విద్యా ‘కానుక’ గుత్తేదార్లకే!

వచ్చే విద్యా సంవత్సరంలో ‘విద్యాకానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు, బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి. 2023-24 విద్యాకానుకలకు సమగ్ర శిక్ష అభియాన్‌ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది.

Published : 08 Mar 2023 05:11 IST

బ్యాగ్‌పై సగటున రూ.92, బూట్లపై రూ.14 చొప్పున అధికం
2 లక్షల మంది విద్యార్థులు తగ్గినా.. రూ.155 కోట్ల భారం
ఈ ఏడాది చినిగిన బ్యాగ్‌లు సరఫరా చేసినా చర్యలు శూన్యం
అయిదు ప్యాకేజీల్లో ముగ్గురు పాత కాంట్రాక్టర్లే

ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరంలో ‘విద్యాకానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు, బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి. 2023-24 విద్యాకానుకలకు సమగ్ర శిక్ష అభియాన్‌ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. నోటు పుస్తకాలు మినహా మిగతా అన్నింటి సరఫరాకు ఇప్పటికే గుత్తేదార్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్లతో విద్యాకానుక కిట్లను అందించనున్నారు. బూట్లు, బ్యాగ్‌ల ధరలు 2022-23 నాటికంటే ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన, పెద్దసైజు బ్యాగ్‌లు ఇవ్వడం, ఈసారి మరింత మెరిసే బూట్లు కొంటున్నందున ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నా.. గుత్తేదార్లు రింగ్‌ కావడంతోనే ధరలు పెరిగాయన్న ఆరోపణలున్నాయి. బ్యాగ్‌ల సరఫరాకు మొదట టెండర్లు పిలిచినప్పుడు గుత్తేదార్లు రింగై ఎక్కువ ధరకు కోట్‌ చేయడంతో వాటిని రద్దుచేశారు. అనంతరం బ్యాగ్‌ల సైజులను మూడు రకాలుగా విభజించి, అయిదు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇందులో ఒక ప్యాకేజీ మినహా నాలుగింటిలో నిర్ణీత ధర కంటే 10% నుంచి 15% వరకూ అధికంగా కోట్‌ చేశారు. రివర్స్‌ టెండర్లలోనూ రెండు ప్యాకేజీల్లో ధర తగ్గకపోవడంతో గుత్తేదార్లతో అధికారులు బేరాలు చేశారు. చివరికి రూ. 272.90కి సరఫరా చేసేందుకు గుత్తేదార్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇది కూడా 2022-23లో ఇచ్చిన బ్యాగ్‌ ధర కంటే రూ.92 ఎక్కువ. విచిత్రమేమిటంటే మూడు ప్యాకేజీల్లో బ్యాగ్‌ల టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లు ఈ సంవత్సరం సరఫరా చేసినవారే! రెండు ప్యాకేజీలకే కొత్తవారు వచ్చారు. బ్యాగ్‌లను సరఫరా చేస్తున్న ఇద్దరు గుత్తేదార్లకు బూట్ల సరఫరాలోనూ రెండు ప్యాకేజీలు దక్కాయి. 2023-24లో సరఫరా చేయనున్న బ్యాగ్‌ల ధరలు రూ. 269.60 నుంచి రూ. 272.90 వరకూ ఉన్నాయి. ఒక్క ప్యాకేజీలోనే రూ. 269.60 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. జత బూట్లు, రెండు జతల సాక్సులను ఈ ఏడాది సరాసరిన రూ. 175కు అందించగా.. వచ్చే ఏడాది ఇచ్చేవాటి సగటు ధర రూ. 189. ఒక్కో దానిపై రూ. 14 వరకూ పెరిగింది. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు తగ్గినా... ఈసారి ప్రభుత్వ ఖజానాపై పడే భారం మాత్రం రూ.155.84 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం!

..అయినా చర్యలు తీసుకోరా?

ఈ ఏడాది సరఫరా చేసిన బ్యాగ్‌ల్లో నాణ్యత లేక చినిగిపోయినట్లు ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల సమయంలో గుత్తేదార్లు ఇచ్చిన నమూనా బ్యాగ్‌ కనిపించకపోయినా కిందిస్థాయిలో ఇద్దరు అధికారులను సెక్షన్‌ మార్చి, దీన్ని ముగించేశారు. బ్యాగ్‌లు చినిగినట్లు పెద్దసంఖ్యలో ఫిర్యాదులొచ్చినా గుత్తేదార్లు, అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు. రాష్ట్రవ్యాప్తంగా 45,14,687 మందికి బ్యాగ్‌లను సరఫరా చేయగా.. 15 రోజులకే చాలాచోట్ల చినిగిపోయాయి. జులై 5 నుంచి అక్టోబరు 7లోపు సరఫరా చేసినవాటిలో చినిగిపోయిన బ్యాగ్‌ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని సమగ్ర శిక్ష అభియాన్‌ ఆదేశించింది. దాదాపు 9 లక్షల బ్యాగ్‌లు చినిగినట్లు ప్రధానోపాధ్యాయులు నమోదుచేశారు. చినిగిన బ్యాగ్‌లను పిల్లలు వెనక్కి ఇస్తే కొత్తవి ఇవ్వలేదని విజిలెన్స్‌ తనిఖీల్లోనూ బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని