Updated : 15/11/2021 05:46 IST

Amit Shah: గ్రామీణాభివృద్ధిలో ఆదర్శప్రాయుడు

వెంకయ్య నాయుడి గురించి ఆయన గ్రామంలోనే మాట్లాడాలనుకున్నా

నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది స్వర్ణభారత్‌ ట్రస్టు వార్షికోత్సవంలో అమిత్‌ షా

సంపాదన కంటే.. సేవా కార్యక్రమాలలోనే సంతృప్తి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి వ్యాఖ్య

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవ వేదికపై అమిత్‌ షాను ఆశీర్వదిస్తున్న వెంకయ్య నాయుడు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వెంకటాచలం, న్యూస్‌టుడే: ప్రతి భారతీయుడూ తన జన్మభూమితో అనుసంధానమై ఆ ప్రాంత అభివృద్ధికి ఏదైనా చేయాలనుకుంటే.. ఒక్కసారైనా నెల్లూరు వచ్చి వెంకయ్య నాయుడు చేస్తున్న పనిని చూడాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. వెంకయ్యనాయుడి స్వగ్రామం చూడాలని, అక్కడే ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో కలిసి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో మంత్రిగా చేసే అవకాశం వచ్చినప్పుడు.. వెంకయ్య తన హృదయానికి దగ్గరగా ఉండే గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారని గుర్తు చేశారు. అది గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో ఆయనకు ఉన్న శ్రద్ధ, అంకితభావాన్ని తెలుపుతోందని ప్రశంసించారు. స్వయంగా గ్రామీణ ప్రాంతానికి చెందడం, బాల్యమంతా పల్లెటూళ్లలోనే గడవడంతో ఇక్కడి సమస్యలు, వాటి పరిష్కారం గురించి ఆయనకు బాగా తెలుసన్నారు. ఇప్పటికీ.. రైతులపై తన ప్రేమను ఆయన ఏమాత్రం దాచుకోరని, ఎప్పుడు కలిసినా రైతుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి.. ఏం చేస్తోందనే అంశాలపై చర్చిస్తారని చెప్పారు.

పార్టీ అధ్యక్షుడిగానూ...

వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ దేశంలోని నలుమూలలకూ వెళ్లిందన్నారు. ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా క్రమశిక్షణతో వాటన్నింటినీ సమర్థంగా పూర్తి చేశారన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక పొరపాటున కూడా ‘మన పార్టీ’ అనే మాట ఆయన నోటి నుంచి వినలేదన్నారు. ‘యువకుడిగా ఉన్నప్పుడే ఆర్టికల్‌ 370 రద్దు కోసం జరిగిన దేశవ్యాప్త ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. ఆ బిల్లు రద్దు సమయంలో రాజ్యసభ ఛైర్మన్‌ సీట్లో వెంకయ్య ఉండటం.. ఆ బిల్లును నేను ప్రవేశపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అమిత్‌షా అన్నారు. విలువల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్టు అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు.

‘హృదయ-క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’ నిర్వాహకులు డా. మన్నం గోపీచంద్‌కు రూ.50 లక్షల చెక్కును
అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, వారి కుటుంబసభ్యులు- మనవరాలు నిహారిక,
ఆమెకు కాబోయే భర్త రవితేజ, హర్షవర్ధన్‌, ఆయన భార్య రాధ, దీపా వెంకట్‌, కేంద్ర హోంశాఖ
మంత్రి అమిత్‌షా, కామినేని శ్రీనివాస్‌ తదితరులు

కామాలు, ప్రశ్నార్థకాలు లేని దేశం చూడాలన్నది నా కల

జమ్మూకశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370ని రద్దుచేస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన రోజు.. తన జీవితంలో చరిత్రాత్మకమైందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్‌ భారతదేశంలో భాగమని, ఎలాంటి కామాలు, ప్రశ్నార్థకాలు లేని దేశాన్ని చూడటం తన చిన్నప్పటి కల అని ప్రస్తావించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినరోజు తాను పడిన ఒత్తిడిని గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్న విషయాన్ని ప్రధాని మోదీ.. ముందురోజు తన ఇంటికి వచ్చి తెలిపారన్నారు. మెజారిటీ ఉన్న లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా రాజ్యసభలో ఎందుకని ప్రశ్నించానని, దానికి మోదీ.. మొదట రాజ్యసభలోనే ప్రవేశపెడదామని చెప్పడంతో తాను ఒత్తిడికి గురయ్యానన్నారు. తన భార్య, కుమార్తె కూడా తన ఆరోగ్యం విషయంలో కంగారు పడినట్లు వెల్లడించారు. కార్డియాలజిస్టు బలరాం భార్గవ్‌ను పిలిపించగా.. ఏం కంగారుపడాల్సిన పని లేదని, తాను గ్యాలరీలోనే ఉంటానని ఆయన చెప్పినట్లు తెలిపారు. అనంతరం అమిత్‌షా సభలో ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని ప్రస్తావించడంతో పాటు విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, దానిపై సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వడంతో సాయంత్రానికి ఆమోదం పొందినట్లు గుర్తుచేశారు.

మోదీ చొరవతోనే అర్హులకు పద్మ పురస్కారాలు

‘గతంలో సిఫార్సుల మేరకు పద్మ పురస్కారాలు దక్కేవి. ప్రస్తుతం ప్రతిభ ఆధారంగా వాటిని అందజేస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు కూడా రాష్ట్రపతి భవన్‌కు వచ్చి అవార్డులు తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ చొరవతోనే ప్రతిభావంతులు, సేవ చేస్తున్న అర్హులకు పురస్కారాలు అందుతున్నాయి’ అని వెంకయ్య, అమిత్‌షా అన్నారు. కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంత మహిళ శ్రమించి 35వేల మొక్కలు నాటితే.. ఎవరి సిఫార్సు లేకుండా కన్నడంలో రాసి పంపగా ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించుకున్నామని, ఇప్పుడామె దేశవ్యాప్తంగా ఎందరికో ఆదర్శమన్నారు. కార్యక్రమంలో ట్రస్టు ఛైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, మేనేజింగ్‌ ట్రస్టీ దీపావెంకట్‌, ముప్పవరపు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్‌, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం రమేష్‌ పాల్గొన్నారు.


పిల్లలకు ఇవ్వాల్సిన వారసత్వం ఆస్తులు కాదు: వెంకయ్య నాయుడు

ఆస్తులు కూటబెట్టడం కన్నా.. సేవా కార్యక్రమాలు చేయడంలో కలిగే సంతృప్తి వెలకట్టలేనిదని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తల్లిదండ్రులు.. పిల్లలకు ఆస్తులే కాకుండా మంచితనాన్ని, మానవత్వాన్ని, సమాజం పట్ల బాధ్యత చాటుకోవడాన్ని వారసత్వంగా ఇవ్వాలన్నారు. తద్వారా మనం చేసే మంచి కార్యక్రమాలను తర్వాతి తరం ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుందన్నారు. తన సేవా సంకల్పాన్ని భుజానికి ఎత్తుకునేందుకు తన కుమారుడు, కుమార్తె ముందుకు రావడాన్ని, దానికి మిత్రులు అండగా నిలవడాన్ని ఆయన అభినందించారు. గ్రామస్వరాజ్యం లేనిదే రామరాజ్యం సాధించలేమన్న గాంధీ మహాత్ముని స్ఫూర్తితో గ్రామీణ భారత సాధికారతే ధ్యేయంగా స్వర్ణభారత్‌ ట్రస్టు రెండు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తానెక్కడున్నా.. ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొంటే వచ్చే సంతృప్తి ప్రత్యేకమైందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రావడం ఆనందదాయకం అంటూ.. ఆయనకు అభినందనలు తెలిపారు.


తాత స్ఫూర్తితో రూ.50 లక్షల విరాళం

ఉప రాష్ట్రపతి స్ఫూర్తితో ఆయన మనవరాలు (కుమారుడు హర్షవర్ధన్‌ పెద్ద కుమార్తె) నిహారిక రూ.50 లక్షల విరాళాన్ని ‘హృదయ-క్యూర్‌ ఏ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’ నిర్వాహకులు డాక్టర్‌ మన్నం గోపీచంద్‌కు అందించారు. తన వివాహం నిశ్చయం కావడంతో.. పెళ్లిఖర్చులు తగ్గించుకుని ఆమె.. పేద పిల్లలకు ఉచితంగా గుండెచికిత్స చేస్తున్న ఈ ఫౌండేషన్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని