వేదాంగాలు

ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు. ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని, వీటిని ఎవరూ రాయలేదని సంప్రదాయజ్ఞులు అంటారు.

Published : 07 Jun 2024 01:22 IST

ప్రపంచానికి అపారమైన జ్ఞానరాశిని అందిస్తున్న గ్రంథాలు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి నాలుగు వేదాలని అందరికీ తెలుసు. ఇవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని, వీటిని ఎవరూ రాయలేదని సంప్రదాయజ్ఞులు అంటారు. అందుకే వీటికి ‘అపౌరుషేయాలు’ అని పేరు. ఆధునిక విమర్శకులు వేదాలను ప్రాచీన మహర్షులు రాసి ఉంటారని, కనుక ఇవి అపౌరుషేయాలు కాదని అంటారు. ఈ వాదాలు ఎలా ఉన్నా వేదాలు మాత్రం అపార జ్ఞానానికి నిలయాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వేదాలు నాలుగు భాగాలుగా ఉంటాయి. అవి- సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్య కాలు, ఉపనిషత్తులు. వేదాల్లోని మంత్రాలను అర్థం చేసుకోవాలంటే ఆరు వేదాంగాలను చదవాలి. అప్పుడే వేదమంత్రాల్లోని అంతరార్థం తెలుస్తుంది. వేదాంగాలు ఆరు. అవి- శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇవి వేదపురుషుడికి శరీరంలోని అంగాల వంటివి. శిక్ష వేదపురుషుడికి ముక్కు వంటిది. వ్యాకరణం నోరు, ఛందస్సు పాదాలు, నిరుక్తం చెవి, జ్యోతిషం కన్నులు, కల్పం చేతుల వంటివి. ఈ ఆరు అంగాల్లోగల జ్ఞానాన్ని తెలుసుకుంటేనే వేదమంత్రాల్లోని గూఢార్థాలు అవగతమవుతాయని సంప్రదాయం చెబుతోంది. అందుకే ఎవరైనా ‘సాంగవేదాధ్యయనం’ (ఆరు అంగాలతో కూడిన వేదాధ్యయనం) చేస్తేనే పరిపూర్ణ వేదపండితులవుతారు.

శిక్షలో వర్ణం, స్వరం, మాత్రలు, బలం, సామ, సంతానం అనే అంశాలుంటాయి. వర్ణాలంటే అక్షరాలు. స్వరాలంటే ఉదాత్తం, అనుదాత్తం, స్వరితాలు. మాత్రలంటే హ్రస్వం, దీర్ఘం, ప్లుతాలు. బలం అంటే స్థాన ప్రయత్నాలు. సామ అంటే మాధుర్యాది గుణోచ్చారణలు. సంతానం అంటే పదాల మధ్యన ఏర్పడే సంధులు. ఇవన్నీ శిక్షలోని అంశాలు. వ్యాకరణంలో ఏ శబ్దం ఎలా ఏర్పడింది, ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించాలి, ఎలా ఉచ్చరించాలి, సాధు శబ్దాలు ఏవి, అపశబ్దాలు ఏవి అనే అంశాలు కనిపిస్తాయి. వేదమంత్రాల్లోగల పదాలను ఏ స్వరంలో ఉచ్చరిస్తే ఎలాంటి అర్థం వస్తుందనే విషయాన్ని వ్యాకరణం చెబుతుంది.

ఛందస్సులో ఏ మంత్రంలో ఎన్ని మాత్రలున్నాయి, వాటిలోని గణాలు ఎలా ఉంటాయి, ఏ ఛందస్సును వాడితే ఏ ఫలితం వస్తుందనే విషయాలుంటాయి.

నిరుక్తంలో వేదాల్లోని పదాలకు గల నిర్వచనాలు ఉంటాయి. అంటే, నిఘంటువుల్లో ఎలా అయితే ప్రతీ పదానికి గల అర్థం లభిస్తుందో, నిరుక్తంలోనూ వేదమంత్రాల్లోగల పదాలకు నిర్వచనాలను చెప్పడం ద్వారా పదంలోని అర్థం చక్కగా అవగతమవుతుంది. వేదాల్లోని పదాలను నిరుక్తం నిర్వచిస్తుంది. జ్యోతిషంలో వేదమంత్రాల్లోగల యజ్ఞయాగాది క్రియాకలాపాలు ఏ కాలంలో, ఏ నక్షత్రంలో, ఏ తిథిలో చేయాలో వివరంగా ఉంటుంది. కనుక జ్యోతిషం కాలజ్ఞాన శాస్త్రంగా ప్రసిద్ధి చెందింది. కల్పంలో వేదమంత్రాల్లోని శ్రౌతసూత్రాలకు, గృహ్యసూత్రాలకు, ధర్మసూత్రాలకు పారిభాషిక సంజ్ఞల వివరణ ఉంటుంది. ప్రతి వేదానికీ ప్రత్యేకంగా ఉండే సూత్రనియమాలను తెలిపేదే కల్పం. 

ఇలా ఆరు వేదాంగాలు నాలుగు వేదాల్లోని అపూర్వ జ్ఞానాన్ని విస్తృతంగా తెలిపేవిగా ప్రసిద్ధిచెందాయి. మనిషి తనకు తెలియని అపార విజ్ఞానాన్ని తెలుసుకొని, ఆ ఫలాలను ప్రపంచానికి పంచాలనుకుంటాడు. ఆ దృష్టితోనే ప్రాచీన వాఙ్మయాలైన వేదాలను అధ్యయనం చేస్తున్నాడు. కనుక, అలాంటి సదాశయం కలిగిన మనిషికి సహాయపడే గ్రంథాలే వేదాంగాలు.  

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని