Financial literacy: ఆర్థిక.. అక్షరాస్యులమవుదాం!

కొత్త సంవత్సరం వచ్చేసింది. నిన్న ఏం చేశాం.., ఇప్పుడు ఏం చేద్దాం, చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటి? అనే ఆలోచన ఎంతోమందిలో మెదులుతుంది. చేయకూడనివి ఏమిటనేది కాసేపు పక్కనపెడితే, ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందీ, తప్పనిసరిగా అనుసరించాల్సింది ఒకటుంది.

Updated : 01 Jan 2023 12:02 IST

కొత్త సంవత్సరం వచ్చేసింది. నిన్న ఏం చేశాం.., ఇప్పుడు ఏం చేద్దాం, చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటి? అనే ఆలోచన ఎంతోమందిలో మెదులుతుంది. చేయకూడనివి ఏమిటనేది కాసేపు పక్కనపెడితే, ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందీ, తప్పనిసరిగా అనుసరించాల్సింది ఒకటుంది. అదే కట్టుదిట్టమైన ఆర్థిక ప్రణాళిక.


పొదుపుతో పాటు మదుపు...

కేవలం పొదుపు చేస్తే సరిపోదు. మదుపు కూడా చేయాలి. 4+4= 8 మాత్రమే. అదే గుణిస్తే 16 అవుతుంది. అదే మదుపు అంటే! ఇందుకోసం బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు.. వంటి పెట్టుబడి సాధనాలను పరిశీలించాలి. ఎప్పుడు ఎక్కడ మదుపు చేయాలో తెలుసుకోవాలి. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్నాయి. సేవింగ్స్‌ ఖాతాలో సొమ్ము ఉంటే వెంటనే స్పెషల్‌ డిపాజిట్ చేయొచ్చు. వడ్డీ రేట్లు వచ్చే ఏడాది చివరి నాటికి మళ్లీ తగ్గిపోవచ్చు.


గత రెండేళ్లలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం వల్ల ఎంతోమంది ఆర్థికంగా కుంగిపోయారు. ఆ నష్టం నుంచి ఎన్నో కుటుంబాలు ఇంకా కోలుకోలేదు. ఈలోపే 2022లో ఉక్రెయిన్‌-రష్యా- యుద్ధం, ఆర్థిక మాంద్యం ఉరిమాయి. సంపన్నుల నుంచి సామాన్యుల దాకా అందరినీ ఆందోళనలో పడేస్తున్న ఈ ఆర్థిక అనిశ్చితి అనేక పాఠాలను చెబుతోంది. చిన్నదైనా, పెద్దదైనా సమస్యలను తట్టుకోవాలంటే ప్రతి ఒక వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. దానికి కట్టుబడి ఉండాలి. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత.., పొదుపు- మదుపు ఏమిటి?, అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే ఎలా తట్టుకోవాలి.. అందుకు అవసరమైన అత్యవసర నిధిని సృష్టించటం ఎలా.. అనే ఆలోచన చేయాలి.

ఈ కొత్త ఏడాదిలోనే ఇది ప్రారంభిద్దాం..


లెక్కప్రకారం పెట్టుబడులు..

మనలో చాలామంది అక్షరాస్యులం! కానీ ఆర్థిక అక్షరాస్యులం కాదు. ఆర్థిక ప్రణాళిక ఎలా చేసుకోవాలో? ఎలా తెలివిగా మదుపు చేయాలో, పెట్టుబడి పెట్టాలో తెలిసినవారు చాలా తక్కువమంది. ఆర్థిక ప్రణాళిక అంటే డబ్బులు దాచుకోవటం అనుకుంటారు చాలామంది. కేవలం దాచుకుంటేనే సరిపోదు. దాచుకున్నదాన్ని సరిగ్గా ఇన్వెస్ట్‌ చేయాలి. అలా చేయటంలో లాభం ఏంటి? రిస్క్‌ ఏంటో తెలియాలి. లాభం ఎక్కువ వస్తోందని గుడ్డిగా పోకుండా అందులోని రిస్క్‌ను కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కువ వడ్డీ ఇస్తున్నారని ఎవరో ఒకరి దగ్గర పెట్టి మోసపోయి నష్టపోవడం.. తెలియని బ్యాంకుల్లో పెట్టి మోసపోవడం సర్వసాధారణంగా చూస్తున్నదే. ఈక్విటీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు అంటే ఏమిటో తెలుసుకోవాలి. దీనివల్ల ప్రణాళిక సులభం అవుతుంది. కనీసం పదేళ్ల తర్వాత అవసరాలేంటో గుర్తించి వాటికెంత అవుతుందో లెక్కలు వేసుకొని, దానికనుగుణంగా పెట్టుబడులు ఎలా పెట్టుకోవాలో ప్రణాళిక వేసుకోవాలి. అదే ఆర్థిక అక్షరాస్యత!


50:30:20

ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, పొదుపు- మదుపు ఏమిటి? అనూహ్యమైన పరిస్థితులు ఎదురైతే ఎలా తట్టుకోవాలి? అందుకు అవసరమైన అత్యవసర నిధిని సృష్టించటం ఎలా అనేది ఆలోచించాలి. ముఖ్యంగా.. ఆదాయాన్ని మించి ఖర్చు వద్దు. పొదుపు చేయగా మిగిలిన సొమ్మే ఖర్చు చేయాలి. 50:30:20 ప్రణాళికను అనుసరించాలి. అంటే.. సంపాదనలో ఖర్చు 50 శాతాన్ని మించకూడదు. 30 శాతం సొమ్మును మన దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు కేటాయించాలి. 20 శాతం సొమ్మును పొదుపు చేయాలి.


ఇష్టారాజ్యం సరికాదు..

సాధ్యమైనంత వరకూ పెద్ద పెద్ద అప్పులు చేయకుండా ఉండటం మేలు. క్రెడిట్  కార్డు చేతిలో ఉందని, ఇష్టారాజ్యంగా దాన్ని గీకటం కూడా సరికాదు. బ్యాంకులు లేదా ఫైనాన్స్‌ కంపెనీ వాళ్లు.. ఫోన్‌ చేసి అప్పు ఇస్తున్నారని ఏ అవసరం లేకపోయినా తీసుకుంటే, ఆ సొమ్ము దేనికో ఖర్చయిపోతుంది. చివరికి ఆ అప్పు తీర్చలేక తిప్పలు పడాల్సి వస్తుంది. ఏదైనా మూలధన అవసరాలకు (ఆస్తులు కొనడం, పిల్లలను చదివించడం వంటివి) ఒక పరిమితికి లోబడి అప్పులు చేయడంలో తప్పు లేదు. కానీ వ్యక్తిగత ఖర్చులకు, సరదాలు- షికార్లకు అప్పులు చేస్తే మాత్రం ఇబ్బందే.


ఆ రెండూ తప్పనిసరి

2022లో తరచూ వినిపించిన పదం లాంగ్‌ కొవిడ్‌. ఈ మహమ్మారి ప్రభావం మన ఆరోగ్యంపై, కుటుంబాలపై ఇంకా ఉంది. ఇలాంటి ఉపద్రవాల నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి.


చిన్న వయసులోనే...

ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలంటారు. ఆర్థిక ప్రణాళికకు కూడా అదే వర్తిస్తుంది. 20ల్లో ఏం చేయాలో, 30ల్లో ఏం చేయాలో, 40ల్లో ఏం చేయాలో ముందుగా ఆలోచించుకొని ఆచరణలో పెడితే నిశ్చింతగా ఉండొచ్చు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌లాంటివి చిన్న వయసులో చేస్తే తక్కువ మొత్తం ప్రీమియంతో, ఎలాంటి ఆరోగ్య పరీక్షలు లేకుండా వచ్చేస్తాయి.


సిప్‌లు నిశ్చింతగా...

మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా స్టాక్‌ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడులు పెడుతున్న రిటైల్‌ మదుపరులు మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా తమ సిప్‌ కొనసాగించాలి. మార్కెట్ సూచీలు పెరిగాయని సిప్‌ మొత్తాలు పెంచటం, తగ్గినప్పుడు నిలిపివేయడం సరికాదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కొనుక్కోవడం, మీకిష్టమైన కారును సొంతం చేసుకోవడం.. ఇలా ఎటువంటి కలనైనా సాధించాలంటే, ఇటువంటి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ఉండాలి.


కనీసం 3 నెలలకు సరిపడా...

ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మనకేం కాదులే అనుకోవడానికి లేదు. అందుకే ఒక అత్యవసర నిధిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్వహించాలి. కనీసం మూడు నెలల ఖర్చులకు అవసరమైనంత సొమ్ము ఎప్పుడూ సేవింగ్స్‌ ఖాతాలో ఉండాలి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి.. ఈ నిధిలో కొంత సొమ్మును ఖర్చు చేసినా, మళ్లీ వెంటనే భర్తీ చేయాలి.


30ల్లోనే విరమణ గురించి...

పదవీ విరమణ అనేది 60కి దగ్గర్లోనే అయినా.. దాని ప్రణాళిక మాత్రం 30ల్లోనే మొదలవ్వాలి అంటారు ఆర్థికరంగ నిపుణులు. అప్పటి నుంచే రిటైర్మెంట్‌ తదనంతర జీవితానికి అవసరమైన అంచనాలతో ప్రణాళిక సాగాలి. ఇప్పటి యువతరంలోనైతే కొంతమంది 50లోపే ఉద్యోగ విరమణ గురించి ఆలోచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని