పోలవరంలో ఇదేం దారుణం!

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండానే పనులు చేసేస్తున్నారా? ఆ సంస్థలు అనుమతి ఇవ్వకుండానే రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

Published : 03 Sep 2023 03:41 IST

కేంద్ర సంస్థల అనుమతి లేకుండానే పనులు
సీపేజీ నీటిని దిగువకు పంపేందుకు డిప్లీటింగ్‌ స్లూయిస్‌ నిర్మాణం
కేంద్ర జల్‌శక్తి దృష్టికి తీసుకువెళ్లిన పోలవరం అథారిటీ
విస్తుపోయిన కేంద్ర కార్యదర్శి చేయొద్దని చెప్పినా రాష్ట్రం వినడం లేదన్న పీపీఏ
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండానే పనులు చేసేస్తున్నారా? ఆ సంస్థలు అనుమతి ఇవ్వకుండానే రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిసింది. దిల్లీలో నాలుగు రోజుల కిందట కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి నిర్వహించిన కీలక సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి పీపీఏ తాజా పరిస్థితిని నివేదించినట్లు సమాచారం. పోలవరంలో ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య సీపేజీ వల్ల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంచనాలకు మించి నీరు వచ్చి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. ఆ నీటిని ఎత్తిపోయడం సులభం కాదు. పోలవరం పనులకు ఇదో పెద్ద సవాల్‌లా మారింది. కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ నిపుణులు వచ్చి ఇంకా ఈ ప్రాంతాన్ని పరిశీలించలేదు. మరోవైపు ఐఐటీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అలాంటిది దిగువ కాఫర్‌ డ్యాం కుడివైపున ఒక కొండతో అనుసంధానమయ్యే చోట తవ్వకాలు జరిపి డిప్లీటింగ్‌ స్లూయిస్‌ నిర్మాణపనులు రాష్ట్రం మొదలుపెట్టేసింది. ఇలాంటి ప్రతిపాదనను పీపీఏ దృష్టికి తీసుకువెళ్లినా వారినుంచి  అనుమతులు రాలేదు. ‘‘దిగువ కాఫర్‌ డ్యాం వద్ద ఎలాంటి తవ్వకాలు జరపవద్దు. అలా చేస్తే మళ్లీ దిగువ నుంచి నీరు ప్రధాన డ్యాం ప్రాంతంలోకి రావచ్చని చెప్పాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదు. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద పనులు ప్రారంభించేశారు’’ అని కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో పీపీఏ ఫిర్యాదు చేసింది. ఈ విషయం విని కేంద్రజల్‌శక్తి కార్యదర్శి విస్తుపోయారు. ఇప్పటికే పోలవరంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్ల ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమయింది. ఇన్ని సవాళ్లు ఎదురవుతుండగా కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర నిపుణులు సమన్వయంతో ముందుకు సాగవలసిన నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో కేంద్ర పెద్దలు విస్తుపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులన్నింటికీ డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ అనుమతి తీసుకున్నాకే చేశారు. తర్వాత ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం పోలవరంలో పెను సమస్యలకు దారితీసింది. కాఫర్‌ డ్యాంలు నిర్మించకుండా, డయాఫ్రం వాల్‌ నిర్మించడం తప్పని సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారు. అన్ని అనుమతులూ ఉండి చేస్తేనే విమర్శిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. అసలు ఎలాంటి అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. పైగా దిల్లీ సమావేశంలోనే పీపీఏ ఈ అంశాన్ని ప్రస్తావించడం కీలకం.

ఏం పనులు చేస్తున్నారు?

పోలవరం ప్రధాన డ్యాం నిర్మించేచోట వరద ప్రభావం లేకుండా ఉండేందుకు నిర్మించినవే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాలు. వాటినుంచి కొంత సీపేజీ ఉంటుంది. అది సహజం. కానీ అంచనాలకు మించి సీపేజీ వచ్చి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. ఈ విషయాన్ని రాష్ట్రం కేంద్ర సంస్థలకు నివేదించింది. దీని పరిష్కారానికి ఇంకా కేంద్ర సంస్థల నుంచి అనుమతులేవీ రాలేదు. ఈలోపే రాష్ట్రం పనులు చేపట్టేసింది. దిగువ కాఫర్‌ డ్యాం కుడివైపు ఒక కొండతో అనుసంధానమయ్యే చోట డిప్లీటింగు స్లూయిస్‌ తరహా నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం దిగువ కాఫర్‌ డ్యాం వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. బటర్‌ఫ్లై తరహాలో వాల్వ్‌ రూపంలో దీన్ని నిర్మిస్తున్నారు. దిగువ కాఫర్‌ డ్యాంకు దిగువన తక్కువ నీరు ఉండి... దిగువ కాఫర్‌ డ్యాంకు పైభాగంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో నిండిపోయిన నీటిని దిగువకు గ్రావిటీ ద్వారా పంపే వీలు ఉంటుంది. దిగువ కాఫర్‌ డ్యాం దిగువ నుంచి ఎగువకు నీరు రాకుండా.. ఎగువ నీరు గ్రావిటీ ద్వారా దిగువకు వెళ్లిపోయేలా ఈ నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. దిగువ కాఫర్‌ డ్యాం కుడివైపు కొండను కలిసేచోట అప్రోచ్‌ ఛానల్‌లా తవ్వుతారు. నీరు దిగువకు వెళ్లేటప్పుడు తెరుచుకునేలా, ఎగువకు నీరు రాకుండా మూసి ఉంచే ఏర్పాటు చేస్తారట. దిగువ కాఫర్‌ డ్యాం దిగువన +16 మీటర్ల నీటిమట్టం ఉన్నప్పుడు ఎగువ నీరు గ్రావిటీ ద్వారా వెళ్లిపోయేలా చేయాలనేది ప్రణాళిక. ఈ ఆలోచనకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని తెలిసింది. ఇంకా డిజైన్లు కూడా సమర్పించాలి. కేంద్ర జల్‌శక్తి శాఖ వర్గాల సమాచారం ప్రకారం పీపీఏ ఈ పని చేపట్టవద్దని అభ్యంతరం చెప్పింది. దిగువ కాఫర్‌ డ్యాం వద్ద ఎలాంటి పని చేసినా మరో సమస్య వస్తుందేమో చూడాలని చెప్పినట్లు సమాచారం. అలాంటిది అనుమతి లేకుండానే ఇప్పటికే తవ్వకం పనులు 20శాతానికిపైగా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ విషయమే జల్‌శక్తిలో చర్చనీయాంశమయింది.

సీపేజీపైనా చెప్పిన మాట వినలేదా?

ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీపై కూడా గతంలోనే కేంద్రం పలుసార్తు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు జాగ్రత్తపడలేదని సమాచారం. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ ఎక్కువగా ఉంది. అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలి. లేకపోతే పని సీజన్‌ కోల్పోతామని కేంద్ర సంస్థలు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు స్పందించలేదని జల్‌శక్తిలోని ఒక ప్రముఖుడు వెల్లడించారు. అంచనాలకు మించి సీపేజీ ఉన్నట్లు కనిపిస్తోందని వారు హెచ్చరించినా రాష్ట్ర అధికారులు కొట్టిపడేసినట్లు చెబుతున్నారు. ఈ సీపేజీ అంచనాకు 30 రెట్లు అధికంగా నీరు వచ్చింది. ఎగువ కాఫర్‌ డ్యాంకు పైవైపున గోదావరి నీటిమట్టం 39 మీటర్ల స్థాయిలో ఉంటే దిగువన ప్రధాన డ్యాం ప్రాంతంలో 14 మీటర్ల వరకు నీరు ఉండొచ్చని అంచనా వేశారు. ఆ మధ్య ప్రాంతంలో నేల ఎత్తు దాదాపు అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి అది పెద్ద సీపేజీ కాదని, ఆ నీటిని సులభంగా ఎత్తిపోసుకుంటూ పనులు చేసుకోవచ్చని అంచనాలు వేసుకున్నారు. అలాంటిది 22 మీటర్ల వరకు కూడా సీపేజీ నీరు నిలిచిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

తప్పుడు ఫార్ములాతో తప్పిన అంచనాలు

నిజానికి ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ముందే ఇద్దరు ప్రొఫెసర్లు ఎంత సీపేజీ ఉంటుందో అంచనాలు రూపొందించారు. నాడు పాటించిన ఫార్ములాలో కొన్ని విలువలు సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ అంచనాల్లో తేడాలు వచ్చాయని ఇంజినీరింగు అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని