశ్శాంతికే, ఆత్మజ్ఞాన ప్రాప్తికే, మనోవికారాలను తగ్గించుకోవడానికే! అపరాధాలు, నేరాలు, పాపాలు చేస్తే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిండు మనసుతో పశ్చాత్తాపం ప్రకటించుకోగలిగే ధైర్యం, విజ్ఞత ఉంటే చాలు మనకు. ‘నువ్వు చేయదలచుకున్నది పెన్సిల్‌తో రాసి, రబ్బరు నా చేతికివ్వు’ అన్నాడంటే- అంతటి వాత్సల్యమూర్తి లోకంలో మనకు మరొకరు కనిపిస్తారా? ‘లోచూపు ఉంటే నన్ను ప్రత్యక్షంగా చూడగలవు’- అన్నాడు ఆపద్బంధువు. కష్టాలు, కన్నీళ్లు, విరహాలు, వియోగాలు, అవమానాలు- అన్నీ భరించాడు శ్రీరాముడై. ఎన్ని భరించినా ఆత్మన్యూనత పొందరాదని, ఆత్మవిశ్వాసం కోల్పోరాదని, ధర్మమార్గం తప్పి చరించరాదని, సహనం కోల్పోరాదని ఆచరించి లోకానికి తెలియజేశాడు మర్యాదా పురుషోత్తముడు.

నీతోనే, నీలోనే ఉన్నానని నీరజాక్షుడు చెబుతున్నా- ఆ మాటలు వినే ఓపిక, తీరిక మనకు లేకపోతే ఎలా? కామకోటి రాస్తున్నవాడికి రామకోటి రాయాలన్న సత్సంకల్పం కలుగుతుందా! మన కోరిక ధర్మబద్ధమైతే ఎంత అసాధ్యమైనా సుసాధ్యమై తీరుతుంది. ధర్మబద్ధం కాకపోతే సులభ సాధ్యమైనదైనా తీరదు. ‘మంచినే కోరు’ అనేదే ఆయన కోరిక. అదే మనకు కరదీపిక!

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని