‘జగన్‌ ఏలుబడిలో..’ క్రీడా వికాసం ఉత్తిదే..!

గ్రామస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అలాంటి వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

Updated : 24 Nov 2023 05:49 IST

లేని క్లబ్బులకు సీఎం నామధేయం
శాప్‌ వెబ్‌సైట్‌లోనూ కనిపించని వైనం
ప్రచార ఆర్భాటమే.. నిధుల విడుదల ఏదీ..?
ఈనాడు - అమరావతి


క్రీడా క్లబ్బుల ఉద్దేశం

గ్రామస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అలాంటి వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ఏర్పాటు చేసిన క్రీడా క్లబ్బుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించాలి. ఇందులో సచివాలయాల ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు భాగస్వాములు కావాలి.


ఆచరణలో పక్కదారి

క్రీడా క్లబ్బుల ఉద్దేశం క్రమంగా పక్కదారి పట్టింది. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడింది. మొదట హడావుడి చేసిన అధికారులు తరువాత మిన్నకుండిపోయారు. క్లబ్బుల రిజిస్ట్రేషన్‌, కార్యకలాపాల నిర్వహణ రికార్డులకే పరిమితమైంది. క్రీడాకారులు ముందుకొచ్చినా వీరిని ప్రోత్సహించే వారు కరవయ్యారు. క్రీడా క్లబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా శాప్‌ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు.


క్రీడల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమానికి నిధులివ్వడానికి ముఖ్యమంత్రి జగన్‌కు చేతులు రావడం లేదు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా ప్రచారం చేసుకోవడంలో తనకుమించిన వారు మరొకరు ఉండరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి తుస్సుమన్న క్రీడా క్లబ్బులకు జగన్‌ తాజాగా తన పేరు పెట్టుకున్నారు. స్పోర్ట్స్‌ క్లబ్బులుగా ఉన్న వీటి పేరును ‘జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్బులు’గా మార్చారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. జగన్‌ ప్రచార పిచ్చిని చూసి క్రీడాకారులు విస్తుపోతున్నారు. ఆచరణలో లేని క్రీడా క్లబ్బులకు జగన్‌ పేరా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని అధికారులకు తరుచూ ఆదేశాలిచ్చే ముఖ్యమంత్రి జగన్‌కు గ్రామాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదిన్నర కిందట గ్రామ సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా క్లబ్బులు కనిపించడం లేదు. ఇవి పని చేస్తున్నాయా? లేదా? అని  సమీక్షించే తీరికా ముఖ్యమంత్రికి లేదు. క్షేత్రస్థాయిలో ప్రతిభ కలిగి తగిన ప్రోత్సాహం లేక కనుమరుగవుతున్న క్రీడాకారులను గుర్తించి తగిన శిక్షణ ఇవ్వకపోతే జాతీయ క్రీడాకారులు ఎలా తయారవుతారు? మాటలు చెబితే సరిపోతుందా? క్రీడా క్లబ్బులకు నిధులివ్వకుంటే జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దేది ఎలా..?


చేతులెత్తేసిన మండల, జిల్లా పరిషత్‌లు

క్రీడా క్లబ్బుల మధ్య గ్రామస్థాయిలో పోటీల నిర్వహణకు మండల, జిల్లా పరిషత్తుల సాధారణ నిధుల నుంచి ఏటా 4% మొత్తాలను కేటాయించాలన్న ఆదేశాలు ఆచరణకు నోచుకోలేదు. వివిధ పద్దుల కింద ప్రభుత్వం నుంచి జిల్లా, మండల పరిషత్‌లకు రావాల్సిన నిధులను సరిగా విడుదల చేయడం లేదు. ఉన్న కొద్దిపాటి నిధులు సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో కొత్తగా ఎలాంటి పనులూ చేయడం లేదు. కేంద్రం మంజూరు చేసే ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం సరిగా ఇవ్వడం లేదు. దీంతో క్రీడా పోటీలకు నిధులివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలపై అత్యధిక జిల్లాల్లో జిల్లా, మండల పరిషత్‌లు చేతులెత్తేశాయి. దీంతో క్లబ్బులు ప్రారంభించాక ఇప్పటికీ జిల్లాల్లో గ్రామస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించలేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో క్లబ్బుల ఏర్పాటులో మొదట ఎంతో చురుగ్గా పాల్గొన్న క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెనక్కి తగ్గారు.


క్రీడా వికాస కేంద్రాలకూ గ్రహణం

క్రీడా కార్యక్రమాలకు తన పేరు పెట్టుకోవడంలో ముందుండే జగన్‌ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాలకు గ్రహణం పట్టించారు. గ్రామ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో గత ప్రభుత్వం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాల భవన నిర్మాణ పనులు ప్రారంభించింది. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయించింది. దాదాపు 50 నియోజకవర్గాల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జగన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక వీటిని పూర్తి చేయకుండా పక్కన పెట్టింది. ఇవి పూర్తయితే క్రీడాకారులకు గ్రామస్థాయిలో శిక్షణ అందుబాటులోకి వచ్చేది. భవన నిర్మాణాలు పూర్తయిన చోట వీటి నిర్వహణకు నిధులివ్వడం లేదు.


ఇలా ఏర్పాటు.. అలా కనుమరుగు

రాష్ట్రంలో 11,162 క్రీడా క్లబ్బులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి గత ఏడాది ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక క్లబ్బు ఉండేలా అప్పట్లో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం క్లబ్బుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి 2022 జూన్‌ 8న ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. పంచాయతీ, మండల, జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ అథారిటీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. క్రీడా క్లబ్బుల ఆధ్వర్యంలో ప్రతి నెలా పోటీలు నిర్వహించాలి. విజేతలతో మళ్లీ మండల, జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసి వీటిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. సంకల్పం బాగున్నా..నిధుల కొరతతో ఆచరణలోకి వచ్చే సరికి క్లబ్బులు చతికిలపడ్డాయి. వీటికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని