Karonda Tree: కంచె కోసం తీసుకొస్తే పంటగా ఎదిగింది.. ఒక్క మొక్క 80 ఎకరాలకు విస్తరించింది

పొలం కంచెకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చిన ఒక వాక్కాయ మొక్క 80 ఎకరాలకు విస్తరించి నేడు రైతులకు కాసులు కురిపిస్తోంది. బాపట్ల జిల్లా మండలకేంద్రం కొరిశపాడుకు చెందిన కడివేటి జగన్నాథరెడ్డి ఏళ్ల కిందట కాశీకి వెళ్లినప్పుడు అక్కడినుంచి కొన్ని మొక్కలు తీసుకువచ్చారు.

Updated : 14 Aug 2023 20:55 IST

వాక్కాయల సాగుతో లాభాల పంట

మేదరమెట్ల, న్యూస్‌టుడే: పొలం కంచెకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చిన ఒక వాక్కాయ మొక్క 80 ఎకరాలకు విస్తరించి నేడు రైతులకు కాసులు కురిపిస్తోంది. బాపట్ల జిల్లా మండలకేంద్రం కొరిశపాడుకు చెందిన కడివేటి జగన్నాథరెడ్డి ఏళ్ల కిందట కాశీకి వెళ్లినప్పుడు అక్కడినుంచి కొన్ని మొక్కలు తీసుకువచ్చారు. వాటిలో వాక్కాయ మొక్క ఒకటి. ఈ చెట్టుకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పొలం గట్టుపై వేస్తే కంచెగా ఉంటుందని భావించారు. జగన్నాథరెడ్డి సోదరుడు విశ్వనాథరెడ్డి తన పొలంలో గట్టుపై నాటారు. పెరిగాక దాని కాయలను విత్తనాలుగా మార్చి ఎకరం పొలంలో విశ్వనాథరెడ్డి సాగు చేశారు. లాభాలు రావడంతో ప్రస్తుతం 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 200 మొక్కలు నాటవచ్చు. తొలి ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగిందని రైతు తెలిపారు. రెండేళ్ల తరువాత ఒక చెట్టుకు 25 నుంచి 30 కిలోల వాక్కాయలు వచ్చాయి. ఎకరానికి సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధర కిలో రూ.50 ఉంది. అడవి జాతి మొక్క కావడంతో పెట్టుబడి ఖర్చు తక్కువ. ఏడాదికి రెండు మూడుసార్లు నీరందిస్తే సరిపోతుంది. పూత సమయంలో పురుగు సోకకుండా మందులు పిచికారీ చేస్తే దిగుబడి పెరిగే అవకాశముంది. బేకరీల్లో ఉండే చెర్రీ పండ్లను వీటితోనే తయారుచేస్తారు. విజయవాడ, కోల్‌కతా నుంచి వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొరిశపాడుకు చెందిన మహిళా రైతు ఎం.సునందన తమ పొలంలో పండిన వాక్కాయలతో పచ్చళ్లు తయారుచేస్తున్నారు. చింతపండుకు వీటిని ప్రత్యామ్నాయంగా వాడవచ్చని తెలిపారు.


12 ఎకరాల్లో సాగు చేస్తున్నాం

రైతు విశ్వనాథరెడ్డి

కంచె కోసం ఈ మొక్కను తీసుకువచ్చాం. అనంతరం ఎకరంలో సాగు చేశాం. లాభాలు రావడంతో 12 ఎకరాల్లో వేశాం. తోటి రైతులు మొక్కలు అడిగారు. గతంలో మేమే నాణ్యమైన మొక్కలు అందించేవాళ్లం. ప్రస్తుతం మొక్కల తయారీని ఆపివేశాం. గుంటూరు, ప్రకాశం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు విత్తనాల కోసం ఉచితంగా వాక్కాయలను ఏటా అందిస్తాం. చెట్టు నుంచి కాయలు కోసేందుకు యంత్రాన్ని తయారుచేయాలని గతంలో శాస్త్రవేత్తలను కోరాం. ఆ యంత్రం వస్తే కూలీ ఖర్చు తగ్గి లాభాలు వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని