జ్యేష్ఠం - ఎంతో శ్రేష్ఠం

జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్ఠం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి.

Published : 08 Jun 2024 02:04 IST

జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్ఠం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీర వ్రతం చేస్తారు. అంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తారు. విదియనాడు శ్రాద్ధకర్మలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ తిథిని ‘సోప పదం’ అనీ పిలుస్తారు.

శుద్ధ తదియ రోజున రంభావ్రతం చేస్తారు. రంభ అంటే అరటి అనే అర్థం కూడా ఉంది. పార్వతీ దేవిని స్వర్ణప్రతిమగా మలచి ఆరబెట్టి కింద ఉంచి, పూజచేసి, వస్త్రదానం చేస్తే సకల సంపదలూ చేకూరతాయని విశ్వసిస్తారు. పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన రోజు శుద్ధ చవితి. ఉమాదేవిని ఈ రోజున ఆరాధిస్తారని బ్రహ్మపురాణ కథనం. శుద్ధ షష్ఠినాడు అరణ్యక గౌరీవ్రతం, వింధ్యవాసినీ వ్రతం ఆచరిస్తారని స్కాందపురాణం చెబుతోంది.

శుద్ధ అష్టమినాడు శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తారు. నవమినాడు ఉపవాసం చేసి బ్రాహ్మణీదేవిని అర్చిస్తారు. శుద్ధ ఏకాదశిని ‘నిర్జలైకాదశి’ అని పిలుస్తారు. ఆ రోజున మంచినీళ్లు అయినా తాగకుండా ఉపవసిస్తారు.

శుద్ధ ద్వాదశినాడు త్రివిక్రమ మూర్తిని ఆరాధిస్తారు. శుద్ధ త్రయోదశినాడు విద్యా రణ్య స్వామివారి జయంతి జరుపుతారు. వేదపండితులను, గురువులను ఆ రోజున పూజించి, దక్షిణ తాంబూలాదులు, నూతన వస్త్రాదులతో సత్కరిస్తారు. రంభాత్రి రాత్రి వ్రతం తప్పక ఈ రోజున ఆచరించాలని చతుర్వర్గ చింతామణి తెలియజేస్తోంది.

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు వటసావిత్రీ వ్రతం ఆచరిస్తారు. వటవృక్షం శ్రీ మహావిష్ణు స్వరూపం. త్రిమూర్త్యాత్మ కంగాను భావిస్తారు. యముడితో ధైర్యంగా పోరాడి మృతుడైన పతిని సజీవంగా వెంట తీసుకుని వచ్చిన సావిత్రి ఈ రోజున పూజలందుకుంటుంది. ఈ పర్వదినాన్ని ఏరువాక పున్నమిగా వ్యవహరిస్తారు. రైతులకు ఎంతో ప్రాధాన్యాన్నిచ్చే పండగ. కర్షకులు, కార్మికులు ఈ రోజున వ్యవసాయ పరికరాలను, వృషభాలను అలంకరించి పూజిస్తారు. కృష్ణ యజుర్వేదంలో ఈ పర్వదిన వివరణం విస్తృతంగా కనిపిస్తుంది. ఈ రోజున గొడుగు, పాదరక్షలు దానం చేస్తారు. బహుళ అష్టమి రోజున త్రిలోచన పూజ చేస్తే శివలోక ప్రాప్తి జరుగుతుందని పురాణ కథనం.

బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, యోగిని ఏకాదశి అనీ పిలుస్తారు. ఈ రోజు శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఫలితంగా అశ్వగజ, గో, సువర్ణ దాన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. బహుళ ద్వాదశి ‘కూర్మజయంతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించాడు. కూర్మ ఆరాధన సర్వశుభాలను ప్రసాదిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమినాడు వటసావిత్రీ వ్రతం చేయడం సాధ్యం కానివారు ఈ అమావాస్యనాడయినా చేయవచ్చునని వ్రత విధానం చెబుతోంది. సౌభాగ్యప్రదమైన జ్యేష్ఠమాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఏ మాసంలోనూ లేవు. అందుకే జ్యేష్ఠం అత్యంత శ్రేష్ఠం అన్నారు.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని