Ring Nets: నడి సంద్రంలో వలల నిప్పు

కొందరు మత్స్యకారులు రింగ్‌ వలలతో వేట సాగిస్తుండగా... మరికొందరు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది. కొందరికి గాయాలు కాగా ఆరు పడవలు దహనమయ్యాయి.

Updated : 05 Jan 2022 05:54 IST

మత్స్యకారుల మధ్య ఘర్షణలు

సాగరంలో ఆరు పడవల దహనం

విశాఖ తీరం సహా పలు గ్రామాల్లో ఉద్రిక్తత

ఈనాడు, విశాఖపట్నం, ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు, గ్రామీణ భీమిలి, న్యూస్‌టుడే: కొందరు మత్స్యకారులు రింగ్‌ వలలతో వేట సాగిస్తుండగా... మరికొందరు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది. కొందరికి గాయాలు కాగా ఆరు పడవలు దహనమయ్యాయి. ఫలితంగా విశాఖ సాగరతీరంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీసంఖ్యలో బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తీరానికి సమీపంలో ‘రింగ్‌ వలలు’ వినియోగిస్తే సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందనే అంశంపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలోని మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మత్స్యకారులు పడవలపై రింగ్‌ వలలతో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. సమాచారం అందుకున్న పెదజాలరిపేటకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు వారి వేటను అడ్డుకునేందుకు పెద్దసంఖ్యలో పడవలపై బయలుదేరారు. మంగమారిపేట తీరంలో సముద్రంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు, రింగ్‌ వలలతో వేట సాగిస్తున్న వారు కొందరు గాయపడ్డారు. గాయపడిన మత్స్యకారులు పెదజాలరిపేటకు వచ్చి తమ ప్రాంతంలోని వారికి సమాచారం అందించారు. ప్రతిదాడి చేయడానికి పెదజాలరిపేట వాసులు భారీసంఖ్యలో సమీపంలోని వాసవానిపాలెం, జాలరిఎండాడలకు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. మత్స్యకారులను నిలువరించేందుకు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. చివరికి వారిని వెనక్కి పంపేయడంతో వివాదం కొంత సద్దుమణిగింది.

పడవల దహనంతో...

ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు సాగుతున్న సమయంలో మంగమారిపేట, చేపలుప్పాడ, వాసవానిపాలెం, జాలరిఎండాడకు చెందిన వారి పడవలను కొందరు తమతో పాటు తీసుకువెళ్లి జాలరిపేట తీరంలో దహనం చేశారు. నాలుగు పడవలు పూర్తిగా, రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామాల వాసులు సాగరం ఒడ్డున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకుని శాంతింపచేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను మరో గ్రామానికి చెందిన వారు బంధించడం కలకలం రేపింది. పోలీసులు ఆ ఇద్దరినీ విడిపించారు. సముద్రంలో పడవలు దహనమవడం, మత్స్యకారుల మధ్య ఘర్షణ తలెత్తటంతో నౌకాదళం, కోస్టుగార్డు, మెరైన్‌ విభాగ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నౌకాదళ సిబ్బంది హెలికాప్టర్‌తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మంత్రి, సీపీ పర్యవేక్షణ...

మత్స్యకార గ్రామాల్లో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేసి, 144 సెక్షన్‌ విధించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, డీసీపీ గౌతమి శాలి, ఏడీసీపీలు శ్రావణ్‌కుమార్‌, ఆనందరెడ్డి, పలువురు ఏసీపీలు తీరంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. మత్స్యకారులతో మాట్లాడారు. వివాదాలకతీతంగా మసలుకోవాలన్నారు.


రింగు వల అంటే ఏమిటి?

మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సాధారణంగా గిల్‌, రింగు వలల్ని ఉపయోగిస్తారు. రింగు వల కన్ను వృత్తాకారంలో ఉంటుంది. దీని ఖరీదు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు. ఈ వలలో చిన్నచిన్న చేపలూ చిక్కుతాయి. కాబట్టి పెద్దమొత్తంలో పట్టుకునే అవకాశం ఉంది. తీరం నుంచి 8 కిలోమీటర్లలోపు దీన్ని ఉపయోగిస్తుండటంతో గిల్‌ వలలతో వేటను సాగించే సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరక్క నష్టం కలుగుతోంది. ఈ కారణంగా 8 కి.మీ.లోపు రింగు వలల వినియోగాన్ని నిషేధించారు.

* గిల్‌ వల: ఈ వలకు చతురస్రాకారంలో కన్ను ఉంటుంది. దీని ఖరీదు రూ.20 వేల నుంచి రూ.50 వేలు. ఈ వలల్ని వాడే మత్స్యకారుల సంఖ్య ఎక్కువ. ఈ వలకు పెద్ద చేపలు చిక్కి, చిన్న చేపలు జారి పోతాయి. రింగు వలతో పోలిస్తే దీనిలో తక్కువ చేపలు పడతాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని